top of page

బండి ఇమేజ్‌పై ‘పుత్రవాత్సల్యం’ మరక!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 days ago
  • 3 min read

బాలికపై లైంగిక వేధింపుల కేసులో కేంద్ర HOME శాఖ సహాయ మంత్రి బండి SANJAY పుత్రరత్నం బండి భగీరథ్‌ను న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది. లొంగుబాటు ఎత్తుగడతో బెయిల్ పొంది వెంటనే బయటకొచ్చేయవచ్చనుకున్న బండివారి ఆలోచనలను కోర్టు చిత్తు చేసింది. వేసవి సెలవుల వరకు నో బెయిల్ అని తేల్చిసింది. కుమారుడిని ఇలా లొంగిపోయినట్లు చూపించి.. అలా బెయిల్ పేరుతో బయటకు తీసుకోచ్చేయన్న ప్లాన్‌తోనే మంత్రి SANJAY, వారి లాయర్ భగీరథ్ లొంగిపోయినట్లుగా ప్రచారం చేసుకున్నారు. ‘భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మేమే లాయర్ల సమక్షంలో పోలీసులకు అప్పగించాం’ అని స్వయంగా ఆయన తండ్రి, కేంద్ర మంత్రి బండి SANJAY తన ఎక్స్ ద్వారా తెలిపారు. కానీ ఆ వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి దీనికి పూర్తి విరుద్ధమైన ప్రకటన చేశారు. ‘నార్సింగిలో పోలీసు అకాడమీ దగ్గర భగీరథ్‌ను పట్టుకున్నాం. పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్‌కు తరలించాం’ అన్నది ఆయన ప్రకటన సారాంశం. దాంతో ఎవరు చెప్పింది కరెక్ట్ అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే లొంగిపోవడం, అరెస్టు కావడం .. బోత్ ఆర్ నాట్ సేమ్. రెండింటికీ చాలా తేడా ఉంది. ఏదైనా కేసులో నిందితుడు స్వయంగా లొంగిపోతే చట్టానికి సహకరించాడన్న కోణంలో అతడికి శిక్ష తగ్గించే అవకాశాలు ఉంటాయి. అదే అతడిని పోలీసులు అరెస్టు చేస్తే.. చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన నిందితుడిని బలవంతంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్లు అవుతుంది. ఇది నేరం. నేరారోపణల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడాన్ని కూడా నేరంగానే పరిగణించి రెండు నేరాలకూ శిక్ష విధిస్తారు. ఆ కోణంలో భగీరథ్ లొంగిపోయేలా తామే చేశామని అతని తండ్రి చేస్తున్న ప్రచారం కంటే అరెస్టు చేశామన్న పోలీసుల ప్రకటనలోనే ఎక్కువ విశ్వసనీయత కనిపిస్తున్నది. ఈ వ్యవహారంలో కొన్ని అంశాలు బండి వాదన సమర్థనీయంగా కనిపించడంలేదు. భగీరథ్‌ను అరెస్టు చేశామని పోలీసు కమిషనర్ అధికారికంగా ప్రకటించారు. అందువల్ల ఆయన అరెస్టు రికార్డుల్లో నమోదైనట్లే. కానీ తన కుమారుడు పోలీసులకు లొంగిపోయాడని మంత్రి బండి తన వ్యక్తిగత ఎక్స్ పోస్టు ద్వారా మాత్రమే వెల్లడించారు. కేంద్ర HOME మంత్రిహోదాలో అధికారిక సోషల్ మీడియాలో ప్రకటించకపోవడంతో ఆయన చెప్పింది ప్రాథమికంగా చట్టం ముందు చెల్లదు. ఇలాంటి వాదనలు న్యాయస్థానాల్లోనూ నిలబడవు. ఇంకో కోణంలో చూస్తే.. భగీరథ్ నిజంగా లొంగిపోయుంటే దానికి సంబంధించిన రికార్డెడ్ ఆధారాలతో అతని లాయర్లు బెయిల్ పిటిషన్ వేసేవారు. తదనుగుణంగా వాదనలు వినిపించేవారు. కానీ అలా జరగలేదని తెలుస్తున్నది. సరే.. తన కుమారుడు లొంగిపోయేలా తామే చేశామన్న మంత్రి బండి వాదనే కరెక్ట్ అనుకుంటే.. మరి ముందుగానే పోలీసులకు సరెండర్ చేయకుండా లుకౌట్ నోటీస్ జారీ చేసేవరకూ ఎందుకు ఊరుకున్నారు? అనే ప్రశ్నలు వస్తాయి. దీనికి కవరింగ్ ఇచ్చేందుకు బండి సంజయ్ ప్రయత్నించారు. ‘కంప్లైంట్ రాగానే పోలీసులకు అప్పగించాలనుకున్నా.. ముందు లాయర్లను సంప్రదించాం, మా దగ్గరున్న ఆధారాలు పరిశీలించిన లాయర్లు కచ్చితంగా బెయిల్ వస్తుందని భరోసా ఇచ్చారు. అందుకే విచారణకు హాజరుకావడంలో కొంత జాప్యం జరిగింది’ అని సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. ఐతే ‘ఏ తప్పూ చెయ్యకపోతే బెయిల్ ఎందుకు రాదు? ఒకవేళ లాయర్లు బెయిల్ రాదు అని చెప్పి ఉంటే.. భగీరథ్‌ను అప్పగించకుండా ఉండేవారా?” అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అలాగే ఈ నెల ఎనిమిదో తేదీన భగీరథ్‌పై పోక్సో కేసు నమొదైంది. ఆ తర్వాత మరికొన్ని నాన్‌బెయిలబుల్ సెక్షన్లు చేర్చి కేసులు మరింత బలంగా బనాయించారు. ఆ సమయంలోనే భగీరథ్ తరఫున కరీంనగర్ టూటౌన్ పోలీసు స్టేషన్‌లో బాధితురాలిపై తప్పుడు కేసు నమోదు చేయించారు. అలాగే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లను మేనేజ్ చేసి భగీరథ్‌కు అనుకూలంగా బాధితురాలికి వ్యతిరేకంగా ఆమె ఫొటోలు, వీడియోలతో ప్రచారం చేయించారు. ఇందుకుగాను వీరిపై ఇప్పుడు చట్టపరంగా చర్యలు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ చూస్తే కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించడానికే మంత్రి బండి అన్నిరకాలుగా ప్రయత్నించారని, అవేవీ ఫలించకపోవడంతో లొంగుబాటు కలరింగ్ ఇచ్చి కొడుకునే చట్టానికి అప్పగించారన్న క్రెడిట్, సానుభూతి కొట్టేయాలని విఫలయత్నం చేశారని అర్థమవుతుంది. అసలు ఈ విషయంలో చుట్టూ ఉన్న కోటరీ ఇచ్చిన సలహాలే మంత్రి బండిని గాడి తప్పించాయన్న వాదనలు ఉన్నాయి. సామాన్య కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి స్వల్పకాలంలోనే ఎంపీగా, జాతీయ పార్టీ అయిన బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన క్రమంలో ఎన్నో సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నారు. కేంద్ర HOME శాఖకు సహాయమంత్రిగా ఉన్న ఆయన తన HOME లోని సమస్యనే సరైనరీతిలో పరిష్కరించలేక పీకల మీదికి తెచ్చుకున్నారు. పుత్రరత్నం కేసు బండి రాజకీయ జీవితంలోనే మాయని మచ్చగా మారింది. తెలంగాణలో బీజేపీకి మంచి ఊపు తీసుకొచ్చి నిలబెట్టారన్న ఖ్యాతిపై ఈ మరక పడింది. అది ఆయన భవిష్యత్తును కూడా ఇబ్బందుల్లో పడేసినట్లే. నిందితుడు భగీరథ కోసం స్వయంగా కేంద్ర మంత్రి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సమస్య మొదలైనప్పుడే కేసును మేనేజ్ చేసేందుకు ప్రయత్నించకుండా చట్టపరంగా, హుందాగా స్పందించి కొడుకును పోలీసులకు అప్పగించి ఉంటే వివాదం ఇంత దూరం వచ్చేది కాదు. పైగా మంత్రిహోదా లో ఉన్నా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమారుడిని పోలీసులకు అప్పగించి చట్టాన్ని, మంత్రి పదవిని గౌరవించారన్న మంచిపేరు లభించేది. కాస్త సానుభూతి కూడా దక్కి ఉండేది. కానీ కేసును నీరుగార్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి విఫలమైన తర్వాత వేసే లొంగుబాటు డ్రామాలు రక్తికట్టవు. రక్షించవు!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page