top of page

సూక్తులు, స్కోత్కర్షలే సంక్షోభ పరిష్కర్తలా?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 3 min read

ప్రస్తుత సంక్షోభ సమయంలో చాలా దేశాలు ధరాభారంతో జనాల్ని బాదేస్తుంటే.. పెట్రోలు, గ్యాస్, ఇతర సరుకులకు రేషన్ విధిస్తుంటే.. మన సర్కారు మాత్రం ప్రజలపై ఈషన్మాత్రమైనా భారం పడకుండా కాపాడుకుంటున్నదని.. అద్భుతమైన పారిన్ పాలసీతో చమురు, గ్యాస్, ఇతర ముడి పదార్థాలకు కొరత లేకుండా మేనేజ్ చేస్తున్న బాహుబలి సర్కారు మనదని గత కొంతకాలంగా అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు మెజారిటీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఒకటే మోత ప్రచారం. తానా అంటే తందానా అనడానికి కొందరు ‘మోత’బరులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కదా! ఇక వారి హడావుడికి అడ్డేలేదు. ఇంతా చేస్తే మనదేశ సంరక్షకుడు పొదుపు సూత్రాలు వల్లె వేశారు. కీలకమైన చమురు, బంగారం, ఎరువులు, తదితర అత్యవసరాల వాడకాన్ని తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. అక్కడితో ఆగకుండా ఒకదాని వెంట ఒకటిగా పన్నుల వాత, ఆంక్షల మోత మోగించుకుంటూ పోతున్నారు. ఏడాదిపాటు బంగారాన్ని కొనవద్దని పిలుపునిచ్చిన మోదీ మరోవైపు దిగుమతులను అడ్డుకునేందుకు సుంకాన్ని ఆరు నుంచి అమాంతం 15 శాతానికి పెంచేశారు. ఇక వెండి దిగుమతులపై పూర్తిగా ఆంక్షలు విధించారు. అదే సమయంలో పెట్రోలు, డీజిల్ ధరలను వారం వ్యవధిలోనే రెండుసార్లు పెంచేశారు. వాణిజ్య గ్యాస్ ధరను ఒకేసారి వెయ్యికిపైగా పెంచేశారు. వీటన్నింటికంటే ముందే డొమెస్టిక్ గ్యాస్ ధరను సిలెండర్‌కు రూ.60 పెంచేశారు. సామాన్యులకు ఇవన్నీ అర్థం కావు. కొందరు భజనపరులు అర్థం అయినా స్వామి మాయలో మునిగి అర్థం కానట్లే భజన చేస్తుంటారు. ఈ పొదుపు సూత్రాలు, ఆంక్షలు, పన్నుల మోతలను వాస్తవ దృక్పథంతో పరిశీలిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నదని స్పష్టంగా అర్థమవుతుంది. రూపాయి విలువ వేగంగా పతనమవుతున్నది. కానీ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద గణాంకాలతో కుస్తీ పట్టాల్సిన, తలలు పగులగొట్టుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు. మన వంటగదిని, మన పంట పొలాన్ని చూస్తే సరిపోతుంది. నిన్నటి వరకు రూ.100కే వచ్చిన కూరగాయలు ఈరోజు రూ.140 దాటుతున్నాయి. పెట్రోల్ బంక్‌కు వెళ్లిన ప్రతిసారి మీటర్ వేగం పెరుగుతోంది. పాలు, బియ్యం, గ్యాస్, బస్సు ఛార్జీలు, మందులు.. ఇలా అన్నింటి ధరలు ఒక్కొక్కటిగా పెరుగుతూ పోవడం ఒక పెద్ద ఆర్థిక మార్పునకు సంకేతం. విడివిడిగా చూస్తే సరుకుల రేట్లు పెరిగినట్లు పెద్దగా కనిపించదు. పెట్రోల్ ధర పెరిగితే రెండు రూపాయలే కదా అనుకుంటాం. కానీ పాల మీద రూపాయి, కూరగాయల మీద రూ.పది, మందుల మీద రూ.10, గ్యాస్ మీద రూ.50.. ఇవన్నీ కలిపి చూస్తే అసలు భారం అర్థమవుతుంది. పెట్రో ధరలు పెంచేతి మనకేంటి?, బంగారం ధర పెరిగితే మనకేంటి.. ఎరువుల ధరలు ఎగబాకితే మనదేం పోతుంది.. అని చాలామంది మిడిమిడి జ్ఞానంతో వాదిస్తుంటారు. కూరగాయలు ట్రక్కుల్లో వస్తాయి, బియ్యం లారీల్లో వస్తుంది, పాలు వ్యాన్లలో వస్తాయి, ఆన్‌లైన్ ఆర్డర్లు డెలివరీ బైక్‌ల మీద వస్తాయి. ఈ మొత్తం వ్యవస్థకు ఇంధనం అవసరం. అందుకే పెట్రోల్ లేదా డీజిల్ ధర పెరిగితే అది కేవలం వాహనదారుల సమస్యగానే మిగిలిపోదు. అన్ని రంగాలను, అన్ని రకాల వస్తువుల ధరలను ప్రభావితం చేస్తుంది. ఇది తెలుసుకోకుండా ‘పెట్రోల్ లేకపోతే నడిచి పోతాం, గ్యాస్ లేకపోతే కట్టెలతో వండుతాం’ అనేవి పిచ్చి వాదనలే. ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే చిన్న వ్యాపారాలు కుదేలవుతున్నాయి. అత్తెసరు జీతాలు, సంపాదనతో బతికేవాళ్ల జీవితాలు దుర్భరం అయిపోతాయి. డాలర్ బలపడుతూ రూపాయి విలువ పతనం అవుతున్నదంటే.. డాలర్‌తో మనకేం సంబంధం అని వాదించే మÖఢ భక్తులను, గుడ్డిగా తమ నాయకులను సమర్థించే నైజం చూస్తుంటే ఒకరకమైన భయం కలుగుతుంది. డాలర్ విలువ రూ.70 ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్ నుంచి వంద డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకోవాలంటే రూ.7వేలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.96 ఉన్నందున అవే వస్తువుల కోసం రూ.9600 చెల్లించాల్సి వస్తున్నది. ఆ మేరక భారం ప్రజలపైనే పడుతుంది. అయితే ఒకేసారి పూర్తి భారం వేయకుండా, నొప్పి తెలియకుండా క్రమంగా పెంచుకుంటూ పోతారు. మనదేశం క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎరువులు, బంగారం, వంట నూనెలు, కొన్ని ఆహార ఉత్పత్తులు వంటి అత్యసవర, నిత్యావసరాలకు దిగుమతులపైనే ఆధారపడుతున్నది. అందువల్ల రూపాయి బలహీనపడితే దిగుమతుల బిల్లు పెరుగుతుంది. దానికి అనుగుణంగా దేశంలో ధరలు పెరుగుతాయి. ఇక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని రైతులకు సూచించడం రాబోయే అతిపెద్ద సంక్షోభాన్ని సూచిస్తోంది. ఎరువుల కొరత బయటికి చిన్న సమస్యలా కనిపించినా అది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ యుద్ధాలు, రవాణా ఖర్చులు, గ్యాస్ ధరలు పెరగడం వంటి పరిణామాలు ఎరువుల సరఫరాపై ప్రభావం చూపుతాయి. ఇక దిగుమతి భారం తగ్గించుకోవడానికి ఏడాదిపాటు బంగారు కొనవద్దని అయ్యగారు హితవు పలికారు. కానీ బంగారు వస్తువుల తయారీపై ఆధారపడే లక్షలాది స్వర్ణకార(విశ్వకర్మ) కుటుంబాల పరిస్థితి ఏమటన్నది పట్టించుకోని పరిస్థితి. అవన్నీ నిజమే కానీ.. ‘యుద్ధం వల్ల సంక్షోభం ఏర్పడితే పెద్దాయన ఏం చేస్తాడు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కేవారికి ఒక మాట. కష్టకాలంలో ఏదో ఒకటి చేయడానికే కదా అయ్యగారిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాం. కానీ మీరేం చేశారు! మీ ఫ్రెండు అమెరికా పెద్దన్న ప్రాపకం కోసం రష్యాతో దిగుమతుల ఒప్పందాలను గంగలో కలిపేశారు. ఆ పెద్దన్నేమో మన పక్కలో బల్లెంలా ఉన్న చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడూ మనమే ఎటూ చెందకుండా రెంటింకీ చెడిపోయే దుస్థితి. ఇప్పుడేమో తగుదున్నమా అంటూ పొదుపు చేయాలనడం సబబు కాదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page