top of page

అధికారిణి ‘అను’గ్రహం.. హాస్టల్ పనులకు కన్నం

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 8 hours ago
  • 3 min read
  • వసతులు కరువు, వసూళ్లు మెండు

  • నామినేషన్ పద్ధతిలో ఆర్ అండ్ బికి వెళ్లిన నిధులు

  • ఆమదాలవలస బాయ్స్ హాస్టల్‌ గదుల్లోనే మురుగునీరు

  • అరకొర పనులతో సంక్షేమానికి తూట్లు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న హాస్టల్స్‌లో కనీస వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులను సగానికి పైగా తినేసి, పనులు ఎక్కడ జరిగాయంటే.. చూపించడానికంటూ మచ్చుకు పైపై పూతలు వేసి పెద్ద ఎత్తున సంబంధిత అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఇప్ప్పుడు బీసీ సంక్షేమ శాఖలో వినిపిస్తున్నాయి. పని చేసేవాడి దగ్గర్నుంచి, పర్యవేక్షించే వాడివరకు తిలా పాపం, తలా పిడికెడు వాటా ఉన్నందున పనులు జరిగినట్టు రికార్డుల్లో రాసి ఎంచక్కా సొమ్ములు జేబులో వేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

బీసీ సంక్షేమశాఖ పరిధిలోని వసతి గృహాల మరమ్మతులకు బాలుర విభాగంలో 47 వసతి గృహాలకు రూ.4.65 కోట్లు, బాలికల విభాగంలో 11 హాస్టళ్లకు రూ.1.14 కోట్లు అవసరమని నివేదించగా, ప్రభుత్వం దామాషా పద్ధతిలో రూ.1.17 కోట్లు కేటాయించింది. అంతకు ముందు జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో ఉన్న 49 బీసీ వసతి గహాలన్నింటిలో కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా కలెక్టర్ కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం వడ్డీ సొమ్ము నుంచి రూ.25లక్షలు మంజూరుచేసి వాటర్ ట్యాంక్, వైరింగ్, ప్లంబింగ్, మరుగుదొడ్డి డోర్లు, కిచెన్ తదితర మరమ్మతు పనులు చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, దీపాలు, తలుపులు, కిటికీలు, రంగులు, తాగునీరు, పైకప్పు, గచ్చులు, ప్రహరీ వంటి సమస్యలను పరిష్కరించాలి. వీటిని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకుండా వాటాలు సర్దుకొని మమ అనిపించారని తెలుస్తుంది.

బీసీ సంక్షేమశాఖ డైరెక్టరేట్ మంజూరు చేసిన రూ.1.17 కోట్లను బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎంపిక చేసిన 25 వసతి గహాలకు సర్దుబాటు చేసి ఖర్చు చేయాలని నిర్ణయించింది. బీసీ సంక్షేమ శాఖ అధికారికి అన్నివిధాల సహకరించే వార్డెన్లు విధులు నిర్వహిస్తున్న పలాస పరిధిలోని వాడపాలెం, ఆమదాలవలసలోని బీసీ బాయ్స్ హాస్టల్, తో{వాడ బీసీ బాయ్స్ హాస్టల్, రణస్థలం బీసీ బాయ్స్, పొందూరు బీసీ గర్ల్స్, సోంపేట మండలం మామిడిపల్లి బీసీ బాయ్స్ హాస్టల్‌కు చెరో రూ.10 లక్షలు, ఐదు హాస్టల్స్‌కు రూ.5లక్షలు, మిగతా నిధులను 14 హాస్టల్స్‌కు చెరో రూ.1.5 లక్షలు మంజూరు చేయించి పనులు చేపట్టేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. డైరెక్టరేట్ అధికారుల కలెక్టర్ సూచనలతో మంజూరు చేసిన నిధులను ఏపీఈడబ్ల్యూఐడీసీ (ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రెక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా ఖర్చు చేయాల్సి ఉండగా ఆర్ అండ్ బి ద్వారా పనులు చేపట్టారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించి మరమ్మతు పనులను చేయించారు. ఈ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా హాస్టల్‌లో ఏ రకమైన పనులు చేపట్టాలో నిర్ధిష్టమైన ఆదేశాలున్నా ఆ ప్రకారం పనులు జరగలేదు. జిల్లా ఉన్నతాధికారులు నిధులు మంజూరు చేశారు తప్ప పనులు పర్యవేక్షించలేదు. మరమ్మతుకు ముందు, తర్వాత చిత్రాలు తీసి ఉంచాలని సూచించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులు, బీసీ సంక్షేమశాఖ అధికారి కలిసి వాటాలు పంచుకొని పనులు పూర్తి చేసినట్టు చూపించి బిల్లులు చేయించుకున్నారు.

నిధులిచ్చాం.. తేడా వస్తే మీ తప్పేనంటూ సీఎం చంద్రబాబు సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న వసతి గహాల అధికారులకు హెచ్చరించారు. ఇటీవల సంక్షేమ శాఖల వసతి గహాల్లో మౌలిక వసతులపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ పాఠశాలల పునఃప్రారంభం నాటికి హాస్టల్స్ పూర్తిస్థాయిలో వసతులతో సిద్ధంగా ఉండాలని దిశా నిర్ధేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్`2024లో జిల్లాలోని బీసీ, సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో సౌకర్యాల కల్పన, మరమ్మతులపై దృష్టి సారించి ఆ శాఖ డైరెక్టరేట్ 2025 జనవరిలో నిధులు కేటాయించింది.

విద్యార్థులకు శుద్ధజలం అందించడానికి ఆర్వో ప్లాంట్లు, భద్రత, పర్యవేక్షణకు సీసీ కెమెరాలు, విద్యుత్ కోతల సమయంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఇన్వర్టర్లు ఏర్పాటు చేసింది. వీటితో పాటు వసతి గహాలకు అవసరమయ్యే వంట పాత్రలను సరఫరా చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో టెండర్లకు పిలిచి జిల్లాల వారీగా బీసీ వసతిగృహాల్లో విద్యార్థులకు శుద్ధ జలం అందించడానికి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసే ప్రక్రియను ప్రారంభించింది. గత ఏడాది మార్చిలో ఏర్పాటు చేసిన ఇన్వర్టర్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. అవసరమైన చోట కొత్తవి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటిని ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షణ చేస్తుంది. అయితే మరమ్మతుల కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగం కావడంతో బీసీ వసతి గహాల్లో కనీస సౌకర్యాలు అందుబాటులోకి రాలేదన్న విమర్శలున్నాయి. ఆమదాలవలసలో బీసీ వసతి గహానికి డైరెక్టరేట్ నుంచి రూ.15 లక్షలు మంజూరైనా, పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయలేదు. మురుగు నీరు బయటకు వెళ్లే మార్గం మూసుకుపోయి విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై వసతి గహంలోని విద్యార్ధుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని తెలిసింది. సమీక్షలో ఆ శాఖ జిల్లా అధికారిని కలెక్టర్ ప్రశ్నిస్తే.. విద్యార్ధులు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నారని తప్పించుకొనే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. జిల్లాలోని అన్ని బీసీ వసతి గహాల్లో సౌకర్యాలు లేమి కనిపిస్తుంది. వసతి గహాల్లో వసతులు కల్పించాలని ప్రభుత్వం నిధులు విడుదల చేసినా వాటిని దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. వైకాపా అధికారంలో ఉన్నప్ప్పుడు హాస్టల్స్‌లో మౌలిక వసతులు కల్పించడానికి నిధులు మంజూరు చేయలేదు. కూటమి ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తే అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో నిధులు దుర్వినియోగమయ్యాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page