top of page

ఆమెకు ఊతం.. ఉపాధికి విఘాతం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Feb 6
  • 1 min read
  • కొత్తవారిని నియమించకుండా రాజకీయం

  • 9 నెలలుగా నిలిచిన ఉపాధి పనులు

  • క్షేత్రసహాయకురాలి తొలగింపే కారణం

  • ఆమెను విధుల్లోకి తీసుకునేవరకు పనులు జరగడానికి లేదంటున్న నాయకులు?

  • మళ్లీ కూలిపనులకు వలసలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

అధికార పార్టీకి మద్దతుదారునిగా మెలిగిన ఉపాధి హమీ పధకం క్షేత్ర సహాయకురాలిని విధుల నుంచి తొలగించినందున ఆ గ్రామ పంచాయతీ పరిధిలో గత ఏడాది మే నెల నుంచి ఉపాధి పనులు జరగనివ్వడం లేదు. అధికారులకు విన్నవించి ఉపాధి పనులు ప్రారంభించాలని కోరినా, ఎవరూ స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉపాధి పనులు జరగకపోవడానికి కారణం.. క్షేత్ర సహాయకురాలిని సస్పెండ్ చేయడమేనని స్థానికులు చెîబుతున్నారు. ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకున్న వరకు పనులు జరగడానికి వీళ్లేదని కొందరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు చెబుతున్న మాటగా స్థానికులు తెలిపారు. జలుమూరు మండలం హుస్సేన్‌పురం పంచాయతీ పరిధిలో హుస్సేన్‌పురం, బావాజీపేట, తమ్మయ్యపేట, తమ్మయ్యపేట కాలనీ, కూన దాలయ్యపేట గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 30 గ్రూపుల్లో 400 మంది కూలీలు ఉపాధి హమీ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. సుమారు 9 నెలలుగా ఉపాధి పనులు జరగకపోవడం వల్ల కూలిపనుల కోసం దూర ప్రాంతాలకు వెలుతున్న పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఉపాధి హమీ పథకంలో క్షేత్ర సహాయకురాలి అక్రమాలపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో డ్వామా పీడీ సుధాకర్ ఆధ్వర్యంలో విచారణ చేశారు. విచారణలో ఉపాధి హామీ పథకంలో మస్తర్లలో అవకతవకలకు పాల్పడి రూ.3.50 లక్షలు నిధులు దిర్వినియోగం చేసినట్టు నిర్ధారణ కావడంతో ఆ శాఖ జిల్లా అధికారులు విధుల నుంచి క్షేత్ర సహాయకురాలిని సస్పెండ్ చేశారు. ఆమెతో పాటు మరో ఐదుగుర్ని నిధుల దుర్వినియోగంలో బాధ్యులుగా అధికారులు గుర్తించినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. 9 నెలలు కావస్తున్నా క్షేత్ర సహాయకురాలిగా ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. కొత్తవారిని నియమించకుండా కొందరు రాజకీయం చేస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల పనులు జరగడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్ర సహాయకురాలిని నియమించి ఉపాధి పనులు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page