ఆక్యుపెన్సీ సరే.. ఆదాయం అందేదెప్పుడో మరి!
- BAGADI NARAYANARAO

- Oct 7
- 3 min read
స్త్రీశక్తితో ఆర్టీసీలో విచిత్రమైన పరిస్థితి
సింహభాగం సర్వీసులు ఉచితానికే అంకితం
ప్రయాణాలు పెరిగినా నిండని గల్లా పెట్టె
ఆ నిధులన్నీ సకాలంలో అందితేనే ప్రయోజనం
రద్దీకి తగినట్లు పెరగని బస్సులు.. ఉన్న వాటిలోనే అవస్థలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం కారణంగా ప్రజా రవాణాలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఆక్యుపెన్సీ సుమారు 25 శాతం పెరిగినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఆర్టీసీకి ఆదాయంతో పాటు నష్టాల నుంచి సంస్థ గట్టెక్కించే అవకాశం ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రయాణికుల నుంచి దీనికి భిన్నమైన స్పందన వ్యక్తమవుతోంది. ఉన్న బస్సుల్లోనే మెజారిటీ సర్వీసులకు మహిళలను ఉచితంగా తీసుకెళ్లే అవకాశం కల్పించడం వల్ల రద్దీ విపరీతంగా పెరిగిపోతోందంటున్నారు. దీని వల్ల టికెట్లు కొని ప్రయాణాలు చేసే పురుషులు నానా అగచాట్లు పడాల్సి వస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మహిళల రద్దీ పెరగడం వల్ల ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందో లేదో గానీ.. అదనపు బస్సులు వేయకుండా ఉన్న వాటిలోనే అందరినీ కుక్కేయడం అసంతప్తి పెంచుతోంది.
ఉచితానికే 80 శాతం బస్సులు
జిల్లాలో శ్రీకాకుళం`1,2, టెక్కలి, పలాస డిపోల పరిధిలో 310 బస్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 250 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సులకు స్త్రీశక్తి పథకాన్ని వర్తింపజేస్తున్నారు. మిగిలిన 51 బస్సులు సుదూర ప్రాంతాలకు నడిచే సర్వీసులే. వీటిలో ఇంద్రా లాంటి ప్రధమశ్రేణి బస్సులతో పాటు లగ్జరీ, సెమీ లగ్జరీ బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ అధికారుల లెక్కల ప్రకారం.. స్త్రీశక్తి ప్రారంభమైన ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు సుమారు 37 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. పథకం ప్రారంభానికి ముందు రోజుకు సగటున 1.05 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించేవారు. ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య 1.50 లక్షలకు పెరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తద్వారా ఆక్యుపెన్సీ రేట్ 68 నుంచి 95 శాతానికి ఎగబాకిందని అధికారులు చెబుతున్నారు. పైన పేర్కొన్న నెలన్నర రోజుల్లోనే జిల్లావ్యాప్తంగా మహిళల ఉచిత ప్రయాణాలకు ఆర్టీసీ రూ.30 కోట్లు ముందస్తు పెట్టుబడి పెట్టినట్లు బస్సుల్లో మహిళా ప్రయాణికులకు జారీ చేసిన జీరో టికెట్ల లెక్కల ఆధారంగా తేలింది. ఈ మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని అంటున్నారు. అయితే ఆ మొత్తాలను ఎప్పుడు చెల్లిస్తుందన్నది స్పష్టత లేదు. అంతవరకు టికెట్ల పద్దు రాసుకోవడమే తప్ప కాసుల్లో ఆదాయం కనిపించదు. కానీ బస్సుల మెయింటెనెన్స్, ఆయిల్ ఖర్చులు, జీతాలు మాత్రం ఆర్టీసీ ఎప్పటికప్పుడు చేతి చమురుతో భరించక తప్పదు. అసలే నష్టాల్లో ఉన్న సంస్థకు ప్రభుత్వం ‘ఉచిత’ నిధులు జమ చేసే వరకు కష్టాలు తప్పవేమో.
టికెట్లు కొనేవారికే ఇరకాటం
మొత్తం తొమ్మిది రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించ లేదు. అవి మినహా జిల్లాలోని 250 బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తున్న కారణంగా కొన్ని రూట్లలో బస్సుల సంఖ్య తగ్గించారు. దీంతో ఛార్జీలు చెల్లించి బస్సుల్లో ప్రయాణించేవారు ఇబ్బంది పడుతున్నారు. దూర ప్రయాణాలు చేయాల్సిన వారికి కూడా అవస్థలు తప్పడంలేదు. సామర్ధ్యానికి మించి ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో బస్సు సర్వీసుల పెంచాల్సి ఉంది. అయితే జిల్లాలో పథకం అమలుచేసిన నాటి నుంచి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 250 బస్సులను మాత్రమే ఉచిత ప్రయాణానికి వినియోగిస్తున్నారు. ఫలితంగా ఈ బస్సులన్నీ తీవ్ర రద్దీగా మారుతున్నాయి. కొన్ని రూట్లలో సామర్ధ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్ల వాగ్వాదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి. వీరిలో అత్యధికులు ఉచిత ప్రయాణం చేసే మహిళలే కాగా.. టికెట్లు కొని ప్రయాణం చేసే పురుషులు వారి మధ్య ఇరుక్కుని, అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అసలే మహిళలు.. ఏ చిన్న తేడా వచ్చినా పరిస్థితి మరోరకంగా ఉంటుందన్న భయం కూడా పురుష ప్రయాణికులను వెంటాడుతోంది. సాధారణ రోజుల్లో ఉదయం 5 నుంచి సాయంత్రం ఏడు వరకు విద్యార్ధులు, ఉద్యోగులే ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అందువల్ల సహజంగానే ఈ సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. దీనికితోడు పండగలు, సెలవు రోజుల్లో ఉచితంగా ప్రయణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు టికెట్ చెల్లించి గ్రామీణ ప్రయాణం చేసే వారంతా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు.
పక్క జిల్లాలకు వెళ్లే ఉద్యోగుల అవస్థలు
జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా కేంద్రం నుంచి పక్క జిల్లా కేంద్రాలకు రోజువారీ తిరిగే బస్సుల్లో ఇక్కడి నుంచి వెళ్లే ఉద్యోగుల రద్దీ పెరిగింది. అయితే మహిళల ఉచిత ప్రయాణ పథకం మొదలైన తర్వాత ఈ బస్సు సర్వీసులను గణనీయంగా తగ్గించేశారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి ప్రతిరోజు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి మూడు బస్సులు నడిపేవారు. శ్రీకాకుళం నుంచి పార్వతీపురానికి నిత్యం సుమారు 200 మంది ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే స్త్రీశక్తి పథకం ప్రారంభమైన తర్వాత మూడు బస్సుల స్థానంలో ఒక్క బస్సును మాత్రమే నడుపుతున్నారు. ఇలా అన్ని ప్రధాన రూట్లలో బస్సుల సంఖ్య కుదించారు. ఇతర జిల్లాల్లో పని చేస్తున్న శ్రీకాకుళానికి చెందిన ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచాలని వారు ఆర్టీసీ అధికారులను విన్నవిస్తున్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు మెరుగైన ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ బస్సులు సంఖ్య పెంచాలన్న డిమాండ్ మొదటి నుంచీ ఉంది. అయితే ఇప్పటికిప్పుడు అన్ని రూట్లలో కొత్త బస్సులు నడిపించే అవకాశం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సులను ఉచిత ప్రయాణానికి అనువుగా, రద్దీ రూట్లలోనూ అదనంగా బస్సులు నడుపుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.










Comments