top of page

రెక్కలు తొడిగిన వ్యంగ్య ఉద్యమం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 3 min read

నిర్బంధాలు ఎల్లకాలం వ్యతిరేకతను తొక్కిపెట్టలేదు. తాము చెరుపు చేసినా అది చరిత్రే అన్న వక్రభాష్యానికి ప్రజలను బద్ధులను చేయడం ఎల్లకాలం సాధ్యం కాదు. ఏదో రూపంలో నిరసనలు, భిన్నాభిప్రాయాలు శిరమెత్తుతూనే ఉంటాయి. భౌతికంగా అవి కనిపించనంతమాత్రాన అంతా సవ్యంగా ఉందనుకోవడం భ్రమే అవుతుంది. దానికి ప్రబల సాక్ష్యమే ప్రస్తుతం శిరమెత్తి గర్జిస్తున్న డిజిటల్ వ్యంగ్య ఉద్యమం. ‘ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ బొద్దింకల మాదిరిగా సోషల్ మీడియా ద్వారా అందరిపైన దాడులు చేస్తూ ఉంటారు’.. అంటూ ఆర్టీఐ చట్టం కింద సమాచారం కోరిన కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అభిజిత్ అనే యువకుడు ‘అవును.. మేం బొద్దింకలమే.. మాది కాక్రోచ్(బొద్దింక) జనతా పార్టీ అంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన పోస్టు వైరల్‌గా మారి లక్షలాది మంది మద్దతుతో సామాజిక ఉద్యమంగా మారింది. సుప్రీం చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణంగా కనిపించవచ్చు. కానీ తరచి చూస్తే అంతర్లీనంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల పేరుకుపోయిన ఆగ్రహం, అసంతృప్తి ఈ డిజిటల్ ఉద్యమానికి ఉత్ప్రేరకంగా మారాయనడంలో సందేహం లేదు. దీనికి అజెండా చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అలాగే ప్రభుత్వం కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతాను నిలిపివేసినా.. కొన్ని గంటల వ్యవధిలోనే కాక్రోచ్ పార్టీ ఈజ్ బ్యాక్ అంటూ మళ్లీ కొత్త పేజీతో తలెత్తుకురావడం అంతర్లీన అసంతృప్తికి నిదర్శనం. ఏటా సుమారు 80 లక్షల మంది గ్రాడ్యుయేట్లు తయారవుతుంటే వారికి ఉద్యోగావకాశాల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది. మారుతున్న అవసరాలకు తగ్గట్లు విద్యావ్యవస్థను మార్చుకోకపోవటం ఈ దుస్థితికి కారణం. జై శ్రీరామ్ అనో, జై హింద్ అనో నినాదాలు చేసినంత మాత్రాన జీవితాలు బాగుపడవని యువత గ్రహిస్తోంది. పొదుపు చేయండి, ఖర్చులు తగ్గించుకోండి, త్యాగాలు చేయండి అని స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో చెప్పిన మాటలే ఇప్పుడు చెబుతుంటే ఇన్నాళ్లూ చేసిన బాసలు, పలికిన ప్రగల్బాలు వట్టివేనని తేలిపోయింది. ఫలానా వారు అవినీతిపరులంటూ ఈడీ, సీబీఐలతో దాడులు చేయించి.. తెల్లవారగానే వారినే పార్టీలో చేర్చుకొని ఏకంగా ముఖ్యమంత్రులను చేయటం వంటి కుటిల రాజకీయాలపై ఏహ్యభావం పెరిగింది. మహిళా రిజర్వేషన్లను అడ్డు పెట్టి డీలిమిటేషన్ బిల్లు తెచ్చి ఎంపీల సంఖ్య పెంచుకోవాలని చూడటాన్ని దొడ్డిదారి రాజకీయంగానే యువత భావిస్తున్నది. న్యాయమూర్తులకు, వారి పిల్లలకు నామినేటెడ్ పదవులు ఇవ్వటం, ముఖ్యంగా తమకు అనుకూలంగా తీర్పులిచ్చిన వారికి రిటైర్ అయ్యాక పదవులు కట్టబెట్టడాన్ని యువత నిరసిస్తున్నది. ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకొనే మీడియా కూడా పాలకపక్షాలకు వత్తాసు పలుకుతున్న పరిస్థితుల్లో సోషల్ మీడియానే క్రియాశీల పాత్ర పోషిస్తున్నట్లు ఈ బొద్దింకలు అనబడే జెన్‌జీ యువత భావిస్తున్నది. రిటైర్ అయ్యాక న్యాయమÖర్తులకు ఎలాంటి పదవులు ఇవ్వటానికి వీల్లేకుండా చట్టం చేయాలి, మహిళా రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలి, పార్టీలు మారిన వారిని పదవులకు దూరంగా ఉంచాలి, బడా కార్పొరేట్ శక్తులు మీడియా రంగంలోకి రాకుండా స్వతంత్ర మీడియాను ప్రోత్సహించాలి, ఇష్టారాజ్యంగా ఓటర్లను తొలగించటాన్ని మాని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బొద్దింకల పార్టీ డిమాండ్ చేస్తున్నదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికార దర్పం ఈ ఉద్యమాన్ని అణచివేయవచ్చు లేదా అదే చల్లారిపోవచ్చు. కానీ జెన్‌జీ బొద్దింకలు తెరపైకి తెచ్చిన అంశాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వానికి నష్టం తప్పదు. ఒక పెద్ద ఏనుగును చిన్న ఈగ ఎలా పిచ్చెక్కించగలదో.. ఈ వ్యంగ్యం కూడా వ్యవస్థల గంభీరమైన ముసుగులను తొలగించగలదు. సీరియస్ రాజకీయాలు చేయలేని పనిని, ఒక కార్టూన్ లేదా ఒక పారడీ అకౌంట్ సునాయాసంగా చేసేస్తుంది. అయితే అధికారం ఊరికే కూర్చోదు. దానికి ముప్పు పొంచి ఉందని గుర్తిస్తే వెంటనే అణచివేత అస్త్రాలు బయటకు వస్తాయి. కాక్రోచ్ జనతా పార్టీ విషయంలోనూ అదే జరిగింది. దాని స్క్రీన్ మీద ఒక నోటీసు ప్రత్యక్షమైంది. చట్టపరమైన డిమాండ్ కారణంగా ఈ ఖాతా నిలిపివేయబడిందన్నది దాని సారాంశం. కరోనా సంక్షోభం తర్వాత మ్యుటేషన్ అనే పదం అందరికీ సుపరిచతమైంది. ఒక బ్యాక్టీరియాను చంపడానికి ఒకే రకమైన యాంటీబయాటిక్ వాడితే అది చావకపోగా దాన్ని తట్టుకునేలా తన జన్యు రూపాన్ని మార్చుకుంటుంది. దీన్నే మ్యుటేషన్ అంటారు. డిజిటల్ ప్రపంచంలో కూడా సరిగ్గా ఇదే సూత్రం పనిచేస్తుంది. ఒక ఆలోచనను డిజిటల్ గోడలు కట్టి బంధించలేరు. అలా చేస్తే అది మరింత వేగంగా రూపాంతరం చెందుతుంది. అదే రీతిలో వ్యంగ్య పార్టీ చుట్టూ పాలకులు కట్టిన నిషేధాల గోడలను బద్దలు కొట్టుకుని కొత్త రూపంలో దూసుకొచ్చింది. కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనే కొత్త అవతారమెత్తింది. ఈ పేరులోనే ఒక సైంటిఫిక్ సత్యం ఉంది. బొద్దింకలకు అణుబాంబు రేడియేషన్‌ను కూడా తట్టుకుని బతికే శక్తి ఉంటుంది. అదే మాదిరిగా వ్యంగ్య పొలిటికల్ బొద్దింకలకు కూడా డిజిటల్ నిషేధాలను తట్టుకునే శక్తి వచ్చేసింది. అడ్డుగోడలు కడితే సమసిపోవడానికి సమస్య డిజిటల్ ఖాతాలో లేదు.. సమాజంలో పేరుకుపోయిన అసంతృప్తిలో ఉంది. ఆ మూల కారణాన్ని వదిలేసి డిజిటల్ స్క్రీన్లను నలుపు చేయడం వల్ల ఉపయోగం లేదు. పాత కాలంలో ఒక పేపర్‌ను నిషేధిస్తే సమాచారం ఆగిపోయేది. ఎందుకంటే అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ ఒక్కటే ఉండేది. కానీ నేడు ప్రతి మొబైల్ ఒక ప్రింటింగ్ ప్రెస్‌తో సమానం. ప్రతి నెటిజన్ ఒక పబ్లిషర్. ఒక లింక్ కట్ చేస్తే ఆ నెట్‌వర్క్ ఆటోమేటిక్‌గా మరో రూట్ వెతుక్కుంటుంది. ఇదో వికేంద్రీకృత సామాజిక స్పృహ. నిజానికి వ్యంగ్యం అనేది బలహీనుడి ఆఖరి ఆయుధం కాదు. అది బలవంతుడి అహంకారాన్ని దించే మొదటి అస్త్రం. ఎప్పుడైతే ఒక హాస్యం వ్యవస్థలకు భయం కలిగిస్తుందో అప్పుడే ఆ హాస్యం తన లక్ష్యాన్ని చేరుకుందని అర్థం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page