top of page

గల్ఫ్ దేశాల ‘హ్యాండ్ ’.. అమెరికా షేక్!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 16 hours ago
  • 2 min read

ఎక్కడో దూరంగా కూర్చుని అగ్రరాజ్యమన్న అహంకారపూరిత ధోరణి కనబర్చడమే కాకుండా.. ఆపత్కాలంలో భద్రత, భరోసా కలిస్తామని ఆశలు చూపి సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకున్న పెద్దన్న ట్రంప్ తమ భూభాగాల నుంచే పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని తన విరోధులపై కక్ష తీర్చుకునే వ్యూహాలు అనుసరిస్తున్న ట్రంప్‌పై మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్).. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు నమ్మకం కోల్పోతున్నాయి. ఎక్కడో ఉన్న ఆయనపై ఆధారపడే కంటే ఇంతకాలం విరుధులుగా పరిగణించిన పొరుగు దేశాలతో స్నేహసంబంధాలు పెంచుకుంటే శాంతి, అభివృద్ధి సాధ్యమవుతాయన్న భావనకు వచ్చి ఇప్పుడిప్పుడే గల్ఫ్ దేశాలు తమ కార్యాచరణను మార్చుకుంటుండటం అమెరికా సైనిక వ్యూహకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ అనుసరిస్తున్న మ్యాగ్జిమమ్ ప్రెషర్ (తమకు నచ్చని దేశాలను లొంగదీసుకోవడానికి అన్నివైపుల నుంచి ఒత్తిడి తీసుకురావడం) వ్యూహానికి చెక్ పెడుతూ మిడిల్ ఈస్ట్‌లో శాంతి స్థాపన లక్ష్యంగా అరబ్ దేశాలు నేరుగా ఇరాన్‌తో సైనిక సంబంధాలు నెరుపుతన్నాయి. తమ ప్రాంతీయ భద్రత కోసం కేవలం అగ్రరాజ్యంపైనే ఆధారపడకుండా పక్కనే ఉన్న ఇరాన్‌తో మైత్రికి ద్వారాలు తెరవడం అమెరికా వ్యూహాలను దెబ్బకొట్టే పరిణామంగా అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన సెంట్రల్ కమాండ్ సైనిక స్థావరానికి అతిథ్యమిస్తున్న అరబ్ మిలటరీ ఇప్పుడు అమెరికా బద్ధ శత్రువు ఇరాన్‌తో మిలటరీ సమన్వయం కుదుర్చుకుంటామని ప్రకటన చేసింది. ఈ ప్రకటన మిడిల్ ఈస్ట్ రాజకీయాలను ఒక్కసారి తలకిందులు చేయడమే కాకుండా వాషింగ్టన్ అధికారవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. అమెరికా అధ్యక్షుడిగా మొదటిసారి పదవి చేపట్టినప్పుడు అబ్రహం అకార్డ్స్ పేరుతో అరబ్ దేశాలను ఇజ్రాయెల్‌కు చేరువ చేసి, ఇరాన్‌ను ఏకాకిని చేయడమే ప్రధాన అజెండాగా ట్రంప్ వ్యవహరించారు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తన పాత వ్యూహాలనే మరింత సానబట్టి ఒత్తిడితో ఇరాన్ తదితర దేశాలను ఉక్కిరిబిక్కిరి చేయాలన్న వ్యూహాలను రచించి అమలు చేయడం ప్రారంభించారు. అయితే ఇటీవల వరకు ట్రంప్ వ్యూహాలకు మద్దతుగా నిలిచి సహకరించిన గల్ఫ్ దేశాలు దాని వల్ల తమకు ప్రయోజనం లేకపోగా నష్టం వాటిల్లుతున్న విషయాన్ని గుర్తెరగడంతో సీన్ రివర్స్ అయ్యింది. అమెరిక సైనికుల స్థావరాలు ఉన్న గడ్డ మీద నుంచే ఆ దేశ మిత్రులు ఇరాన్ సైనికాధికారులతో చేతులు కలుపుతున్నారు. ఇది ట్రంప్ వ్యూహానికి తొలి ఎదురుదెబ్బగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. గల్ప్ దౌత్య, రాజకీయ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ప్రకారం.. ట్రంప్ రెండోవిడత పాలనతీరు చూసి అరబ్ దేశాలు భయపడుతున్నాయి. అగ్రరాజ్యం అధినేతగా, ప్రపంచ పెద్దన్నగా చెప్పుకొంటున్న ఆయన ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా దూకుడుగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిలోనూ స్థిరత్వం కనిపించడంలేదు. ఇజ్రాయెల్‌కు దన్నుగా ఉంటున్న ఆయన ఒకవేళ ఆ దేశానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇరాన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి ఉసిగొల్పితే ఇరాన్ సంగతేమో గానీ.. ముందుగా నాశనమయ్యేది గల్ఫ్ దేశాల ఆర్థిక వనరులైన చమురు క్షేత్రాలే. హౌతీల దాడులు, ఇజ్రాయెల్ క్షిపణి దాడుల భయంతో అరబ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. కేవలం అమెరికా భద్రతా హామీలపైనే ఆధారపడితే తమ దేశాలు కూడా సిరియా, లెబనాన్ మాత్రం ధ్వంసమవుతాయని అరబ్బు పాలకులకు అర్థమైంది. అందువల్ల ఇరాన్‌తో శత్రుత్వం కంటే వారితో సైనిక సమన్వయం చేసుకోవడం ద్వారా తమ భౌగోళిక సరిహద్దులను సురక్షితంగా ఉంచుకోవచ్చని భావిస్తున్నారు. ఈ పరిణామాలు ట్రంప్ పాలనకు పెద్ద సవాలుగా నిలిచాయి. తమ సైనిక స్థావరాలు ఉన్న దేశాలే ఇరాన్‌తో జతకడితే.. ఇక ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడం దాదాపు అసాధ్యంగా భావిస్తున్నారు. పైగా తమ గగనతలాన్ని అమెరికా సైన్యం వాడుకునేందుకు అరబ్ దేశాలు అంగీకరించకపోవచ్చు. ఇదే జరిగితే మధ్యప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యం సగానికిపైగా పడిపోయినట్లే. అరబ్ దేశాలు అమెరికాను పూర్తిగా కాదనడంలేదు. కానీ అదే సమయంలో ట్రంప్ అనాలోచిత నిర్ణయాల వల్ల రేగే యుద్ధాలు లేదా సైనిక ఘర్షణల్లో తాము బలిపశువులం కాకూడదన్న ఉద్దేశంతోనే అరబ్ దేశాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ పరిణామాలు ఇజ్రాయెల్ భవిష్యత్తు వ్యూహాలను దెబ్బతీయడంతోపాటు ప్రపంచ చమురు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేయనుందని అంటున్నారు. వీటికి ట్రంప్ ఎలా స్పందిస్తారో.. ఎటువంటి ప్రతి వ్యూహాలు అమలు చేస్తారన్నది ఆసక్తికరం. అరబ్ దేశాల వ్యూహాలను అంగీకరిస్తే వారికి లొంగి వెనక్కి తగ్గినట్లు అవుతుంది. అలా అని గల్ఫ్‌లో ఉన్న తన దేశానికి చెందిన అతిపెద్ద సైనిక స్థావరమై సెంట్రల్ కమాండ్‌ను అక్కడి నుంచి ఉపసంహరించి, స్వదేశానికి తరలించే సాహసం చేయలేని పరిస్థితి. ఎందుకంటే.. ఆ స్థావరంలో ఏకంగా 40వేల మంది సైనికులతో పాటు అత్యధునికి యుద్ధవిమానాలు, ఇతర యుద్ధ పరికరాలు అక్కడ ఉన్నాయి. అవి కాకుండా దాని పరిధిలోనే అమెరికన్ నేవీకి చెందిన అత్యాధునిక యుద్ధనౌకలు పశ్చిమాసియా సముద్ర జలాల్లో నిరంతరం పహారా కాస్తూ అమెరికా ప్రయోజనాలు పరిరక్షిస్తున్నాయి. అందువల్ల సెంట్రల్ కమాండ్‌ను తరలిస్తే ఆ ప్రాంతంపై అమెరికాకు ఉన్న సైనిక ఆధిపత్యం కోల్పోయినట్లే. మరోవైపు ప్రాంతీయ శాంతి, సౌభ్రాతృత్వం సాధిస్తే గల్ప్ దేశాల ప్రధాన ఆర్థిక వనరులైన చమురు వెలికితీత, రవాణా, అమ్మకాలు సజావుగా సాగి అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందని భావిస్తున్నారు. పెద్ద దేశాల మధ్య జరిగే యుద్ధాల్లో తమలాంటి చిన్న దేశాలు నాశనం కాకుండా మనుగడ సాధించేందుకే అరబ్ దేశాలు అమెరికా చేపట్టిన యాంటీ ఇరాన్ పాలసీకి దూరమై ప్రాంతీయ స్నేహం పెంపొందించుకోవాలని భావిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page