అదొక అవినీతి ‘ఖజానా’
- Prasad Satyam
- 2 days ago
- 3 min read
ఏటీవో లాగిన్ నుంచి బిల్లులు పాస్ చేసిన డీడీ
ఒక్కరోజు సెలవు పెట్టినందుకు రిటైర్మెంట్‌కు ముందు క్షోభ అనుభవిస్తున్న రమణారెడ్డి
లంచాలు తీసుకోలేమన్నందుకు దిగువస్థాయి సిబ్బందికి వేధింపులు
డీడీ లాగిన్‌లో 200 బిల్లులు పెండింగ్
ఎరియర్స్ చెల్లింపుల ద్వారా భారీ మొత్తంలో కమీషన్లు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన జీపీఎఫ్, పెన్షనర్ల కార్యక్రమం నిర్వహించడానికి ప్రతి సబ్ ట్రెజరీ నుంచి డ్రాయింగ్ అధికారుల ద్వారా రూ.5వేలు చొప్ప్పున రూ.60వేలు వసూలు చేశారు. ఇది కాకుండా జిల్లా ట్రెజరీలో ఉన్న డ్రాయింగ్ అధికారుల ద్వారా మరో రూ.60వేలు తీసుకున్నారు. ఈ రెండింటినీ పక్కన పెడితే మూడు పెన్షనర్ల అసోసియేషన్ల నుంచి రూ.30వేలు వసూలు చేశారు. తీరా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అయ్యే ఖర్చుల్లో కొంత భాగం జిల్లా కలెక్టర్ కార్యాలయం భరించింది. కాబట్టి ఇందులో మిగిలిన సొమ్మును కొత్త కలెక్టరేట్‌లో ఉద్యోగులు ఆడుకోడానికి వీలుగా క్రీడాపరికరాలు కొనుగోలు చేయాలని కోరుతున్నాం.
..ఇదీ జిల్లా అగ్రికల్చరల్ కార్యాలయం డ్రాయింగ్ అధికారి పి.సుబ్రహ్మణ్యం పేరుతో కలెక్టర్ గ్రీవెన్స్‌కు ఈ ఏడాది జనవరి 2న ఇచ్చిన ఫిర్యాదు
జిల్లాలో ఉన్న 15 సబ్ ట్రెజరీల్లో లంచగొండితనం బాగా పెరిగిపోయింది. ఇందుకు కారణం.. వీటి ఇన్‌స్పెక్షన్‌కు వెళ్లే ఖజానా అధికారి రవికుమార్ ఎక్కువ మొత్తంలో మామూళ్లు అడగడమే. ఒక విజిట్‌కు వెళ్తే.. ఒక సబ్‌ట్రెజరీ నుంచి రూ.30వేలు తీసుకుంటున్నారు. గత్యంతరం లేక ఎస్‌టీవోలు బిల్లుల చెల్లింపులకు పర్సంటేజీ పెంచేశారు. డీడీగా రవికుమార్ వచ్చిన దగ్గర్నుంచి సిబ్బంది బదిలీకి రూ.20వేలు, ఖజానా శాఖలో సీటు మార్చడానికి రూ.10వేలు రేటు పెట్టేశారు. ఇది కాకుండా బ్రాందీ, విస్కీ షరా మామూలే.
... ఇదీ జిల్లా పెన్షనర్ల సంఘం తరఫున ఏసీబీకి ఈ ఏడాది జనవరి 31న ఒక గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు.
జిల్లా ట్రెజరీలో అసిస్టెంట్ ఖజానా అధికారిగా పని చేస్తున్న తాను ఒకరోజు సెలవు పెడితే, నా లాగిన్ నుంచి నా ప్రమేయం లేకుండా లక్షలాది రూపాయల బిల్లులను డీడీ రవికుమార్ పాస్ చేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. వీలుంటే ఆయన మీద చర్యలు తీసుకోండి. లేదా ఈ బిల్లులు వెనక్కు పంపించండి.
... ఇది స్వయంగా స్టేట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్‌కు ఇక్కడి ఏటీవో ఎన్‌వీ రమణారెడ్డి త్రూ ప్రోపర్ ఛానల్ ఇచ్చిన ఫిర్యాదు.
ఇవన్నీ గమనిస్తే.. జిల్లా ఖజానా శాఖలో పెద్ద ఎత్తున ఏదో జరుగుతోంది. డీడీ రవికుమార్ అవినీతి పర్వం మీద ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. ఏమాత్రం మొహమాటం లేకుండా ముక్కుపిండి వసూలు చేసుకునే రకం. గతంలో ఇదే రవికుమార్ అవినీతిని ‘సత్యం’ పత్రిక ఎండగట్టినప్ప్పుడు ఆయనకు బాసటగా నిలిచిన ఉద్యోగులే ఇప్ప్పుడు ఆయన్ను కాలితో తన్నడానికి ఎందుకొచ్చారు? (డీడీ రవికుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఇలాగే పేర్కొన్నారు.) జిల్లా ట్రెజరీలో సొమ్ములిస్తేనే పనులు జరుగుతాయన్న విషయం అందరికీ తెలుసు. అలాగని రూల్ పొజిషన్ లేకుండా ఎలాపడితే అలా బిల్లులు పాస్ చేయడానికి పరిస్థితి పూర్వంలా లేదు. దీనికి తోడు ట్రెజరీలో పని చేస్తున్న చాలామంది యువ ఉద్యోగులు, రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న మరికొందరు ఆఫీసర్లు అవినీతికి దూరంగా ఉన్న మాట కూడా వాస్తవం. లంచం ఇచ్చినచోట పని పూర్తయిపోవడం కావాలి. కానీ పైస్థాయి అధికారికి లంచమిచ్చి, కిందిస్థాయి అధికారితో కొర్రీలు పెట్టించుకుంటే వ్యవహారం బయటకు పొక్కుతుంది. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది.
జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2002 టీచర్లు తమ సర్వీస్ కాలాన్ని కోల్పోయారని, వీరికి ఆర్థికంగా బెనిఫిట్ చేకూర్చాలన్న ఉద్దేశంతో నోషనల్ ఇంక్రిమెంట్‌ను ప్రభుత్వం వేసింది. అయితే ఇందుకు సంబంధించిన పత్రాలు సమర్పించడంలో కొంతమంది ఉపాధ్యాయులు విఫలమయ్యారు. దీంతో జిల్లా ట్రెజరీలో ఏటీవో ఎన్‌వీ రమణారెడ్డి వద్దే ఇవి పెండింగ్‌గా మిగిలిపోయాయి. సరిగ్గా ఈ ఏడాది జనవరి 31న ఎన్‌వీ రమణారెడ్డి ఒకరోజు సెలవు పెట్టడంతో ఆయన లాగిన్ నుంచి స్వయంగా డీడీ రవికుమారే 9 ఎరియర్ బిల్లులను పాస్ చేశారు. దీని విలువ రూ.28,66,720. ఇందులో ఎంత కమీషన్ ఆయనకు ముట్టిందో తెలియదు గాని, రమణారెడ్డి పేరుతో ఈయనే ఒకే చేసేశారు. వాస్తవానికి సహాయ ఖజానాధికారే బిల్లులు విడుదల చేయడానికి ఫైనల్ అధికారి. అకౌంటెంట్ బిల్లులు పరిశీలించి ఎస్‌టీవోకు పంపితే, ఎస్‌టీవో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసి ఏటీవోకు పంపుతారు. అన్నీ సవ్యంగా ఉంటే, ఆయన సంతకంతోనే బిల్లు పాసవుతుంది. అయితే ఇక్కడ కొంతమందికి ఎరియర్స్ ఇవ్వడానికి అభ్యంతరాలు ఉండటంతో వాటిని నిలుపుదల చేశారు. కానీ ఈయన సెలవుపెట్టిన రోజున డీడీ దాన్ని పాస్ చేశారు. ఇదే విషయాన్ని రమణారెడ్డి ట్రెజరీస్ డైరెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పటికే తన లాగిన్‌లో అనేక బిల్లులు ఉన్నాయని, అన్నింటినీ పాస్ చేసివుంటే రొటీన్ అనుకునేవాడినని, కేవలం అభ్యంతరాలున్న 9 బిల్లులు మాత్రమే పాస్ చేయడం వెనుక ఏదో జరిగిందని ఆయన ఫిర్యాదు చేశారు. స్వయంగా డీడీ రవికుమార్ లాగిన్‌లోనే 200 బిల్లులు పెండింగ్ ఉన్నాయని, వాటిని ముట్టకుండా ఒక్కరోజు తాను సెలవు పెట్టినందుకు 9 ఎరియర్స్ ఇచ్చేశారని, తాను త్వరలో రిటైరవ్వబోతున్న నేపథ్యంలో నేరం తనపై మోపే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాస్తవానికి సంబంధిత ఏటీవో సెలవు పెడితే అర్జంటుగా ఇవ్వాల్సిన జీతాలు, పెన్షన్లు మాత్రమే డీడీ లాగిన్ నుంచి పాస్ చేయొచ్చు. అలా కాకుండా ఎరియర్స్‌ను పాస్ చేయడం వెనుక పెద్ద మొత్తంలోనే సొమ్ములు చేతులు మారాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో జిల్లా ట్రెజరీలో ఉద్యోగులు రెండుగా చీలిపోయారు. ఇటీవల ఏసీబీ అధికారులు రికార్డులను పరిశీలించడం, హెడ్ క్వార్టర్‌లో ఉన్న సబ్‌ట్రెజరీ అధికారి, అకౌంటెంట్ ఏసీబీకి దొరికిపోవడంతో ఈమధ్య ఆచితూచి జిల్లా ట్రెజరీ వ్యవహరిస్తోంది. ఇటువంటి సమయంలో అడ్డదిడ్డంగా బిల్లులు చేయాలని డీడీ కోరడంతో చేయడానికి నిరాకరించిన ఇద్దరు ఉద్యోగులపై డీడీ ఏకపక్షంగా చర్యలు తీసుకున్నారు. ఒకర్ని రణస్థలం బదిలీ చేస్తూ మరొకరికి శ్రీకాకుళంలోనే రెండుసీట్లు అప్పగిస్తూ స్వయంగా డీడీయే ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఇది కూడా కిందినుంచి పైవరకు ఉన్న అధికారులు సంతకం చేసి పంపిన తర్వాత డీడీ ఫైనల్ ఉత్తర్వులు ఇవ్వాలి. అలా కాకుండా ఈయనే నేరుగా ఈ ఆదేశాలు ఇచ్చేశారు. అనంతరం ఈ కథ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వరకు చేరడం, శ్రీకాకుళం ఎమ్మెల్యే, మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేయడంతో పాటు పరస్పరం ఒకరి మీద ఒకరు పోలీసుల వద్దకు వెళ్లడం వంటివాటితో ఈమధ్య ట్రెజరీ అన్ని పత్రికల్లోనూ పతాక శీర్షికలకు ఎక్కుతోంది. సిబ్బంది బదిలీలు, డెప్యుటేషన్లపై పత్రికల్లో కథనాలను పక్కన పెడితే, ఏటీవో రమణారెడ్డి ఆ శాఖ డైరెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదు ఏదో ఒకరోజు డీడీ మెడకు చుట్టుకుంటుంది. ఎందుకంటే.. ఈ 9 ఎరియర్ బిల్లులపై ఇంతకు క్రితమే ఏటీవో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దానికి భిన్నంగా డీడీ వ్యవహరించడం ఎప్పటికైనా ముప్పే.






Comments