అర్థం చేసుకోవాలంటే.. మినిమం డిగ్రీ ఉండాలి!
- Guest Writer
- Sep 20, 2025
- 2 min read

బిచ్చగాడుతో బ్లాక్‌బస్టర్ సాధించిన విజయ్ ఆంటోని, ఇప్పుడు భద్రకాళితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ ఏంటంటే... హీరో కిట్టూ (విజయ్) పవర్‌ఫుల్ బ్రోకర్. సెక్రటేరియట్ నుంచి మంత్రుల పేషీల వరకూ ఏ పనినైనా చేయగలిగే సమర్థుడు. ఈ పనుల్లో డబ్బు సంపాదిస్తూనే మరోవైపు పేదవాళ్లకి సాయం చేస్తూ ఉంటాడు. అభయంకర్ అనే పొలిటీషియన్ దిల్లీ లెవెల్‌లో లాబీయింగ్ చేస్తూ, రాష్ట్రపతి కావాలనుకుంటాడు. ఒక ల్యాండ్ డీల్ విషయంలో కిట్టూపై అనుమానం వచ్చి, దిల్లీలోని ఒక ఆఫీసర్ ద్వారా కూపీ లాగుతాడు. కిట్టూ కొన్ని వేల కోట్లు రకరకాలుగా సంపాదించాడని అర్థమవుతుంది.
భారతీయుడు, జెంటిల్‌మన్, కిక్ సినిమాల్లా కిక్ ఇచ్చిందా?
వ్యవస్థలోని అవినీతి, దుర్మార్గాలపై పోరాటం చేయడం పాత కథే. ఎన్నో సినిమాల్లో చూసేశాం. అవినీతి అధికారుల పని పడితే భారతీయుడు.. విద్యా వ్యవస్థపై ఆగ్రహం ప్రకటిస్తే జెంటిల్‌మన్.. రవితేజ కిక్ కూడా ఇలాంటిదే. ఆ సినిమాల్లో కథ, కథనం, ఎమోషన్ కలగలిసి ఉంటాయి. భద్రకాళిలో సమస్య ఏంటంటే దర్శకుడి బుర్రలో ఏముందో ప్రేక్షకుడికి అర్థం కాదు. హీరో రకరకాల లాబీయింగ్‌లు వేగంగా చేస్తూ ఉంటాడు. ఒక్క క్యారెక్టర్ కూడా సరిగా రిజిస్టర్ కాకుండా ఇంటర్వెల్ వచ్చేస్తుంది. పోనీ సెకెండాఫ్‌లో హీరోకి ఏమైనా లక్ష్యం ఉంటుందని అనుకుంటే అది రొటీన్ రివేంజ్ డ్రామాగా మారిపోయి, ఎక్కడా పెద్ద సంఘర్షణ లేకుండా అన్ని హీరోకి అనుకూలంగా జరుగుతుంటాయి.
పాల ప్యాకెట్ కల్తీ నుంచి డ్రగ్స్ వరకు...
రాబిన్‌హుడ్ తరహా కథలు ప్రేక్షకులకి ఎప్పుడూ నచ్చుతాయి. అయితే కథకి ఒక పాయింట్ ఉండాలి. పాల ప్యాకెట్ కల్తీ నుంచి డ్రగ్స్ వరకు, ఆసుపత్రుల దోపిడీ నుంచి రాజకీయ అవినీతి వరకు అన్ని విషయాల్ని ఒకే కథలో చొప్పించి హీరోతో ఉపన్యాసాలు చెప్పిస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది. హీరోకి ప్రతీకారమే ముఖ్యమైనపుడు విలన్‌ని చాలా సులభంగా చంపే అవకాశం ఉంది. దాని కోసం ఎవరికీ అర్థం కాని బిట్‌కాయిన్ కుంభకోణం, ప్రపంచ కోటీశ్వరుడి కొడుకుని కిడ్నాప్ చేయడం ఇవన్నీ అవసరమా? ఈ కథని రెండున్నర గంటలు తీశారు. ఎడిటర్ కళ్లు మూసుకుని ఎక్కడ కత్తిరించినా సమస్య ఉండేది కాదు.
స్టైలిష్ టేకింగ్...
సినిమాలో హీరోయిన్ ఉంది. కానీ, ఎందుకుందో తెలియదు. దర్శకుడు అరుణ్‌ప్రభు టేకింగ్ చాలా స్టైలిష్‌గా ఉంది. ఫొటోగ్రఫీ, బీజీఎం బాగున్నాయి. కానీ, అన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తాయి. అక్కడక్కడ డైలాగ్‌లు చాలా బాగున్నాయి. ‘’మనకి ఉద్యోగాలిస్తారు కానీ, నాయకుడిగా ఎదగనివ్వరు’’, దశాబ్దాలుగా కొన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయం ఇది. వ్యవస్థ చెడిపోయింది, దీంట్లో ఎవరికీ సందేహం లేదు. అయితే, ఇది బలంగా చెప్పాలంటే ఒక ఎమోషనల్ జర్నీ వుండాలి. విజయ్ ఆంటోని మంచి నటుడే కానీ, కథని దర్శకుడు ఈసీజీ తరహాలో జిగ్‌జాగ్‌గా చెప్పారు. ఈ సినిమాకి భద్రకాళి అని ఎందుకు పేరు పెట్టారో మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ కథ అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి.
- జీఆర్ మహర్షి










Comments