అమ్మో.. కర్ణాటకలో 149 మంది మంత్రులా!
- DV RAMANA

- Feb 12
- 3 min read

మన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. సలహాదారుల పేరుతో తమ పార్టీకి చెందినవారికి పప్పుబెల్లాల్లా నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని నాడు ఆరోపణలు వినిపించాయి. వీరికి సలహాదారులు అనే ముద్దుపేరు పెట్టి దాదాపు అన్ని శాఖల నెత్తిన కూర్చోబెట్టడమే కాకుండా కేబినెట్ హోదాలు, ప్రొటోకాల్ మర్యాదలు కల్పించి ఊరేగించారు. అంటే కేబినెట్‌లో ఉండే మంత్రులు కాకుండా వీరంతా మంత్రి కాని మంత్రులన్నమాట! మంత్రి అని పిలిపించుకోలేకపోవడం, విధాన నిర్ణయాలు తీసుకోలేకపోవడం తప్ప హోదాలు, దర్జాలు అన్నీ సేమ్ టు సేమ్ మంత్రులకు మల్లే ఉంటుంది. పైగా వీరికి మరో సౌకర్యం కూడా ఉంటుంది. అసలు మంత్రుల మాదిరిగా అసెంబ్లీకి, ప్రజలకు వీరు జవాబుదారులుగా ఉండరు. ఈ దొడ్డిదారి నియామకాలపై విమర్శనాస్త్రాలు ఎక్కువపెట్టిన తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే పంథా అనుసరిస్తోంది. అయితే కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఈ విషయంలో మన ప్రభుత్వాలను తలదన్నేలా కేబినెట్ హోదా నియామకాలు జరిపి ముక్కున వేలేసుకునేలా చేసింది. ఆ రాష్ట్రంలో మంత్రుల సంఖ్య ఎకాఎకిన 32 నుంచి 149కి ఎగబాకింది. అంతేనా.. మరో 54 మందికి సర్కారు సహాయ మంత్రి హోదా కట్టబెట్టింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ, పాలన ప్రాధాన్యతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడి నామినేటెడ్ నియామకాలతో విమర్శలు ఎదుర్కొంటున్నది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల రాష్ట్రంలో కేబినెట్, సహాయ మంత్రి హోదా కలిగిన నామినేటెడ్ పదవులు పొందినవారి సంఖ్య 149కి చేరుకుంది. వాస్తవానికి మంత్రివర్గ కూర్పు విషయంలో మన రాజ్యాంగం ప్రభుత్వాలకు కొన్ని నిబంధనలు నిర్దేశించింది. వాటి ప్రకారం.. మంత్రుల సంఖ్య ఆ రాష్ట్ర అసెంబ్లీ మొత్తం సభ్యుల సంఖ్యలో 15శాతానికి మించకూడదు. అలాగే 12 మంది కంటే తక్కువ ఉండకూడదు. ముఖ్యమంత్రి, కేబినెట్, సహాయ మంత్రి పదవులన్నీ కలిపి ఈ పరిమితిలోపే ఉండాలి. కర్ణాటక అసెంబ్లీ మొత్తం సభ్యుల సంఖ్య 224. అందులో 15 శాతం లెక్క ప్రకారం చూస్తే ఆ రాష్ట్ర కేబినెట్ సభ్యుల సంఖ్య 34కు మించకూడదు. ప్రస్తుతం అధికారికంగా 32 మంది మంత్రులు ఉన్నారు. అంటే నిబంధనల ప్రకారం మరో ఇద్దరిని నియమించుకోవచ్చు. అయితే కర్ణాటక కాంగ్రెస్‌లో తీవ్రంగా ఉన్న పదవీ పోరాటాలు, రాజకీయ సమీకరణలు విచ్చలవిడి పదవుల పందేరం చేయకతప్పని పరిస్థితుల్లోకి నెట్టాయి. కానీ అందరికీ అమాత్య పదవుల్లో కూర్చోబెట్టలేని నిబంధనల అడ్డుగోడలు. ఈ పరిస్థితుల్లో మంత్రులుగా కాకుండా ఆ ీVAదా వెలగబెట్టే పదవుల పందేరానికి సిద్ధరామయ్య తెరతీశారు. దొడ్డిదారిలో ఏకంగా 117 మందికి మంత్రి స్థాయి ప్రోటోకాల్‌ను కల్పించే నియామకాలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా రాజ్యాంగ పరిమితులకు మించి పదుల సంఖ్యలో నాయకులకు మంత్రి హోదా లభించింది. సిద్ధరామయ్య సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రతిపక్షాలు రాజకీయంగా దుమ్మెత్తి పోస్తుంటే.. ప్రభుత్వ చర్య రాష్ట్ర ఖజానాపై అదనపు ఆర్థిక భారం మోపుతుందని ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన తాజా నియమకాల్లో 43 మంది ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్యేలు కాని మరో తొమ్మిది మంది సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులకు కేబినెట్ మంత్రి హోదా పొందేలా పదోన్నతి కల్పించారు. వీరే కాకుండా మరో 11 మంది ఎమ్మెల్యేలు, 54 మంది ఎమ్మెల్యేలు కానివారికి సహాయ మంత్రి (ఎంవోఎస్) ీVAదా పొందేలా పదోన్నతి కల్పించారు. కొత్తగా నియమితులై సహాయ మంత్రి హోదాలో ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లలో కీలక పదవులు పొందిన వారంతా అధికార కాంగ్రెస్ నాయకులు, వారి కుటుంబాల సభ్యులే కావడం విశేషం. ఇలా నియమితులైన ప్రతి ఒక్కరికి నెలకు రూ. 50 వేలు చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతినెలా రూ. మూడు వేల ఆతిథ్య భత్యం, రూ. 80 వేల ఇంటి అద్దె అýవెన్స్ సైతం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా కార్యాలయ నిర్వహణ, సిబ్బంది సౌకర్యాల కోసం నెలకు అదనంగా రూ. 20 వేలు చెల్లించడంతోపాటు రాష్ట్రవ్యాప్త పర్యటనలు జరిపిందుకు నెలకు వెయ్యి లీటర్ల ఇంధనం కూడా ఉచితం సరఫరా చేయాల్సి ఉంటుంది, ప్రస్తుత ధరల ఇంధన ఖర్చు ఒక్కటే రూ. లక్షకు పైగా అవుతుంది. ఇక ీVAదాలు వెలగబెడుతున్నవారికి రోజువారీ ప్రయాణ భత్యం కింద రూ. 2,000 నుంచి రూ. 2,500 వరకు ముట్టజెప్పాల్సి ఉంటుంది. జీతభత్యాలతో పాటు ఈ మంత్రులు కాని మంత్రులకు వ్యక్తిగత కార్యదర్శులు, సహాయకులు, డ్రైవర్లు, అటెండర్లు వంటి పరిపాలన సిబ్బందిని సమకూరుస్తారు. వారు తమ వైద్య ఖర్చులను పూర్తిగా తిరిగి చెల్లించడానికి అర్హులు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రుల మాదిరిగానే వారికి అధికారిక గౌరవం, ప్రోటోకాల్ మర్యాదలు లభిస్తాయి. ఉచిత హామీల అమలు కారణంగా ఇప్పటికే రాష్ట్ర ఖజానా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టుల్లో కొలువైన వారికి భారీ చెల్లింపులు చేయడం వల్ల ఖజానాపై మరింత భారం పడుతుందని, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్టీ నేతలను సంతప్తిపర్చడానికి ప్రజాధనాన్ని వెచ్చించడం తగదని హితవు చెబుతున్నారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఇటువంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉంది. అవసరం లేకపోయినా పలు శాఖలకు సలహాదారులను నియమిస్తున్నారు. ఈ తరహా ఆర్థిక బాధ్యతారాహిత్యాన్ని అనుమతించరాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.






Comments