top of page

ఆరోగ్య భారతానికి డిజిటల్ వారధి

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 1 day ago
  • 3 min read

సంపూర్ణ ఆరోగ్య భారతాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కార్యక్రమాలన్నింటినీ డిజిటలైజ్ చేసి ఒకే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంపైకి తీసుకొచ్చింది. దీంతో దేశప్రజలు అన్ని రకాల వైద్యసేవలను ఇంటి నుంచే పొందవచ్చని కేsద్ర ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్ సమయంలో రోగుల కాంటాక్ట్స్‌ను ట్రేస్ చేసేందుకు ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసేందుకు రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌ను ఈ లక్ష్యసాధన కోసం పూర్తిస్థాయి డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారంగా అప్‌గ్రేడ్ చేశారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ కింద దీన్ని ఆరోగ్యసేతు 2.0గా ఇటీవలే ప్రారంభించారు. ప్రతి భారతీయ పౌరుడికి వ్యక్తిగత స్థాయిలో ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఈ యాప్ ఒక ప్లాట్‌ఫారంగా పని చేస్తుంది. ఆస్పత్రుల సేవలు పొందడం నుంచి వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు నిర్వహించడం, బీమా వివరాలు తెలుసుకోవడం వంటి అనేక సేవలను ఈ యాప్ అందిస్తుంది. కోవిడ్ సమయంలో కోట్లాది ప్రజలు ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే ఇది కరోనా కేసులను గుర్తించడం, వారి కాంటాక్ట్స్‌ను ట్రేస్ చేయడం, హెల్త్ అడ్వయిజరీలు జారీ చేయడానికే పరిమితమయ్యేది. అదే యాప్‌ను ఆధునికి హెల్త్ ప్లాట్‌ఫారంగా అభివృద్ధి చేశారు. దీన్ని నేషనల్ హెల్త్ అథారిటీ నిర్వహిస్తున్నది. ఈ యాప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సేవలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ సమయంలో సుమారు 20 కోట్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్పటికీ దీన్ని ఫోన్లలో ఉంచుకున్న వారందరికీ అన్ని రకాల డిజిటల్ ఆరోగ్య సేవలను విస్తరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో పౌరులందరూ ఈ యాప్‌ను తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకునేలా చైతన్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ కొత్త యాప్‌లో వినియోగదారులు తమ అభా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) ఖాతాను తెరిచి, దాన్ని స్వయంగా నిర్వహించకోవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపర్చుకోవచ్చు. దీనివల్ల అవసరమైన సమయాల్లో ఆస్పత్రులు లేదా వైద్యులతో వాటిని షేర్ చేసుకునే సురక్షిత మార్గం ఏర్పడుతుంది. స్కాన్ అండ్ రిజిస్టర్ అనే ఫీచర్ ద్వారా ఆస్పత్రికి వెళ్లి క్యూలైన్లలో ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి త్వరగా పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. దీనికి అదనంగా మందులు తీసుకోవాల్సిన సమయానికి రిమైండర్లు పంపడం, పీఎంజేఏవై ఆరోగ్య బీమా సేవలు వంటి సౌకర్యాలు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులోకి ఉంటాయి. ప్రజలు తమ సమీపంలోని ఆస్పత్రులు, క్లినిక్‌లు, వైద్యులు, డయాగ్నస్టిక్ సెంటర్ల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల వేగంగా వైద్యసేవలు పొందడం సులభతరం అవుతుంది. ఈ యాప్‌లో అత్యంత కీలకమైన మరో కొత్త ఫీచర్ కూడా ఉంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మెడికల్ రికార్డుల ఇజిటలైజేషన్. ఇప్పటివరకు కాగితాలు, పీడీఎఫ్ ఫైళ్ల రూపంలో ఉన్న మెడికల్ రిపోర్టులు, ఆరోగ్య పరీక్షల ఫలితాలు, స్కాన్ రిపోర్టులను డిజిటల్ హెల్త్ డేటాగా మార్చే సౌకర్యాన్ని ఇందులో పొందుపర్చారు. ఒకసారి ఈ రికార్డులు డిజిటల్ రూపంలోకి మారిన తర్వాత వినియోగదారుడి పూర్తి ఆరోగ్య చరిత్ర ఒకేచోట అందుబాటులో ఉంటుంది. దీనివల్ల చికిత్సకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యసేతు యాప్‌ను స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్లు వంటి వాటితో కూడా అనుసంధానించవచ్చు. అలా చేస్తే రోజూ మన నడక రికార్డు, గుండె స్పందన రేటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా నిరంతరం పర్యవేక్షించవచ్చు. వీటివల్ల రోజువారీ ఆరోగ్య నిర్వహణ సులభతరం అవుతుంది. ఇదే యాప్‌లో పీఎంజేఏవై వాలెట్ అనే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా వినియోగాదారులు తమ ఆరోగ్య బీమా కవరేజ్ వివరాలు, ఇప్పటివరకు అందులో వినియోగించిన మొత్తం, ఇంకా ఎంత కవరేజి లభిస్తుంది వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. పీఎంజేఏవై సేవలు అందించే నెట్‌వర్క్ ఆస్పత్రుల వివరాలు, రీయింబర్స్‌మెంట్ వివరాలు, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వివరాలు కూడా మన అరచేతిలోనే ఉంటాయి. రాష్ట్రం, జిల్లా, పిన్‌కోడ్ లేదా ఆస్పత్రి పేరుతో నెట్‌వర్క్ ఆస్పత్రుల వివరాలు సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. అలాగే జీపీఎస్ ఆధారంగా సమీపంలోని ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ కేంద్రాలను సులభంగా గుర్తించవచ్చు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌ను బుక్ చేయడం, ఈ`రక్తకోశ్ (బ్లడ్ బ్యాంకు)లలో కావలసిన గ్రూప్ రక్తం అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఫ్యామిలీ మేనేజ్‌మెంట్ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లల ఆరోగ్య ఖాతాలను ఒకే అకౌంట్‌లో నిర్వహించే సౌలభ్యం కల్పించారు. డిజిటల్ ఆరోగ్య సేవలు మంచివే అయినప్పటికీ వాటిలో వ్యక్తిగత సమాచార భద్రత అత్యంత కీలకమైన అంశం. దీనికోసమే ప్రభుత్వం మై కన్సెంట్ అనే ఫీచర్ ద్వారా గోప్యత పాటిస్తూ.. ఆరోగ్య రికార్డులను పూర్తిగా నియంత్రించవచ్చు. ఆరోగ్య సేవల విస్తరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యసేతు 2.0 యాప్ ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 90 కోట్లకు పైగా అభా ఖాతాలు తెరిచిన నేపథ్యంలో యాప్ ద్వారా డిజిటల్ ఆరోగ్య సేవలు మరింత వేగవంతమవుతాయని భావిస్తున్నారు. ఈ యాప్ వల్ల ఆరోగ్య రికార్డులన్నీ ఒకేచోట లభ్యమై దీర్ఘకాలిక రోగులకు వెంటవెంటనే అవసరమైన చికిత్స అందించేందుకు వీలవుతుందని వైద్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫాలో ఆప్ చికిత్స, వైద్యసేవల సమన్వయం మరింత పెరుగుతుందని అంటున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారం ద్వారా లభించే వాస్తవ ప్రపంచ డేటా ఔషధాల అభివృద్ధి, వ్యాధుల ధోరణులను అర్థం చేసుకుని, తదనుగుణంగా కొత్త పరిశోధనలకు దోహదం చేస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page