top of page

కర్ణాటకలో ఆ ముగ్గురే ఐదేళ్ల సీఎంలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 9 hours ago
  • 2 min read

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార బదిలీ ఖాయమైనప్పటికీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు. అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్ కార్యాలయానికి రాజీనామా సమర్పించడం, స్థానికంగా లేకపోయినా సరే.. గవర్నర్ దాన్ని ఆమోదించడం జరిగిపోయాయి. దాంతో కొత్త సీఎం అభ్యర్థిని ఖరారు చేయడం, ఆయన ఆధ్వర్యంలో కొత్త కేబినెట్ ఏర్పాటుకు రాజ్యాంగపరంగా మార్గం సుగమమైంది. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమారే నేతృత్వంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యం. కాకాపోతే కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం సీల్డ్ కవర్‌తో పరిశీలకులను పంపడం, లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో దాన్ని తెరిచి అధిష్టానం ఖరారు చేసిన నేత పేరు ప్రకటించడం, శంఖంలో పోసి తీర్థంగా మార్చినట్లు దాన్నే అతన్నే లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవడం వంటి తతంగాలు ఒకటిరెండు రోజుల్లో జరగనున్నాయి. అప్పుడు గానీ శివకుమార్ పేరు అధికారికంగా బయటకు వచ్చే అవకాశం లేదు. ఆ విషయం పక్కనపెడితే.. కర్ణాటక రాష్ట్రానికి ఇంతవరకు చాలా మంది ముఖ్యమంత్రులుగా చేసినప్పటికీ వారిలో ముగ్గురంటే ముగ్గురే ఐదేళ్ల పూర్తికాలం ఆ పదవిలో కొనసాగారు. సిద్ధరామయ్య కూడా మÖడేళ్లకే తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆయన గతంలో ఒకసారి ఐదేళ్లు సీఎంగా పని చేశారు. ఇప్పుడు సిద్ధరామయ్య స్థానంలో సీఎం అవుతారని భావిస్తున్న శివకుమార్ కూడా గరిష్టంగా రెండేళ్లే పదవిలో ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ సంస్కృతి ప్రకారం అసమ్మతులు, అసంతృప్తులు తలెత్తితే ఆలోగానే ఆయన్ను తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదు. అధిష్టానం ఇచ్చిన రాజ్యసభ ఆఫర్‌ను తిరస్కరించిన సిద్ధరామయ్య రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతానని స్పష్టం చేయడం చూస్తే ఎప్పుడైనా అసంతృప్తిరాగం వినిపించే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో బీజేపీ పాలనపగ్గాలు చేపట్టినప్పుడు కూడా ఇదే సంస్కృతి కొనసాగింది. కాగా స్వాతంత్య్రం సిద్ధించిన నాటినుంచి భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేవరకు మైసూర్ రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రం తర్వాత కర్ణాటకగా మారింది. ఆ మేరకు 1947 నుంచి 1952 వరకు కె.చెంగలరాయరెడ్డి తొలుత మైసూర్ రాష్ట్ర ప్రధానిగా, ఆ వెంటనే మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేశారు. అనంతరం 1956 వరకు మైసూరు కూర్గు రాష్ట్రంగా వ్యవహారంలో ఉన్నప్పుడు సీఎం పునాచ ముఖ్యమంత్రిగా చేశారు. కర్ణాటక రాష్ట్రంగా మారిన తర్వాత పరిస్థితి చూస్తే.. 1956 నుంచి 1962 వరకు దాదాపు ఆరేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. 1962లో రెండోసారి సీఎం అయిన ఎస్.నిజలింగప్ప 1968 వరకు ఆ పదవిలో కొనసాగి ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తొలి కర్ణాటక సీఎంగా చరిత్రకెక్కారు. సీనియర్ కాంగ్రెస్ నేత అయిన ఆయన ఆధునిక కర్ణాటక నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత పరిపాలనాపరమైన స్థిరీకరణ సాధించిన కాలంగా ఆయన హయాం గుర్తుండిపోతుంది. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన ఆయన 1960 చివరిలో పార్టీ అత్యంత సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న తరుణంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. నిజలింగప్ప పదవీకాలం ముగిసిన తర్వాత దశాబ్దకాలంపాటు కర్ణాటకలో ఏ ముఖ్యమంత్రి కూడా పూర్తి కాలం పదవిలో ఉండలేకపోయారు. ఆయన తర్వాత ఐదేళ్లు పదవిలో ఉన్న రెండో ముఖ్యమంత్రిగా దేవరాజ్ ఆర్స్ నిలిచారు. రాష్ట్ర చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. జాతీయ కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడిన సమయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి సన్నిహితుడిగా ఉంటూ భూ సంస్కరణలు, వెనుకబడిన తరగతులు, అణగారినవర్గాల కోసం విధానాల రూపకల్పన ద్వారా కర్ణాటక సామాజిక, రాజకీయ స్వరూపాన్ని మార్చివేశారు. 1972 నుంచి 1977 వరకు సీఎంగా ఉన్న ఆయన రాష్ట్రంలో కుల సమీకరణలను పూర్తిగా మార్చివేసి వెనుకబడిన వర్గాల రాజకీయ మనుగడకు పునాదులు వేసిన ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. వీరి తర్వాత 2013 నుంచి 2018 వరకు నిరాఘాటంగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన మూడో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. అయితే ఈ టర్మ్‌లో మాత్రం ఆయన మÖడేళ్లకే తప్పుకోవాల్సి వచ్చింది. రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన ఆయన మొత్తం మీద ఎనిమిదేళ్లు కొనసాగారు. మిగిలిన కాలమంతా కర్ణాటక రాష్ట్రం నిరంతరం రాజకీయ అస్థిరత్వాన్ని ఎదుర్కొంది. సంకీర్ణ ప్రభుత్వాలు, ఆపరేషన్ లోటస్ ఫిరాయింపులు, నాయకత్వ మార్పులు, అధికార పార్టీల అంతర్గత పోరాటాలు పరిపాలనను అస్థిరంగా మార్చివేశాయి. ఈ క్రమంలో కొందరు సీఎం అతి స్వల్పకాలం మాత్రమే పనిచేసి ఎటువంటి ముద్ర వేయకుండానే తప్పుకున్నారు. రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలం అంటే వారం మాత్రమే పదవిలో ఉన్న సీఎంగా బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప రికార్డు సృష్టించారు. ఆయన 2007 నవంబరులో ఆ పదవి చేపట్టిన తర్వాత జేడీఎస్-బీజేపీ భాగస్వామ్య ఒప్పందం పతనం కావడం, జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో మెజారిటీ నిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేశారు. కాగా 1971లో అప్పటి సీఎం వీరేంద్ర పాటిల్ రాజీనామా తర్వాత ఎసఆర్ కాంతి కొన్ని వారాలు మాత్రమే సీఎంగా పనిచేశారు. 2004 మేలో ఏర్పాటైన ధరమ్‌సింగ్ సీఎంగా ఏర్పాటైన కాంగ్రెస్`జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం 2006లో ఫిబ్రవరిలో కూలిపోయింది. 2012లో సదానందగౌడ స్థానంలో సీఎం అయిన జగదీష్ షెట్టార్ పదవీకాలం 2013 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే ఏడాదిలోపే ముగిసిపోయింది. పార్టీల్లో తలెత్తుతున్న అధికార పోరాటాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయన్నది ఈ ఉదంతాలతో తేలుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page