top of page

ఆ ఫండ్.. చిన్న పట్టణాలకు సవాల్!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 3 min read

ప్రజల బాగోగులు గమనిస్తూ వారితోపాటు జనసమూహాలు నివసించే ఆవాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, వాటిని అభివద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అధికార వికేంద్రీకరణలో భాగంగా జాతీయస్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కిందిస్థాయిలో ఉండే స్థానిక సంస్థలను ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ ఉద్దేశంలోనే స్థానిక సంస్థలు తమ పరిధిలో అభివద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని 73, 74 సవరణల ద్వారా రాజ్యాంగంలోనే నిర్దేశించారు. వీటికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నది. కానీ క్రమంగా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోజూస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల రూపురేఖలు మార్చేందుకు వీలుగా మార్పుచేర్పులతో ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ విధానం ఈ తరహా చర్చకు తావిస్తోంది. పట్టణాల్లో మౌలిక సౌకర్యాల కల్పనలో రాష్ట్రాల భాగస్వామ్యాన్ని, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం ఈ నిధి ప్రధాన ఉద్దేశమని తాజా నిబంధనలు వెల్లడిస్తున్నాయి. కొత్త విధానం ప్రకారం పట్టణ అభివృద్ధి ప్రాజెక్టు ఖర్చులో కేంద్రం ఇక నుంచి 25 శాతమే భరిస్తుంది. సంబంధిత రాష్ట్రప్రభుత్వం మరో 25 శాతం ఇస్తుంది. మిగిలిన 50 శాతం నిధులను ఆయా పట్టణ స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలే భరించాల్సి ఉంటుంది. ఈ నిధులను బాండ్లు, రుణాలు లేదా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) ద్వారా సమీకరించుకోవాల్సి ఉంటుంది. దీన్ని మార్కెట్ అనుసంధానిత, ఫలితాల ఆధారిత విధానంగా కేంద్రం అభివర్ణిస్తోంది. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో అభివద్ధి పడకేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమల్లో ఉన్న అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, స్మార్ట్ సిటీస్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల కింద పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నిధుల వినియోగంలో లోపాలు, మున్సిపల్ పాలకవర్గాల అసమర్థత వల్ల ఈ ప్రాజెక్టులు ముందుకు సాగడంలేదు. ఈ పరిస్థితుల్లో పట్టణ స్థానిక సంస్థల(యూఎల్‌బీ)కు కొత్త నిబంధనలు అదనపు భారంగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. నగరాలు, పట్టణాలు తమ అభివద్ధికి అవసరమైన నిధులను తామే సంపాదించుకోవాలన్న ఈ కొత్త నిబంధనల వల్ల చిన్న నగరాలు ప్రమాదంలో పడతాయి. వీటి పన్ను ఆదాయం తమ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది జీతాలకే సరిపోని పరిస్థితి మెజారిటీ పట్టణ సంస్థలో ఉంది. ఇక అభివద్ధికి నిధులు కేటాయించడమనేది భ్రమే. బయటనుంచి నిధుల సేకరణ కూడా ఈ సంస్థలకు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. సరైన భూ రికార్డులు లేకపోవడం, మాస్టర్ ప్లాన్ల ఉల్లంఘన వంటి సమస్యలు పట్టణ ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఒకపట్టాన ముందుకురావు. నగరాలను తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలనేది అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్థూల ఉద్దేశంగా అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కానీ ఆచరణకు వచ్చేసరికి ఇందులో చాలా సవాళ్లు, అవరోధాలు ఎదురవుతాయని అంటున్నారు. సగం పెట్టుబడి సమకూర్చండి లేదా దానికి సరిపడా ప్రైవేట్ భాగస్వాములను తెచ్చుకుంటేనే 25 శాతం వాటా ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఈ షరతులను హైదరాబాద్, చెన్సై, ముంబై, కొంతవరకు విశాఖ లాంటి పారిశ్రామిక నగరాలు అమలు చేయగలవు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి బాండ్లు వంటివి సేకరించడం పెద్ద సమస్య కాదు. కానీ చిక్కంతా చిన్న నగరాల విషయంలోనే. కానీ శ్రీకాకుళం, విజయనగరం వంటి చిన్న నగరపాలక సంస్థలకు సొంతంగా 50 శాతం నిధులు సమకూర్చుకోవడం అసాధ్యంగానే చెప్పాలి. ఈ తరహా నగరపాలక సంస్థల్లో పరిశ్రమలు లేవు, ఆదాయ వనరులూ లేవు. అందువల్ల సహజంగానే వాటికి పెట్టుబడుల మార్కెట్‌లో ‘క్రెడిట్ రేటింగ’ ఉండదు. అందువల్ల అప్పు పుట్టడం కష్టం. అప్పు తీసుకురాలేకపోతే.. కేంద్రం ఇస్తుందని చెబుతున్న 25 శాతం వాటా కూడా అందదు. ఫలితంగా ధనిక నగరాలే అభివద్ధి నోచుకుంటే.. పేద(చిన్న) నగరాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోతాయి. ప్రజలకు ఉచితంగా లేదా నామమాత్రపు రుసుములతో ప్రాథమిక సౌకర్యాలు, సేవలు కల్పించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలపై ఉంటుంది. కానీ ప్రతి అభివద్ధి పనికీ నిధులు వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో సేవల స్థానంలో ఆదాయం కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ఒక ఉదాహరణ పరిశీలిస్తే.. ఒక పట్టణంలో కమ్యూనిటీ హాలు కట్టాలని నిర్ణయించి దానికోసం బ్యాంకు రుణం తీసుకోవాలంటే దాన్ని తిరిగి చెల్లించగలిగేందుకు తగిన ఆదాయం చూపించాలి. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో క£మ్యూనిటీ హాలుకు బదులు.. ప్రతినెలా అద్దెలు వచ్చే షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి ఆ పట్టణ సంస్థ మొగ్గు చూపుతుంది. ఫలితంగా సామాన్యులకు అందాల్సిన సేవకు విఘాతం కలుగుతుంది. పట్టణ సంస్థలకే కాకుండా కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి వివిధ రంగాýకు ఆర్థిక సహాయాన్ని తగ్గిస్తూ ప్రైవేట్ ఆర్థిక వనురుల సేకరణపై ఆధారపడాలని సూచిస్తోంది. ఫలితంగా ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాల కోసం తీసుకున్న రుణాలు యూనివర్సిటీలను అప్పుల ఊబిలోకి నెట్టాయి. ఫలితంగా ఫీజులు పెరిగి పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద నిధుల విడుదలలో జాప్యం వల్ల సేవలు అందించిన తర్వాత ఆస్పత్రులు నిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ రంగంలో ఉదయ్ పథకం అమల్లోనూ చాలా లోపాలు చోటుచేసుకుంటున్నాయి. అభివద్ధికి ప్రైవేట్ పెట్టుబడులు అవసరమే కానీ.. కనీస సేవ ధర్మాన్ని, బాధ్యతలను విస్మరించి నిధుల సేకరణతో ముడిపెడితే పేద, మధ్యతరగతి వర్గాలకు నష్టం వాటిల్లుతుందని సామాజికవేత్త హెచ్చరిస్తున్నారు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page