అలుక వీడి.. అడుగు పడుతోందా?!
- NVS PRASAD

- Jun 28, 2025
- 3 min read
ధర్మానకు, పార్టీకి మధ్య కుదిరిన సయోధ్య
పాతపట్నం మినహా మిగతావాటికి సై
నైర ఇసుక తవ్వకాలపై ప్రజాధర్నాకు మద్దతు
42 గ్రామాల ప్రజలతో కలిసి నడుస్తానన్న సంకేతం
వచ్చే నెల 4 కోసం శ్రేణులు సమాయత్తం
ధర్మానే వస్తున్నారంటూ గ్రామాల్లో కరపత్రాల పంపిణీ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు జనబాహుళ్యంలోకి రావడానికి దాదాపు ముహూర్తం ఖరారైంది. గడిచిన ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత వైకాపా నిర్దేశించిన కార్యక్రమాలకు సైతం ముఖం చూపించని ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు స్వయంగా ఓ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ముందుకొస్తున్నారు. పార్టీ జెండా, అజెండాను పక్కన పెట్టి శ్రీకాకుళం రూరల్ మండలంలో సాగునీరు, తాగునీరు పరిరక్షించుకోడానికి 42 గ్రామాల ప్రజలు చేస్తున్న ఒక ఉద్యమాన్ని ఆయన ముందుండి నడపడానికి సిద్ధపడుతున్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాదైన తర్వాత తన ఓటమిని తేలిగ్గానే తీసుకున్నా గడిచిన ఐదేళ్లలో పార్టీ తీసుకున్న నిర్ణయాలపై పరోక్షంగా అసంతృప్తి జెండా ఎగరేసిన ధర్మాన ప్రసాదరావు ఒక విధంగా పార్టీపైన పట్టు సాధించగలిగారు. తన అలుక వెనుక పార్టీ ప్రయోజనాలే తప్ప తన వ్యక్తిగత అజెండా లేదన్న సంకేతాలు పంపడంతో జగమొండి జగన్ కూడా ధర్మాన అభిప్రాయాలను గౌరవించినట్లు తెలుస్తుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని ఉంచుతారు? రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎవరికి టిక్కెట్లిస్తారు? అన్న కోణంలో కాకుండా ఏ సామాజికవర్గానికి ఎక్కడ ఎలా ప్రాధాన్యతనిస్తే గడిచిన ఎన్నికల్లో మళ్లీ విజయబావుటా ఎగరేస్తామో నిర్దేశించే కార్యాచరణను జిల్లా వరకు తనకు వదిలేయాలన్న ఆయన డిమాండ్‌ను జగన్మోహన్‌రెడ్డి అంగీకరించినట్లు కనిపిస్తుంది. ఒక్క పాతపట్నం విషయంలో పార్టీకి, ధర్మానకు మధ్య పీఠముడి వీడకపోయినా, ఆ విషయంలో ధర్మాన పెద్దగా బెట్టు చేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పరామర్శలు, పలకరింపులు కాకుండా తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఉద్యమించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. అయితే ఇంకా కొంతమేర ఊగిసలాట ఉన్నా, మళ్లీ యాక్టివ్ కావడానికి ఇంతకు మించిన సందర్భం మరోటి ఉండదనే భావన కూడా ధర్మానలో ఉంది. దీనికి తోడు 42 గ్రామాల ప్రజల మద్దతు ఉన్నందున ఇటువంటి ఉద్యమాన్ని తలకెత్తుకోవాలని ఆయన చూస్తున్నారు.

శ్రీకాకుళం రూరల్ మండలం నైర గ్రామం వంశధార నదీ తీరంలో 2005లో ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు సీపీడబ్ల్యూ స్కీమ్ కింద మంచినీటి ప్రాజెక్టును నిర్మించారు. దీని ద్వారా 42 గ్రామాల ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. ఇందుకోసం శిలగాం సింగువలస వద్ద ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఓహెచ్‌బీఆర్)లు నిర్మించి ప్రతీ గ్రామంలోను ఓపెన్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్లు(ఓహెచ్‌ఎస్‌ఆర్) ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వీటికి మంచినీరు ఎక్కడి నుంచి వస్తుందంటే.. నైర వద్ద వంశధార నదిలో ఇన్‌ఫిల్ట్రేషన్ బావులను తవ్వారు. నదిలో ప్రవహిస్తున్న నీరు ఈ బావుల్లోకి ఫిల్టరైతే అక్కడి నుంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు నీటిని ఎక్కిస్తారు. దీనివల్ల ప్రతీ గ్రామానికి నీరందిస్తున్నారు. అయితే కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే నీరందుతుందని, ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలుసుకున్న ధర్మాన జైపాల్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరికొన్ని హడ్కో నిధులు మంజూరు చేయించుకొని మరిన్ని గ్రామాలకు ఇదే ప్రాజెక్టు నుంచి నీరందించే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. దీంతో రూరల్ మండలంలో సముద్రం ఒడ్డున ఉండే కళ్లేపల్లి, కిల్లిపాలెం, ఇప్పిలి వంటి గ్రామాలు తప్ప మిగతా అన్ని గ్రామాలకు నీరందడంతో దీని పరిధిలోకి 42 గ్రామాలు వచ్చాయి. సరిగ్గా ఇప్పుడు ఇదే ప్రాజెక్టుకు ప్రాణాధారంగా ఉన్న ఇన్‌ఫిల్ట్రేషన్ బావుల వద్ద ఇసుకను తోడేస్తున్నారు.
ఇన్‌ఫిల్ట్రేషన్ బావుల చుట్టూ 500 మీటర్ల రేడియస్‌లో ఇసుక తవ్వకూడదనే చట్టం ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోవడంలేదు. మరీ విచిత్రంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల నుంచి భైరిదేశిగెడ్డ కాలువ గట్టుపై రైతులు, షట్టర్ల మరమ్మతుల కోసం ఉద్యోగులు నడిచేందుకు వీలుగా వేసిన కాలిబాటను పూర్తిగా ధ్వంసం చేసి, దాని పైనుంచి భారీ వాహనాలతో ఇసుకను తరలించేస్తున్నారు. దీనిపై వైకాపా నాయకులు జిల్లా మైన్స్ అధికారులు, కలెక్టర్, గ్రౌండ్ వాటర్‌వర్క్స్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో 42 గ్రామాల ప్రజలంతా సమష్టిగా ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వచ్చే నెల 4న నైరలోని రైతుభరోసా కేంద్రం భరోసా ఎదురుగా ఉన్న స్థలంలో ధర్నా చేయడానికి సిద్ధపడుతున్నారు.
రాష్ట్రంలో అన్నిచోట్ల ఉచిత ఇసుక పేరుతో తవ్వకాలు జరగడాన్ని ప్రభుత్వ పాలసీలో భాగంగానే చూడాలి గానీ, తాగునీరు అందించే ప్రాజెక్టుల వద్ద కూడా ఇసుకను తవ్వేస్తే భవిష్యత్తులో ప్రాజెక్టు కనుమరుగవుతుంది కాబట్టి, దీనిపై ఉద్యమించాల్సిందేనని ధర్మాన భావిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం తన కార్యాలయంలో రూరల్ సర్పంచ్‌లు, ఎంపీటీసీ, పార్టీ నాయకులతో ఆయన చర్చించారు. తాను కూడా ఈ ధర్నాకు హాజరవుతానని పరోక్షంగా ప్రకటించారు. పార్టీ జెండాలు లేకుండా కేవలం ప్రజా సమస్య పరిష్కారం దిశగా ఉద్యమించడానికి ఆయన ముందుకొస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఒకటి రెండు విషయాల్లో పార్టీకి, ఆయనకు మధ్య ఒక అవగాహన కుదరకపోవడంతో 4న జరిగే ధర్నాకు వెళ్లాలా, వద్దా? అన్న మీమాంస కూడా ఆయన్ను వెంటాడుతోంది.
వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారంటూ పెద్ద స్థాయిలో ఉద్యమించారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే జరుగుతున్నందున ధర్మాన ఆ దిశగా అడుగులేయాలని రూరల్ నాయకులు భావిస్తున్నారు. ధర్మాన ఈ కార్యక్రమానికి రావడాన్ని పార్టీ కోణంలో కాకుండా, ఆయన తెచ్చిన ప్రాజెక్టును ఆయనే సంరక్షించుకునే కోణంలో చూడాలని, అందుకోసం 42 గ్రామాల ప్రజలకు మద్దతివ్వాలని ఆయన కోరుతున్నారు.










Comments