top of page

భయం కాదు.. ధైర్యం ఇవ్వండి సార్!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 11 hours ago
  • 3 min read

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈమధ్య తరచూ చర్చల్లో నలుగుతున్నది. ఎన్నడూ లేనివిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ విచారణల సందర్భంగా చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.. విమర్శల పాలవుతున్నాయి. ఇప్పటికే ఆయన పరుష వ్యాఖ్యల ఫలితంగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విపరీత చర్చ జరుగుతున్నది. ఈ నెల 15న ఒక కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి జస్టిస్ సూర్యకాంత్ విపరీత వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం, సద్యోగం లేని యువకులు బొద్దింకల్లా తయారై సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివిస్టుల రూపంలో వ్యవస్థలపై దాడి చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం రేగడంతో తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా కోట్ చేసిందని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. కాక్రోచ్ వివాదం ఇంకా పూర్తిగా సమసిపోక ముందే మరోవైపు నుంచి సీజేఐపై విమర్శలు మొదలయ్యాయి. పర్యావరణ సంబంధిత వ్యాజ్యాలు దాఖలు చేసే వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు భయాందోళన కలిగించే వాతావరణం సృష్టించే ప్రమాదం ఉందని, పర్యావరణానికి హాని కలిగించే చర్యలను, ప్రాజెక్టులను ఎవరూ సవాల్ చేయకుండా వెనక్కి తగ్గేలా చేస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ ఆందోళన వ్యక్తం చేసినవారు కూడా సాధారణమైన వారు కాదు.. ఏ ఒకరిద్దరో కాదు.. అఖిలభారత సర్వీసుల్లో కీలక పోస్టులు చేసిన 71 మంది రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు తమ ఆందోళనను తెలియజేస్తే నేరుగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌కు బహిరంగ లేఖ రాశారు. కాన్‌స్టిట్యూషనల్ కాండక్ట్ గ్రూప్ పేరుతో రాసిన ఈ లేఖలో గుజరాత్‌లోని పిపవావ్ పోర్టు విస్తరణకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. పిపవావ్ పోర్టు విస్తరణకు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) ఇచ్చిన అనుమతులను గ్రీన్ ట్రిబ్యునల్ సమర్థించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీలు విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ జోక్యం చేసుకుని ‘పర్యావరణ కార్యకర్తలు ఫలానా ప్రాజెక్టును స్వాగతిస్తున్నామని ఏనాడైనా చెప్పారా?’ అని వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ దేశ అత్యున్నత న్యాయాధికారి చేసిన ఈ వ్యాఖ్యలు ‘ఆందోళన కలిగించే పక్షపాత వైఖరిని’ ప్రతిబింబిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పౌరుల భావ వ్యక్తీకరణను అణచివేసి భయాన్ని పెంపొందిస్తాయి. పర్యావరణ నష్టం, ప్రజారోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలను ప్రశ్నించకుండా వారిని నిరుత్సాహపరుస్తాయి’ అని పేర్కొన్నారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, కేంద్ర పర్యావరణ శాఖ మాజీ కార్యదర్శి మీనా గుప్తా, మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త హర్ష్ మందర్, మాజీ విదేశాంగ కార్యదర్శి కె.రఘునాథ్, పంజాబ్ మాజీ డీజీపీ జూలియో రెబీరో వంటి ప్రముఖులు ఉన్నారు. దేశంలో పర్యావరణ కార్యకర్తలు చేసిన పోరాటాలు, అవి సాధించిన విజయాలను కూడా లేఖలో ప్రస్తావించారు. కేరళలో సైలెంట్ వ్యాలీ ఉద్యమం, ఉత్తరాఖండ్‌లో చిప్కో ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన్, కర్ణాటకలో అప్పికో ఉద్యమాలను ఉదహరించారు. ‘దశాబ్దాలుగా పర్యావరణ స్పృహ ఉన్న పౌరులకు, బాధితులకు సుప్రీంకోర్టే చివరి ఆశగా నిలుస్తున్నదని.. కానీ పర్యావరణ పరిరక్షణకు పోరాడుతున్న పౌరులను ఉద్దేశించి సీజేఐ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర విచారకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నియమించే పర్యావరణ అంచనా కమిటీలపై కోర్టు చూపిన నమ్మకాన్ని కూడా వారు ప్రశ్నించారు. ప్రభుత్వ పర్యావరణ అంచనా సంస్థలు, నిపుణుల కమిటీలు ఆమోదించిన ప్రాజెక్టులను సాధారణంగా నిలిపివేయకూడదని పిపవావ్ విచారణ సందర్భంగా కోర్టు సూచించడం సబబు కాదంటూ దేశ పర్యావరణ పరిపాలన వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయన్నారు. అరావళి పర్వతశ్రేణిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నిర్వచనాన్ని సుప్రీంకోర్టు మొదట అంగీకరించి, ఆ తర్వాత పునఃసమీక్షించడాన్ని వారు గుర్తు చేశారు. సరిస్కా టైగర్ రిజర్వ్‌లో రాజస్తాన్ సరిహద్దుల హేతుబద్ధీకరణ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు 2025 ఆగస్టులో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కోర్టు విమర్శించిన విషయాన్ని కూడా వారు ప్రస్తావిస్తూ ఈ కమిటీలు ప్రభుత్వ నిర్ణయాలకు రబ్బర్ స్టాంపులుగా మారుతున్నాయని లేఖలో ఆరోపించారు. చాలా వరకు ప్రాజెక్టులకు కళ్లు మూసుకుని అనుమతులు ఇస్తున్నాయని ఆరోపించారు. ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ 2014-24 మధ్య మౌలిక సౌకర్యాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం 1.73 లక్షల హెక్టార్లకుపైగా అటవీ భూమి బదలాయింపునకు ఆమోదం తెలిపిందని, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టాండింగ్ కమిటీ 2014-26 మధ్య పరిశీలించిన 2,186 ప్రతిపాదనల్లో 2,121 ప్రతిపాదనలను క్లియర్ చేసిందని ఉదహరించారు. పర్యావరణ అంచనా కమిటీలపై కోర్టులు గుడ్డి నమ్మకం పెట్టుకోకూడదని, ప్రజాప్రయోజన పర్యావరణ వ్యాజ్యాలను సమాజ సేవలో భాగంగా గుర్తించాలని రిటైర్డ్ అధికారుల బృందం కోరింది. ‘గౌరవ సీజేఐ మన దేశ పర్యావరణ సమగ్రత కోసం పౌరులు గొంతు విప్పడాన్ని నిరుత్సాహపరచకుండా ప్రోత్సహిస్తారని మేం ఆశిస్తున్నాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి మధ్య దేశంలో చాలా కాలంగా జరుగుతున్న ఘర్షణకు పిపవావ్ పోర్టు విస్తరణ వివాదం తాజా నిదర్శనం. సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను అవే ప్రభుత్వాలు నియమించే కమిటీలు వ్యతిరేకిస్తూ నివేదికలు ఇవ్వడం చాలా అరుదుగా తప్ప జరగదు. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది కూడా. ఇటువంటి వాటినే పర్యావరణ ఉద్యమకారులు తప్పుపడుతూ న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి కేసుల్లో ప్రజాప్రయోజనం ఉందా లేదా అన్నది చూడటంతోపాటు కేస్ టు కేస్ మెరిట్ ఆధారంగా సమగ్ర విచారణ జరిపి న్యాయస్థానాలు, న్యాయమÖర్తులు వ్యాఖ్యలు చేయాలి, తీర్పులు చెప్పడం ద్వారా సమాజానికి మేలు జరిగేలా చూడాలన్నదే రిటైర్డ్ అధికారులు లేఖ ఉద్దేశం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page