అమ్మో.. మళ్లీ కరోనా!
- DV RAMANA

- 2 days ago
- 2 min read
దేశవ్యాప్తంగా ఇప్పటికే 339 కేసులు నమోదు
కేరళలో అత్యధికంగా 117 మందికి ఆస్పత్రులపాలు
మన రాష్ట్రంలో 12 మందికి అస్వస్థత.. నాలుగు మరణాలు
అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య అప్రమత్తత ప్రకటించిన కేంద్రం
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో కరోనా వార్డుల ఏర్పాటుకు చర్యలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
సుమారు ఆరేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి పంజా విసరుతున్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో గత నెల రోజుల వ్యవధిలో వందల కేసులు వెలుగులోకి రాగా.. మన రాష్ట్రంలో అయితే నాలుగు మరణాలు సంభవించాయి. దాంతో వైద్యఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 2020 ప్రథమార్థంలో మనదేశంలో మొదటిసారి కరోనా ఆనవాళ్లు కనిపించాయి. కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ఈ ఏడాది మార్చి చివరిలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దాంతో జనజీవనం స్తంభించిపోయింది. అయినా కరోనా అదుపులోకి రాకపోగా కేసులు అపరిమితంగా పెరిగిపోయాయి. లక్షల్లో ప్రజలు ఆస్పత్రుల పాలుకాగా వేలసంఖ్య ప్రజలు ఊపిరి తీసుకోలేక పిట్టల్లా రాలిపోయారు. సుమారు మÖడేళ్లపాటు దేశంతోపాటు ప్రపంచం మొత్తాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఎట్టకేలకు శాంతించి నెమ్మదిగా సమాజం నుంచి అంతర్ధానమైంది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం ప్రభుత్వాలు, ప్రజలు తీసుకున్న జాగ్రత్తల కారణంగా కరోనా అంతమైనట్లేనని అందరూ భావించారు. కానీ అది అంతం కాలేదని.. ఇన్నాళ్లూ దీర్ఘనిద్రలో ఉండి.. ఇప్పుడు మళ్లీ బయటకొచ్చి జనంపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు బలపరిచేలా దేశంలో కోవిడ్ కేసులు కొద్దిరోజులుగా పెరుగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 339 కేసులు నమోదైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. కేరళలో అత్యధికంగా 115 కేసులు వెలుగు చూసినట్లు తేలింది. దాంతో ఆ రాష్ట్రంతోపాటు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హెల్త్ అలర్ట్ ప్రకటించింది.
నాలుగు జిల్లాల్లో కేసులు
దేశంలో పరిస్థితి పక్కన పెడితే.. మనరాష్ట్రంలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలో ఈ నెల రోజుల్లోపే కేసులు ఇబ్బడిముబ్బడిగా నమోదు కాగా.. ఇంతవరకు నాలుగు మరణాలు నమోదయ్యాయి. గత నెల 26 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 12 కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. కడప, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో ఎక్కువ కేసులు వెలుగుచూస్తున్నాయని పేర్కొంది. కాగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయిన వారిలో ఇప్పటివరకు నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు కడప జిల్లాకు చెందినవారు కాగా, విశాఖ, కాకినాడ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరున్నారు. మృతులందరికీ కోవిడ్‌కు ముందే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే కోవిడ్ కేసులు ఒకే క్లస్టర్ పరిధిలో లేకపోవడం కొంతవరకు ఉపశమనమని అంటున్నారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కోవిడ్ వైరస్ వేరియంట్ ఏమిటో అధికారులు చెప్పలేకపోతున్నారు. దీని విశ్లేషణ కోసమే రోగుల నుంచి సేకరించిన ఐదు శాంపిళ్లను పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఆ రిపోర్టులు రాగానే.. వాటి ప్రకారం చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో 67 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ వచ్చింది. ఒక్క కడప జిల్లాలోనే ఎనిమిది కేసులు నమోదు కాగా మిగతా 12 గుంటూరు, కాకినాడ, విశాఖల్లో నమోదయ్యాయి. వారిలో నలుగురు మరణించగా, ముగ్గురు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయారు. మరో ముగ్గురు HOME ఐసొలేషన్‌లో ఉండగా మరో ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ భరోసా ఇచ్చింది. కరోనా మరణాలు నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు, ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండియన్ తెలిపారు. ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే కేసులు ఎక్కువగా నమోదవుతున్న కడపతోపాటు నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌తో కూడిన మÖడంచెల విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.






Comments