ప్రపంచ మార్కెట్లపై ట్రంప్ తూటాలు
- DV RAMANA

- 11 hours ago
- 3 min read

‘సీజ్ ఫైర్ ముగిసింది’.. అన్న ఒక్కమాట యావత్తు ప్రపంచం గుండెల్లోకి తూటాలా దూసుకుపోయింది. ప్రపంచ ఆర్థిక, రవాణా, వాణిజ్య, చమురు రంగాలను అతలాకుతలం చేసేసింది. మళ్లీ అమెరికా`ఇరాన్ మధ్య దాడులు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లు షాక్‌కు గురై కుప్పకూలాయి. అంతర్జాతీయ ప్రయాణాలు సంక్షోభంలో పడ్డాయి. దీనంతటికీ కారణం.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మహాశయుడేనంటూ యావత్తు ప్రపంచం ముక్తకంఠంతో ఘోషిస్తున్నది. పిచ్చివాడి చేతికి రాయి ఇస్తే ఎలా ఉంటుందో.. ట్రంప్ దొరగారి పాలన అలానే ఉందన్న వ్యాఖ్యలు, విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ పెద్దన్న అన్న పేరుతో విర్రవీగుతున్న ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం విషయంలో మొదటి నుంచీ దుందుడుకు వైఖరినే అవలంభిస్తున్నారు. తన తలతిక్క చర్యలు, నిర్ణయాలతో సొంత దేశమైన అమెరికా, విరోధిగా భావిస్తున్న ఇరాన్‌లనే కాకుండా మొత్తం ప్రపంచ దేశాలను ఇక్కట్ల పాల్జేస్తున్నారు. తడవకో నిర్ణయంతో అంతటా అయోమయం, గందరగోళం సృష్టిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. ఇంత జరుగుతున్నా ట్రంప్ తన పంథాను ఏమాత్రం మార్చుకోవడంలేదు. నాలుగున్నర నెలల క్రితం ఫిబ్రవరి 28న ఇరాన్‌పై సైనిక చర్యకు శ్రీకారం చుట్టింది మొదలు మిగతా ప్రపంచాన్ని కునుకు లేకుండా చేస్తున్నారు. నాలుగు నెలల తర్వాత ఎట్టకేలకు తాత్కాలిక ఒప్పందం కుదిరి 60 రోజుల సీజ్ ఫైర్(కాల్పుల విరమణ) అమల్లోకి రావడంతో ఊపిరి పీల్చుకున్న అన్ని వ్యవస్థలు మెల్లగా గాడిలో పడుతున్నాయి. అయితే తుది ఒప్పందం కోసం రహస్య చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంగా పరిస్థితి అకస్మాత్తుగా ఉద్రిక్తంగా మారింది. ప్రపంచ చమురు, కార్గో రవాణాలకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్ రెండూ పట్టుదలతో వ్యవహరిస్తుండటం వల్లే తాజా ఘర్షణలకు దారితీసిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. జలసంధిలో ప్రయాణిస్తున్న కార్గో నౌకలను ఇరాన్ అడ్డుకుంటున్నదన్న ఆరోపణలతో అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌పై దాడులు చేసి పలు లక్ష్యాలను నాశనం చేసింది. దీనికి ప్రతికారంగా ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ విమానాలు, డ్రోన్లతో మస్కట్, ఇరాక్‌లలోని అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడింది. దాంతో భయపడిన శాంతి కపోతం అక్కడినుంచి ఎగిరిపోయింది. ఇదే సమయంలో అగ్నిలో ఆజ్యం పోసినట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా మరింతగా నిప్పులు కురిపించారు. సీజ్ ఫైర్ ముగిసినట్లేనని ప్రకటించారు. ఇరాన్‌తో చర్చల వల్ల ఫలితం ఉండదని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ఇరాన్ గగనతలం మీదుగా విమానాలు నడపవద్దని కూడా అమెరికా అన్ని దేశాలకు సూచించింది. దాంతో ఆగస్టు 31 వరకు కొనసాగాల్సిన కాల్పుల విరమణకు ఇలా అర్థంతరంగా ట్రంప్ నీళ్లొదిలేయడంతో ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు పెరిగాయి. స్టాక్ మార్కెట్లు తీవ్రంగా కంపించి పతనమయ్యాయి. విమాన సర్వీసులు తీవ్ర కుదుపునకు గురయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికుల ప్రణాళికలన్నీ తల్లకిందులయ్యాయి. ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. అన్ని దేశాలతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్లలోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎసఈ) బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఏకంగా 1700 పాయింట్లు పతనం కాగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 500 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్లలో భయాలు పెరగడంతో అమ్మకాల ఒత్తిడి చివరి వరకు కొనసాగింది. మెటల్, ఫార్మా, రియాల్టీ మినహా అన్ని రంగాల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. శాంతి ఒప్పందం తర్వాత 70 డాలర్ల స్థాయికి దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ ఎగిసిపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 78 డాలర్లకు పెరిగింది. భారత్‌ను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే దేశ దిగుమతి బిల్లు పెరిగి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా వీఐఎక్స్ సూచీ ఏకంగా 30 శాతం పెరిగి 15.08 స్థాయికి చేరింది. ఇది ఇన్వెస్టర్లలో పెరిగిన రిస్క్ భయాన్ని సూచిస్తుంది. మరోవైపు చమురు ధరల ప్రభావంతో డాలర్ విలువ పెరగడంతో భారతీయ రూపాయి విలువ ఫారెక్స్ మార్కెట్లో 20 పైసలు బలహీనపడి 95.16 స్థాయికి చేరింది. దీంతోపాటు సీజ్ ఫైర్ ముగింసిందన్న ట్రంప్ ప్రకటన ప్రభావం అంతర్జాతీయ విమానయాన రంగంపైనీ, అంతర్జాతీయ ప్రయాణికులపైనా తీవ్రంగా పడింది. అమెరికా`ఇరాన్ యుద్ధం మొదలైన వెంటనే ఇరాన్`ఇరాక్ గగనతలాన్ని నిషేధించారు. కానీ ఆగస్టు 31 వరకు సీజ్‌ఫైర్ ప్రకటిస్తూ తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరి, ఉద్రిక్తతలు ఉపశమించిన తర్వాత ఆ మార్గాన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు వినియోగించడం ప్రారంభించాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ నుంచి దుబాయ్, జెడ్డా, దోహా, మస్కట్ ప్రాంతాలకు వెళ్లే విమానాలు ఇరాన్`ఇరాక్ గగనతలం మీదుగానే ప్రయాణిస్తుంటాయి. ఈ మార్గం తక్కువ దూరం కావడం వల్ల, ఇంధన వినియోగం తగ్గుతుంది. ఇది మÖతపడితే ఒమన్ గల్ఫ్, సౌదీ అరేబియాల చుట్టూ తిరిగి ఎక్కువ దూరం ప్రయాణించి గమ్యం చేరాల్సి వస్తుంది. దీనివల్ల హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్లాలంటే సుమారు గంటసేపు అదనపు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ మార్గంలో ప్రయాణం ఎక్కువ దూరం కావడం, ఇంధన వినియోగం పెరుగుతుంది. ఫలితంగా విమానయాన సంస్థలకు ఖర్చు పెరుగుతుంది. ఈ భారాన్ని ప్రయాణికుల మీదే మోపుతారన్నది తెలిసిందే. ఫలితంగా విమాన టికెట్ల ధరలు 30 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అదే పరిస్థితి దేశంలోని ఇతర ప్రాంతాల విమాన ప్రయాణికులూ ఎదుర్కోక తప్పదు. గతంలో ఇలాంటి ఉద్రికత్తలు తలెత్తినప్పుడు విమాన ఛార్జీలు 40 శాతం పెరిగిన అనుభవం ఉంది. మళ్లీ మొదలైన ఈ భయాలకు ముగింపు ఎప్పుడో ఆ ట్రంప్‌కే ఎరుక!






Comments