top of page

రాజకీయాల్లో తరం మారుతోంది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 hours ago
  • 2 min read

ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. కేరళంలో పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనకు సెలవు చెప్పి UDFకు పట్టం కట్టారు. పక్కనే ఉన్న తమిళనాడులో దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యానికి చెక్‌పెట్టి కొత్త పార్టీకి పట్టాభిషేకం చేశారు. మరోవైపు తూర్పున పశ్చిమ బెంగాల్లో రెండు దశాబ్దాల మమత పాలనకు తెరదించేశారు. ఇవన్నీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ద్వారా జరిగితే.. ఇటు కర్ణాటకలో మూడేళ్ల ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వం మార్చడానికి సిద్ధమైంది. సీఎం సిద్ధరామయ్య నుంచి కొత్త నాయకుడు డీకే శివకుమార్ అధికారం చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే దేశ రాజకీయాలు తరం మార్పు దిశగా సాగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేత సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవడంతో దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం చంద్రబాబే (75) ఇప్పుడు అత్యంత సీనియర్. ఆయన అనుభవం, పరిపాలన దక్షత, జాతీయస్థాయిలో రాజకీయ సంబంధాలు టీడీపీకి, ఎన్డీయే కూటమికి అదనపు బలంగా ఉపయోగపడతాయి. కానీ రాజకీయాల్లో ఒక దశ తర్వాత ‘ఈ నాయకుడి తర్వాత ఎవరు?’ అనే చర్చ సహజంగానే తెరపైకి వస్తుంది. రెండు మూడేళ్లుగా ఏపీ రాజకీయాల్లోనూ ఇదే ప్రశ్న వినిపిస్తున్నది. నిన్నటి టీడీపీ మహానాడులో కొత్త నాయకత్వం గురించి మర్పు సంకేతాలు మరింత స్పష్టమయ్యాయి. అయితే దీన్ని వయసురీత్యా మార్పు అనేకంటే జనరేషన్ ఛేంజ్(తరం మార్పు)గానే పరిగణించాలి. మహానాడులో యువ నాయకత్వంపై పెరిగిన ప్రొజెక్షన్, భవిష్యత్తు గురించిన ప్రజెంటేషన్లు ఆ పార్టీలో తరం మార్పు సంకేతాలనిచ్చాయి. సాధారణంగా ఇలాంటి మార్పులు ఉన్నఫళంగా, ఒక్కసారిగా జరగవు. ముందుగా కొత్త నాయకత్వానికి ప్రజామోదం సాధించేలా పావులు కదుపుతారు. పార్టీ కేడర్ నుంచి ఆంగీకరించేలా చేస్తారు. చివరగా కలిసి ఉండే పార్టీలకు భవిష్యత్ స్వరూపానికి సంబంధించి సంకేతాలు ఇచ్చి మానసికంగా సిద్ధం చేస్తారు. ప్రస్తుతం టీడీపీలో ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉందన్న చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలో ఉండగా జాతీయ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు పార్టీ.. రాష్ట్రంలో ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వంలో, రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అత్యంత కీలకం. 2024లో ఎన్డీయే విజయంలో చంద్రబాబు గవర్నెన్స్ ఇమేజ్ ఎంత ముఖ్యమో, పవన్ కళ్యాణ్ ఎమోషనల్ మొబలైజేషన్, యాంటీ వైఎస్సార్‌సీపీ కన్సాలిడేషన్ కూడా అంతే ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు ముందే తెలుగుదేశంలో పూర్తిస్థాయి నాయకత్వ మార్పు జరిగితే కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన దాన్ని ఎలా స్వీకరిస్తుందన్నది చాలా ముఖ్యం. పవన్‌కల్యాణ్ వరకు చంద్రబాబును గౌరవిస్తారు. కానీ జనసేన క్యాడర్ మాత్రం భవిష్యత్తులో తమకు మరింత అధికార వాటా కావాలని ఆశించడం సహజం. అలాంటి పరిస్థితుల్లో నాయకత్వ మార్పు జరిగితే ఎన్నికల్లో సీట్ల పంపకం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంత్రివర్గ కూర్పు వంటి అంశాలు చిక్కుముళ్లుగా మారవచ్చు. ఇక కూటమి మరో భాగస్వామి విషయానికొస్తే.. నరేంద్ర మోదీ, అమిత్ షా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కేవలం ఒక రాష్ట్రం కాదు. ఇది దక్షిణ భారత రాజకీయ విస్తరణ ప్రాజెక్టులో వ్యూహాత్మక రాష్ట్రం. అందుకే పార్టీ ఇప్పటికిప్పుడు ఎదిగిపోవాలనే తాపత్రయం కంటే క్రమానుగత ఎదుగుదలకు ప్రాధాన్యమిస్తుంది. ఎందుకంటే కూటమిలో అనిశ్చితి ఏర్పడితే 2029 ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. చంద్రబాబు రాజకీయ శైలి చూస్తే ఆయన హఠాత్ నిర్ణయాల కంటే దశలవారీ మార్పులకే ఇష్టపడతారు. ఒకదాని తర్వాత ఒకటిగా వ్యవస్థలను తర్వాత తరానికి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యనిర్వహక అధ్యక్ష పదవి సృష్టి, పార్టీ రాష్ట్ర, స్థాయి నాయకత్వంలో మార్పులు వంటివన్నీ దానికి సంకేతాలు. కొన్నాళ్లపాటు అధికారికంగా చంద్రబాబే ముఖచిత్రంగా కొనసాగుతూ సమాంతరంగా అందరికీ ఆమోదయోగ్యంగా భవిష్యత్ నాయకత్వాన్ని బలోపేతం చేయడం ఆయన ప్లాన్‌గా కనిపిస్తున్నది. రాజకీయాలో ఇది అత్యంత సురక్షితమైన అధికార బదిలీ ప్రక్రియ. చంద్రబాబు ఆలోచనకు తగినట్లే లోకేష్ కూడా వీలు చిక్కినప్పుడల్లా పవన్ ను పొగడ్తల భుజాల మీద మోయడం, ఆయన లేనిదే తాము లేమన్నట్లు మాట్లాడటం వంటివి జరుగుతున్నాయి. అయితే పూర్తిస్థాయి నాయకత్వ మార్పు 2029కి ముందా? ఆ ఎన్నికల తర్వాతా? అన్నదే ఇప్పుడు టీడీపీ ముందున్న సంశయం. నాయకత్వ మార్పు సజావుగా పూర్తి చేయడానికి ప్రస్తుతానికి ఆ పార్టీ ముందు మÖడు ఆప్షన్లు ఉన్నాయి. 2029 వరకు చంద్రబాబే పూర్తి స్థాయి అధికార కేంద్రంగా కొనసాగడం.. అంతర్గతంగా భవిష్యత్ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం. ఈ కార్యాచరణ స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది. కూటమి స్ట్రక్చర్ దెబ్బతినడకుండా కాపాడుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది రెండేళ్ల ముందునుంచే కొత్త నాయకత్వాన్ని పూర్తిగా ప్రొజెక్ట్ చేయడం రెండో ఆప్షన్. ఇది దీర్ఘకాల వ్యూహంగా పనికొచ్చినా రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఇవన్నీ కాకుండా ఇప్పుడున్నట్లే.. చంద్రబాబే ప్రధాన అధికార కేంద్రంగా కొనసాగుతూ యువ నాయకత్వానికి ఆపరేషనల్ కంట్రోల్, రాజకీయ నాయకత్వం అప్పగించడం మూడో ఆప్షన్. ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ సంకేతాలు చూస్తే మూడో ఆప్షన్ వైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ప్రతి చిన్న పరిణామం మొత్తం సమీకరణాలను మార్చేస్తాయి. ఈ కోణంలోనే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో.. ముఖ్యంగా అధికార కూటమి ప్రధాన భాగస్వామ్య పార్టీలో బయటకు ఏమీ లేనట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం పెనుమార్పుల కదలికలు తీవ్రమవుతున్నాయి. ఇవి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తునే కాకుండా రాష్ట్రం రాజకీయాల దశదిశలను మార్చేవిగా మారినా ఆశ్చర్యం లేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page