అక్కడ నడకే ఉయ్యాల జంపాలా.. పోతే ఆ రోడ్డుపైనే సాగాల!
- NVS PRASAD

- May 24, 2025
- 2 min read
గతుకులతో చితికిన మేదరవీధి రోడ్డు
పెద్దమార్కెట్‌కు ఇదే ప్రధాన మార్గం
నిత్యం వాహనాల రాకపోకలతో తీవ్ర రద్దీ
ప్రమాదాలతో వాహనదారుల సావాసం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలోని మేదరవీధిలో వెదురుతో అల్లిన ఉయ్యాలలో ఊగితే స్వింగ్ అవుతారో లేదో తెలీదు గానీ.. ఆ రోడ్డు మీద నడవాల్సి వస్తే మాత్రం ఉయ్యాలా జంపాలా.. అంటూ ఊగకుండా వెళ్లడం కష్టం. మేదరవీధి అని పేరుకు చెప్పుకుంటాం గానీ.. అది పెద్దమార్కెట్‌కు ప్రధాన మార్గం. భారీఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో గతంలో హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ ఇక్కడే ఉన్నప్పుడు దిట్టంగా సీసీ రోడ్డు వేశారు. ఆ తర్వాత హోల్‌సేల్ మార్కెట్ లక్ష్మీ థియేటర్ పక్కకు వెళ్లిపోయినా మిగిలిన కిరాణా, చేపలు, చికెన్ మార్కెట్లు మాత్రం ఇక్కడే కొనసాగుతున్నాయి. నగరంలోని మిగతా వీధి రోడ్లపై రాకపోకలు సాగించే వాహనాల సంఖ్యతో పోలిస్తే మేదరవీధి రోడ్డులో ప్రయాణించే వాహనాల సంఖ్య పదిరెట్లు ఎక్కువగా ఉంటుంది. బహుశా అందుకే రోడ్డును బలంగా నిర్మించి ఉంటారు. కానీ ప్రస్తుతం ఈ రోడ్డు పూర్తి అస్తవ్యస్తంగా తయారైంది. మార్కెట్ రోడ్డు కావడం, దశాబ్దాల తరబడి కార్పొరేషన్‌కు ఎన్నికలు లేకపోవడం, ప్రజా పాలకులు రాకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్ కళ్లెదుటే కనిపిస్తున్నా పట్టించుకునేవాడు కనిపించలేదు. సీసీ రోడ్డు పాడైందని గతంలో అందిన ఫిర్యాదు మేరకు దానిపైనే మందంగా బీటీ (తారు రోడ్డు) వేశారు. ఆ తర్వాత కాలంలో ఎండకు తారు కరిగిపోయింది. వాహనాల టైర్లతో పాటు పిక్క వెళ్లిపోయింది. దీంతో కింద సీసీ రోడ్డు.. పైన బీటీ రోడ్ల మధ్య పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. సాధారణంగా రోడ్డుపై ఒకవైపు గోతులు ఏర్పడితే మరో పక్కగా వెళ్లడానికి వాహనదారులు ప్రయత్నిస్తారు. కానీ ఈ రోడ్డు మొత్తం గుంతలు పడటంతో ఉయ్యాలా జంపాలా మాదిరిగా వాహనం దిగితే మళ్లీ లేచే పరిస్థితి కనిపించదు. ఇక యాక్టివా లాంటి స్కూటీ తరహా వాహనాలైతే ఈ గోతుల్లో పడిన తర్వాత లేచి తోసుకోవాల్సిందే. ఈ రోడ్డుకు రెండువైపులా 50కి పైగా చికెన్ దుకాణాలుంటాయి. ఫిష్ మార్కెట్‌కు మెయిన్ ఎంట్రన్స్ ఇటు నుంచే. మేదర వీధికి ముఖద్వారం ఇదే. అన్నిటికీ మించి ఉయ్యాలా జంపాలా అంటూ ఈ ప్రాంతంలో ఎవరైనా పోతే నలుగురు మోయాలనేది కూడా ఈ రోడ్డు పైనుంచే! గోల్కొండ రేవు రోడ్డు మీదుగా నాగావళిలో శ్మశానానికి వెళ్లాలంటే మొండేటివీధి, మేదరవీధి, కాకివీధి, రంగిరీజు వీధి, ఎచ్చెర్లవీధి, బలగవీధితో పాటు అనేక ప్రాంతాల వారికి ఇదే మార్గం. ఇప్పుడంటే స్వర్గధామమంటూ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ పక్కన ఒక శ్మశానం ఏర్పాటు చేసి, మోసే బాధ లేకుండా వాహనమెక్కించి దహన సంస్కారాలు చేస్తున్నారు గానీ, పాత శ్రీకాకుళం ప్రాంతం వారికి నాగావళి ఒడ్డే శ్మశానం. ఇప్పుడు ఈ రూట్‌లో శవయాత్ర చేయాలంటే ఉయ్యాలా జంపాలా తప్పడంలేదు.










Comments