top of page

మీ ఈ 20 పెట్రోల్‌కో దండం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 15 hours ago
  • 3 min read

ముడిచమురు దిగుమతి బిల్లును సాధ్యమైనంతగా తగ్గించుకుని విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తన ప్రయత్నాల్లో భాగంగా వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్‌ను పెట్రోల్‌తో బ్లెండ్ చేసి విక్రయించడం ద్వారా పెట్రోల్ వినియోగాన్ని సర్దుబాటు చేసుకోవడానికి చర్యలు చేపడుతున్నది. ఈ ప్రయత్నంలో వాహన వినియోగదారుల ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతో పాటు దేశప్రజల వాహనాలను ఫణంగా పెట్టి ఇథనాల్ పెట్రోల్ ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడైంది. ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు.. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు ఇటీవల సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొనడంతో ఇథనాల్ చమురు విషయంలో కేంద్రం దేశప్రజలతో దొంగాట ఆడుతన్నట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ సంక్షోభాలు నెలకొన్న పరిస్థితుల్లో చమురు దిగుమతుల వ్యయం దేశానికి పెనుభారంగా మారుతున్న విషయం వాస్తవం. దీన్ని సాధ్యమైనంతగా తన పరిధిలో తగ్గించేందుకు కేంద్రం ఎంచుకున్న మార్గం ప్యూర్ పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి విక్రయించడం. నిన్నమొన్నటి వరకు దేశంలో ఈ10 పెట్రోల్ అమ్మకాలు జరిగాయి. అంటే బంకుల్లో అమ్మే పెట్రోల్‌లో 90 శాతం ప్యూర్ పెట్రోల్ ఉంటే.. పది శాతం ఇథనాల్ ఉంటుందన్నమాట. అంటే ఆ పది శాతం మేరకు పెట్రోల్‌ను ఆదా చేసినట్లే.. ఆ ఖర్చు తగ్గినట్లే. అయితే పెట్రోల్‌లో ఇథనాల్ కలిపి వినియోగించాలంటే.. అందుకు వీలుగా వాహనాల ఇంజిన్లలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. 2023 తర్వాత తయారైన వాహనాలన్నీ ఈ10 పెట్రోల్‌కు అనుగుణంగా ఉన్నవే. అయితే ఇథనాల్ శాతాన్ని మÖడు నెలల క్రితం మరో పది శాతం పెంచి ఈ20 పెట్రోల్ విక్రయాలను ఆయిల్ కంపెనీలు ప్రారంభించడంతో సమస్యలు మొదలయ్యాయి. ఇప్పుడు రోడ్లపై ఉన్న ఏ వాహనాలు కూడా ఈ20 పెట్రోల్ వినియోగానికి తగిన విధంగా లేవు. దీన్ని పట్టించుకోకుండానే కేంద్రం ఈ20 పెట్రోల్ వినియోగానికి అమల్లోకి తెచ్చి.. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లోనూ దాన్ని మాత్రమే అందుబాటులో ఉంచుతున్నది. దీని వల్ల కొత్త వాహనాలు సైతం ఈ పెట్రోల్ వినియోగించిన కొన్నాళ్లకే దెబ్బతిని రిపేరింగ్ షెడ్ల బాట పడుతున్నాయి. అయినా పట్టించుకోకుండా ఇథనాల్ శాతానికి ఏకపక్షంగా పెంచుకుంటూ పోతున్న కేంద్రం ఈ85 వరకు పెట్రోల్ విక్రయాలకు అనుమతులు ఇచ్చుకుంటూ పోతున్నది. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా మాత్రం కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ వెంకటరమణి ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగం ఇంకా ప్రయోగ దశలోనే ఉందని చెప్పడం విస్మయం కలిగించింది. ఒకవైపు అమ్మకాలను తప్పనిసరి చేసి.. కోర్టుకు మాత్రం ప్రయోగదశలోనే ఉందని చెప్పడమంటే అటు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. ఇటు కోట్లాది వాహన వినియోగదారులు వేలు, లక్షల సొంత డబ్బుతో కొనుక్కున్న వాహనాలపై ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగంపై ప్రయోగాలు చేస్తున్నదన్నమాట. దీనివల్ల వాహనాలు దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారని దేశప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా.. తమ కష్టార్జితమైన వాహనాలపై ప్రయోగాలు చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. ఈ20 పెట్రల్‌పై మనదేశ ప్రజల్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. భారతదేశం సరఫరా చేస్తున్న ఈ20 పెట్రోల్ వద్దేవద్దంటూ మనపక్కనే ఉన్న భూటాన్ తెగేసి చెప్పేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ20 పెట్రోల్ వినియోగాన్ని మనదేశంలో తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయిల్ కంపెనీలు అదే ఊపులో మన ఇంధనంపై ఆధారపడిన పొరుగు దేశమైన భూటాన్‌ను కూడా ఈ20 పెట్రోల్ సరఫరా చేస్తామని ఆఫర్ చేసింది. అయితే భూటాన్ ప్రభుత్వం ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. తన ఇంధన అవసరాల కోసం భారత్‌పైనే ఆధారపడినప్పటికీ ఈ20 పెట్రోల్ ఆఫర్ విషయంలో మాత్రం భూటాన్ నిర్మొహమాటంగా వ్యవహరించింది. భారత మార్కెట్లలో సాధారణ పెట్రోల్ అందుబాటులో ఉన్నంతకాలం తమకు అదే పెట్రోల్ సరఫరా చేయాలని స్పష్టంగా చెప్పేసింది. దీనికి భూటాన్ పలు కారణాలు చెబుతోంది. తమ దేశంలో ప్రస్తుతం ఉన్న పెట్రోల్ నిల్వ కేంద్రాలు, బంకులు ఇథనాల్ మిళిత పెట్రోల్‌కు అనుకూలంగా లేవని పేర్కొంది. మరోవైపు భూటాన్‌లో నిటారుగా కొండలు, గుట్టలతో నిండిన భూభాగం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో వాహనాలు నడవాలంటే అది గరిష్ట శక్తిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాల స్పీడ్ తగ్గిపోతుంది కనుక వాహనాలు పర్వత ప్రాంతాలను అధిగమించలేని పరిస్థితులు ఏర్పడతాయన్నది భూటాన్ అధికారవర్గాల వాదనగా ఉంది. సరిగ్గా ఇదే వాదనను మనదేశ ప్రజలు గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నా కేంద్రం పెడచెవిన పెడుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. భూటాన్‌లో నిర్వహించిన అధ్యయనాల ప్రకారం ఈ20 పెట్రోల్ వినియోగానికి అనుకూలంగా లేని ఆ దేశ వాహనాల్లో విడిభాగాల మార్పు, ప్రత్యేక ఇంధన యాడిటివ్‌ల కోసం ఆ దేశ వాహనదారులు ప్రతి యేటా రూ.5వేల నుంచి పది వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది దేశప్రజలకు తీవ్ర ఆర్థిక భారంగా పరిణమిస్తుందని అంటున్నారు. చిన్న దేశమైన భూటానే తన ప్రజల ఆర్థిక భద్రత గురించి ఆలోచించడం మన పాలకులకు గుణపాఠం కావాలి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు లక్ష్యం కంటే ముందే ఇథనాల్ పెట్రోల్ అమ్మకాలు సాధించాం.. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేస్తున్నాం.. అని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ప్రజల వాహన, ఆర్థిక భద్రతను, ఇథనాల్ పెట్రోల్ నిల్వ వనరులు లేని పరిస్థితులను ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థంకాని విషయం. మరో ముఖ్య విషయం ఇథనాల్ పెట్రోల్ ధర.. ఇథనాల్ మిక్స్ చేస్తున్నందున ఆ మేరకు ధర తగ్గించడం లేదు. సాధారణ పెట్రోల్, ఇథనాల్ పెట్రోల్ ఒకే రేటుకు అమ్మడం దోపిడీ కాక మరేమిటన్న విమర్శలు పెరుగుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page