top of page

అసెంబ్లీ 12.. లోక్‌సభ 2! జిల్లాలో పెరగనున్న నియోజకవర్గాలు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 3 min read
  • డీలిమిటేషన్‌తో 50 శాతం పెరుగుదల

  • ఓటర్ల దామాషా పద్ధతిలో పునర్విభజన

  • సగటున ప్రతి రెండున్నర మండలాలకు ఒక సెగ్మెంట్

  • ప్రతి నియోజకవర్గంలో సరాసరి 1.60 లక్షల ఓటర్లు

  • వీటిలోనే ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికలు 2029లో జరగాల్సి ఉంది. కానీ హఠాత్తుగా రాజకీయాలు వేడెక్కాయి. దీనికి కారణం ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందు జరుగుతాయని కాదు. కానీ దానికంటే ముఖ్యమైన, కొత్తవారికి రాజకీయ ద్వారాలు తెరిచే, పాత ఔత్సాహికులకు అవకాశాలు పెంచే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఢిల్లీ వర్గాల నుంచి అందిన సమాచారం రాజకీయ వేడి పుట్టించింది. ఈ సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య ఊహించిన దానికంటే అధికంగా 50 శాతం మేరకు పెరుగుతుందని తెలిసింది. ఆ లెక్కన చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 12కి, పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య రెండుకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గాల వర్గీకరణ, హద్దులు ఖరారు వంటి అంశాలను ఏ ప్రాతిపదికన ఖరారు చేస్తారు. ఆయా నియోజకవర్గాల్లో జనాభా, కులాలా దామాషా ఎలా నిర్ణయిస్తారు అన్న చర్చలు ఊపందుకున్నాయి. జాతీయ స్థాయిలో చూస్తే ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు పునర్విభజన తర్వాత 816కి పెరుగుతాయి. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లు 263కు పెరుగుతాయి. లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో స్వయంగా కేంద్ర మంత్రి అమిత్‌షా ఈ వివరాలు వెల్లడించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ బేటీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ తదితరులు కూడా పాల్గొన్నట్లు తెలుగు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆంగ్ల జాతీయ పత్రికల్లో ఎక్కడా ఈ సమాచారం లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నియోజకవర్గాల పెంపు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విభజన ఇలా ఉండవచ్చు

రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటే నియోజకవర్గాల పునర్విభజనను మన రాష్ట్రంలో తూర్పువైపు నుంచి అంటే ఇచ్ఛాపురం నుంచి చేపట్టాల్సి ఉంటుంది. గతంలో ఇలాగే జరిగింది. అందువల్లే అసెంబ్లీ కి సంబంధించి ఇచ్ఛాపురం, లోక్‌సభకు సంబంధించి శ్రీకాకుళం నియోజకవర్గాల సీరియల్ నెంబర్ ఒకటిగా ఉన్నాయి. కానీ ఈసారి పునర్విభజన జాతీయస్థాయిలో జరగనున్నందున ఈ ప్రాతిపదికన కాకుండా జమ్మూకశ్మీర్ నుంచి మొదలుపెట్టి ముందుకు వెళ్లవచ్చని అంటున్నారు. అదేజరిగితే మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా నుంచి పునర్విభజన ప్రక్రియ జరగవచ్చు. ఎటునుంచి పునర్విభజన మొదలుపెట్టినా ఓటర్ల సంఖ్యను పది శాతం అటూ ఇటుగా అంచనా లెక్కించి కటాఫ్ నిర్ణయించి విభజిస్తారు. అందువల్ల ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు ఎలా మారుతాయి, ఏ ప్రాంతం ఏ నియోజకవర్గంలో చేరుతుందన్నది చెప్పడం తొందరపాటే అవుతుంది. అయితే స్థూలంగా 50 శాతం పెరుగుదల లెక్క ప్రకారం అంచనా వేస్తే పునర్విభజన తర్వాత జిల్లాలో నియోజకవర్గాల స్వరూపాలు ఇలా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

- శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం యూనిట్‌గా ఉన్న మన జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి అదనంగా విజయనగరం పార్లమెంటు పరిధిలోని ఎచ్చెర్ల సెగ్మెంట్ కూడా శ్రీకాకుళం జిల్లా పరిధిలోకే వస్తుంది. ఆ లెక్కన ప్రస్తుతం ఉన్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు 50 శాతం పెంపుదల ప్రకారం 12 నియోజకవర్గాలకు పెరుగుతాయి. అలాగే శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గానికితోడు మరో లోక్‌సభ నియోజకవర్గం వస్తుంది.

-ప్రస్తుతం జిల్లాలో 30 మండలాలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ఉన్న ఓటర్లనే కొత్త నియోజకవర్గాల సంఖ్యతో విభజించి.. ఆ లెక్కన నియోజకవర్గాల సరిహద్దులు నిర్ణయిస్తారు. ఇందులోనే ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు.

-ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450 (సుమారు 4.02 కోట్లు). అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 2.30 లక్షల ఓటర్లు, మూడు లక్షల జనాభా ఉన్నారు. జనగణన తర్వాత ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అప్పుడు దాని ప్రకారం నియోజకవర్గాలను విభజించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఓటర్లనే పెరగనున్న నియోజకవర్గాల సంఖ్య 263తో విభజిస్తే సుమారు 1.53 లక్షలు అవుతుంది. అంటే కొత్త నియోజకవర్గాల్లో సగటు ఓటర్ల సంఖ్య ఇంతే ఉండవచ్చు. అయితే భౌగోళిక, సమాజిక ఇబ్బందులు, స్థానిక ఒత్తిళ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే పది శాతం అటూఇటుగా.. అంటే 1.50 లక్షల నుంచి 1.60 లక్షల వరకు ప్రతి నియోజకవర్గంలో ఓటర్లు ఉండేలా విభజిస్తారు.

-విభజనకు మండలాలు, మున్సిపాలిటీలను ప్రాతిపదికగా తీసుకోకపోయినా జనాభా, ఓటర్ల దామాషా ప్రకారం చూస్తే సగటున రెండు నుంచి మూడు మండలాలు ఇంకా చెప్పాలంటే సుమారు రెండున్నర మండలాలు ఒక నియోజకవర్గంలో ఏర్పడవచ్చు.

-సాధారణంగా పెద్ద అర్బన్ ప్రాంతాలను నియోజకవర్గాలుగా ప్రకటిస్తుంటారు. ఆ ప్రకారం చూస్తే శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధితో కొత్త అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.

-అదే ఓటర్ల లెక్క ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గ విభజన కూడా జరుగుతుంది. కొత్త లోక్‌సభ నియోజకవర్గానికి ఏ ప్రాంతాన్ని కేంద్రంగా నిర్ణయిస్తారన్నది కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.

2027 లెక్కల ఆధారంగానే..

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2023లో పార్లమెంటులో ఆమోదించిన బిల్లు ప్రకారమైతే 2034 నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఎందుకంటే 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న నిబంధన ఉంది. దీని ప్రకారమైతే 2034 నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న జనగణన 2027 మార్చి ఒకటి నాటికి పూర్తికానున్న పరిస్థితుల్లో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించడంతోపాటే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే వెసులుబాటు కలుగుతోంది. దాంతో 2029లోనే కొత్త నియోజకవర్గాల ప్రకారం ఎన్నికలు జరపడంతోపాటు మహిళా రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఆ మేరకు మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు చేస్తూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లులు తీసుకురానున్నట్లు తెలిసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page