అతడి కబందహస్తాల్లో.. బీసీ శాఖ బందీ!
- BAGADI NARAYANARAO
- 6 days ago
- 3 min read
జిల్లా బీసీ సంక్షేమ శాఖలో రిటైర్డ్ ఉద్యోగి పెత్తనం
రెండు హాస్టళ్లకు షాడో వార్డెన్‌గా చెలామణీ
డీబీసీడబ్ల్యూవోగా ఎవరొచ్చినా వారితో కుమ్మక్కు
బదిలీలు, ఇన్‌ఛార్జీల నియామకాల్లోనూ హవా
ఆ రెండు హాస్టళ్లు ఆయన చేతిలో బందీ అయిపోయాయి. అలా అని ఆయన ఆ కార్యాలయ అధికారా? అంటే కాదు.. కనీసం ఉద్యోగి కూడా కాదు. ఒకప్పుడు ఈ శాఖలో పని చేసిన ఆయన పదవీ విరమణ చేసి చాలా ఏళ్లయిపోయింది. అయినా బీసీ సంక్షేమ శాఖలో ఆచారి చక్రం తిప్పుతున్నారని చెప్పడం పాత విషయం. డీబీసీడబ్ల్యూవోగా ఎవరు వచ్చినా ఆచారి చెప్పినట్టే నడుచుకోవడంపై అనేకసార్లు అనేక పత్రికల్లో కథనాలు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోకుపోవడం పాత విషయం. అయితే ఈ శాఖలో బదిలీలు, పదోన్నతుల విషయంలోనూ ఆచారి తన టాలెంట్‌ను మరోసారి బయటపెట్టడమే కొత్త విషయం.

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
బీసీ సంక్షేమ శాఖ పరిధిలో రణస్థలం మండలం కొమరవానిపేట బాలురు, జీరుపాలెం బాలికల వసతి గృహాలకు ఒకే ఉద్యోగి ఐదేళ్లకు పైగా వార్డెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల బాగోగులు పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న వార్డెన్ గుణవతిని తక్షణమే బదిలీ చేయాలని ఆయా గ్రామాలకు చెందిన మత్స్యకారులు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఐదేళ్లకు పైగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్న గుణవతిని బదిలీ చేయకుండా ఆ శాఖ డీడీ అనురాధ తాత్సారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు గుణవతి పదేళ్ల క్రితమే ఉద్యోగ విరమణ చేసిన ఆచారి అనే వ్యక్తికి హాస్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించి.. ఆమె విధులకు దూరంగా ఉంటున్నారని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆచారి హాస్టల్‌లో అనధికారికంగా విధులు వెలగబెట్టడానికి వీలుగా.. గుణవతికి కేవలం రెండుచోట్లకు మాత్రమే బదిలీ అయ్యేటట్టు జిల్లాస్థాయిలో మేనేజ్ చేస్తున్నారు. ఆ మేరకు జీరుపాలెం లేదా కొమరవానిపేట హాస్టళ్లకు మాత్రమే ఆమెను బదిలీ చేస్తున్నారు. ఇందులో ఏ ప్రాంతానికి బదిలీ అయినా మరో ప్రాంతానికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ విధంగా గత ఏడేళ్లుగా గుణవతికి బదులు విధులు నిర్వహిస్తున్న ఆచారి ఈ రెండు స్థానాల్లో కుర్చీలాట ఆడిస్తున్నారు. మొదట జీరుపాలెం బదిలీ చేసి కొమరవానిపేట ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. తర్వాత కొమరవానిపేటకు బదిలీ చూపించి జీరుపాలేనికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇలా గుణవతిని ఆ రెండుచోట్లకు తప్ప వేరొక చోటకు బదిలీ చేయలేదు. కొమరవానిపేట బాలుర వసతి గృహం కాబట్టి పెద్దగా ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ జీరుపాలెం బాలికల వసతి గృహంలో మహిళా ఉద్యోగిని గుణవతిని డమ్మీ చేసి బీసీ సంక్షేమశాఖతో సంబంధం లేని రిటైర్డ్ పురుష ఉద్యోగి ఆచారి తిష్ట వేసి వ్యవహారాలు నడుపుతుండటంతో బాలికలు ఇబ్బంది పడుతున్నారు. గుణవతిని ముందుపెట్టి తెరవెనుక కొమరవానిపేట, జీరుపాలెం హాస్టళ్లకు వార్డెన్‌గా చెలామణీ అవుతున్న ఆచారిపై ఉన్నతాధికారులు, బీసీ సంక్షేమశాఖ అధికారికి పలువురు అనేకమార్లు ఫిర్యాదులు ఇచ్చినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని విమర్శలున్నాయి.
ఆమె లోపాలే.. అతనికి వరాలు
తొలుత అటెండర్‌గా ఉన్న గుణవతి వార్డెన్‌గా ఉద్యోగోన్నతి పొందడానికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పేరుతో ఫేక్ డిగ్రీి సర్టిఫికేట్ సమర్పించినట్టు అభియోగాలున్నాయి. దీని జెన్యూనిటీని నిర్ధారించకుండానే ప్రమోషన్ ఇచ్చేశారు. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చినా ప్రస్తుత, గత బీసీ సంక్షేమ శాఖ డీడీలు డబ్బులు తీసుకొని వాటిని పక్కన పడేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఆచారి ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఫేక్ డిగ్రీ సర్టిఫికేెట్ తయారు చేయించింది కూడా ఆచారేనని అభియోగం ఉంది. జెన్యూనిటీ నిర్థారణకు శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీకి బీసీ సంక్షేమశాఖ రిఫర్ చేయకుండానే, ఆ వర్సిటీ జెన్యూనిటీ ఇచ్చినట్టు ఒక ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సదరు సర్టిఫికెట్‌లో యూనివర్సిటీ రాజముద్ర లేకపోగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకం పెట్టాల్సిన చోట డిప్యూటీ రిజస్ట్రార్ సంతకం ఉందన్న అభియోగాలు ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండానే గుణవతిని వార్డెన్‌గా ప్రమోట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. జీరుపాలెం వసతి గృహంలో బాలికల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని కొన్ని రోజుల క్రితం జిల్లా ఎస్పీకి గ్రీవెన్స్‌లో స్థానికులు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీనిపై నిజనిర్ధారణ జరగాల్సి ఉంది. శాఖతో సంబంధం లేని ఆచారి బీసీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న మహిళా వార్డెన్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దూషిస్తున్నారని, కార్యాలయ విధులకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారంటూ గత ఏడాది మే 28న ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి బాధితులు ఫిర్యాదు చేశారు. దీన్ని విచారణ కోసం జిల్లా బీసీ సంక్షేమ శాఖకు పంపించారు. కానీ బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారులు దాన్ని తొక్కిపెట్టి ఆచారిని కాపాడారని విమర్శలున్నాయి. సదరు ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తప్పుడు బిల్లులతో ఖజానాకు చిల్లు
కోవిడ్ కారణంగా జిల్లాలోని అన్ని వసతి గృహాలతోపాటు కొమరవానిపేట, జీరుపాలెం హాస్టళ్లను కూడా రెండు నెలలు పాటు మూసేశారు. వేసవి సెలవుల తర్వాత కూడా ఈ రెండు హాస్టళ్లను తెరవలేదు. అప్పట్లో దీనిపై అన్ని ప్రధాన దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ హాస్టళ్లను తెరిచి విద్యార్ధులకు ఆశ్రయం కల్పించినట్టు వార్డెన్ గుణవతి ద్వారా ఆచారి బిల్లు పెట్టించి ప్రభుత్వ ఖజానాకు రూ.2 లక్షల మేరకు చిల్లు పెట్టారు. ఆడిట్, పత్రికల ద్వారా ఇది బయటపడటంతో దీనిపై విచారణకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఉన్నతాధికారులు నియమించారు. ఆ మేరకు విచారణాధికారి వార్డెన్ గుణవతికి నోటీసులు ఇస్తే.. ఆమె బదులు ఆచారే సంతకం పెట్టి రిప్లై స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీన్ని తిరస్కరించగా.. బీసీ సంక్షేమ అధికారితో చేతులు కలిపి ఎస్సీ కార్పొరేషన్ అధిóకారిని బెదిరించి విచారణ జరగకుండా అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరి ఒత్తిడి కారణంగానే విచారణాధికారి తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత కలెక్టర్ కూడా బదిలీ కావడంతో నిధుల దుర్వినియోగంపై విచారణను జరగకుండా చేస్తున్నారు.
ఆరా తీస్తున్న ఏసీబీ
ఇటీవల జరిగిన బదిలీలు, డిప్యూటేషన్లు, వసతి గృహాలకు ఇన్‌ఛార్జీల నియామకాల్లో కూడా ఏమాత్రం సంబంధం లేని ఆచారితో కలిసి నిర్ణయాలు తీసుకున్నట్టు ఆ శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. రిటైర్డ్ ఉద్యోగి అయిన ఆచారిని బీసీ సంక్షేమశాఖ అధికారిణి కార్యాలయానికి పిలిపించి సమావేశం కావడంలో ఆంతర్యం ఇదేనని ఆరోపిస్తున్నారు. శాఖలో ఉద్యోగులు, వసతి గృహాల్లో విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు, జిల్లా కార్యాలయం వేదికగా చేస్తున్న అక్రమ వసూళ్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా కలెక్టరేట్ ఏవో, కలెక్టర్ సీసీలను మేనేజ్ చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా మంత్రి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే పేషీలో ఉన్న సీసీలను సైతం ప్రలోభపెట్టి ఉన్నతాధికారులు నుంచి ఇబ్బందులు రాకుండా చేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఏసీబీ అధికారులు బీసీ సంక్షేమశాఖ నుంచి వివరణ కోరడంతో పాటు, జాబితాలు ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది.
Kommentare