ఎక్కువమందిని కంటే సాకేదెవరు?
- DV RAMANA

- 13 hours ago
- 3 min read

ప్రపంచమంతా జనాభా బాంబు భయంతో బెంబేలెత్తిపోతున్నది. ఎందుకంటే జనాభా విస్ఫోటనం సామాజిక సంతులనాన్ని దెబ్బతీస్తుంది. ప్రణాళికలను తలకిందులు చేస్తుంది. పెరిగే జనాభాకు కనీస వసతులతోపాటు ప్రధానమైన కూడు, గూడు, నీడ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. జనాభా అదుపుతప్పితే అది తలకుమించిన భారంగా మారుతుంది. అందువల్లే మెజారిటీ దేశాలు కుటుంబ నియంత్రణ పద్ధతులు అమలు చేస్తున్నాయి. మితిమీరిన కు.ని. వల్ల జనాభా పతనబాట పట్టిన చైనాలాంటి కొన్ని దేశాలు మాత్రమే అధిక సంతానం కనండి. ప్రోత్సాహకాలు అందుకోండి అని ప్రోత్సహిస్తున్నాయి. కానీ భారత్‌లో ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే దేశ జనాభా చైనాను దాటేసి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి చేరింది. దీన్ని అదుపు చేసేందుకు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. అప్పుడెప్పుడో ప్రచారంలోకి తెచ్చిన ‘మేమిద్దరం.. మాకిద్దరు’, ‘చిన్న కుటుంబం.. చింతల్లేని కుటుంబం’ వంటి నినాదాలు ఇప్పటికీ ప్రభావవంతంగానే ఉన్నాయి. దేశంలో 48.7 శాతం జంటలు ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకోవాలని భావిస్తున్నట్లు కొన్ని అధ్యయనాల్లో స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో చైనా తదితర దేశాల తరహాలో ‘ఎక్కువమంది పిల్లలను కనండి.. ప్రోత్సాహకాలు అందుకోండి’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు సంతానంతో ఆగిపోకుండా మÖడో బిడ్డకు జన్మనిస్తే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు జన్మనిస్తే రూ.40 వేలు ప్రసవం జరిగిన వెంటనే తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని.. ఆ విధంగా ఆ పిల్లల పోషణభారాన్ని ప్రభుత్వం తీసుకునే ఈ కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఇటీవల నరసన్నపేట పర్యటనలో ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి ఆయన చెబుతున్న కారణాలు కూడా ఆలోచించదగ్గవే. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు జాతీయ సగటు కంటే చాలా వేగంగా తగ్గిపోతున్నది. 1993లో ఏపీ సంతానోత్పత్తి రేటు(టీఎఫఆర్) 3.0 ఉండేది. కానీ 2005 నాటికి 2.1కి, 2019`21 కాలానికి 1.5 స్థాయికి పడిపోయింది. అదే సమయంలో జాతీయ టీఎఫఆర్ 1.9 శాతం కావడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో వృద్ధజనాభా పెరుగుతూ యువజనుల సంఖ్య తగ్గుతున్నది. దేశంలో మనుషుల సగటు వయసు 28.4 ఏళ్లు కాగా.. మన రాష్ట్ర సగటు వయసు దానికంటే ఎక్కువగా 32.5 ఏళ్లుగా ఉంది. సీనియర్ సిటిజన్లు పెరిగిపోవడం వల్ల ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. ఇది రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనను జనాభా నిష్పత్తి ప్రకారం చేపడుతున్నారు. దీనివల్ల జనాభా పెరుగుతున్న ఉత్తరాది రాష్ట్రాలో ఎక్కువగా, పెరుగుదల తక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తక్కువ సీట్లు పెరుగుతాయి. దీనివల్ల పార్లమెంటులో మన రాష్ట్ర ప్రాతినిధ్యం తగ్గి.. పాలనలో, నిధుల మంజూరులో ప్రాధాన్యం తగ్గిపోతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కువమంది పిల్లలను కనాలని పిలుపునిస్తున్నారు. రాజకీయ, సామాజిక కోణంలో ఆయన ఆలోచన కరెక్టే కావచ్చు. కుటంబాలపరంగా చూస్తే మాత్రం కరెక్టు కాదన్న వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. పూర్వం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. కుటుంబంలో ముగ్గురు నలుగురు సంపాదనపరులు, ఆదాయం ఇచ్చే ఆస్తులు ఉమ్మడిగా ఉండేవి. అలాగే ఎక్కువమంది పిల్లలు ఉన్నా.. వారిని సాకడానికి ఇంట్లో మహిళలకు కూడా క=దవ ఉండేదికాదు. కానీ ఆధునిక సమాజంలో ఆ పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ స్థానంలో చిన్న కుటుంబాలు వచ్చాయి. మెజారిటీ కుటుంబాల్లో ముగ్గురు నలుగురికి మించి ఉండటం లేదు. పైగా జీవన వ్యయం పెరిగిన పరిస్థితుల్లో ఒకరి సంపాదన సరిపోక భార్యాభర్తలిద్దరూ ఉపాధి కోసం ఉదయాన్నే వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో చిన్నపిల్లలను చూసుకునేవారు ఉండరు. వారికోసం డేకేర్ సెంటర్స్ లేదా వర్కింగ్ మెయిడ్స్‌కు ఫీజులు, జీతాలు చెల్లించి ఏర్పాటు చేసుకోవాలి. అదీకాకుండా పిల్లలను కనండి అని చెప్పడం సులభమే.. కానీ ఒక తల్లి గర్భంలో పడినప్పటి నుంచి పుట్టేవరకు.. ఆ తర్వాత అడ్డాల నాటినుంచి గడ్డాలు పెరిగే వరకు పెంచి ఒక మంచి జీవితం ఇవ్వడం చాలా సవాళ్లతో కూడుకున్నది. బిడ్డ గర్భంలో పడినప్పటినుంచీ వైద్యపరంగా చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా కాబోయే తల్లి ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగం, ఇతర చిన్నపనులు చేసుకునే మాతృమÖర్తులకు ఆర్థికంగా భారమైనది. ఇక బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని నెలలపాటు పూర్తిగా ఇంటిపట్టునే ఉండాలి. పైగా చాలా ఖర్చులు పెరుగుతాయి. పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఆ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. స్కూళ్లలో చేర్పించడం, పెద్ద చదువులు చెప్పించడం, మంచి ఉద్యోగమో ఉపాధో సంపాదించి జీవితంలో స్థిరపడేవరకు అండగా నిలవడం ఆ తల్లిదండ్రులకు నిత్య సమరంలాంటిదే. ఈ బాధ్యతను డబ్బుతో కొలవకూడదు గానీ.. ఒకవేళ అలా కొలవాల్సి వస్తే ఒక్క బిడ్డకు సంపూర్ణ జీవితం ఇవ్వడానికే కనీసం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఖర్చవుతాయి. అలాంటిది కుటంబంలో ముగ్గురు నలుగురు పిల్లలుంటే ఆ ఖర్చును తలచుకుంటేనే భయమేస్తుంది. అందుకే మెజారిటీ దంపతులు ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకునేందుకు సిద్ధపడుతున్నారు. అయితే అదనంగా మÖడో బిడ్డను కంటే రూ.30 వేలు, నాలుగో బిడ్డను కంటే రూ.40 వేలను ప్రభుత్వం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 20 ఏళ్ల కాలానికి అవి ఎంత ఎక్కువగా లెక్కలేసుకున్నా రూ.10 లక్షలకు మించి అందవు. పైగా అప్పటికే పెరిగే జీవన వ్యయంతో పోలిస్తే అవి ఎందుకూ సరిపోవు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వంపై ఈ పథకం వందల కోట్ల అదనపు భారం కూడా మోపుతుంది. ఈ పరిస్థితుల్లో ఎక్కువమంది పిల్లలను కంటే వారికి భవిష్యత్తుకు, ఉపాధికి భరోసా ఇవ్వగలరా? అన్న ప్రశ్నలకు బహుశా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పలేకపోవచ్చు.






Comments