top of page

కొత్త స్కీమ్‌తోనైనా పసిడికి పగ్గాలు సాధ్యమా?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 1 day ago
  • 3 min read

మన దేశ ఆర్థిక విధానాలను నిత్యం ప్రభావితం చేస్తున్న అంశాల్లో బంగారానికి కీలక స్థానం. పెట్రో దిగుమతులకు సరిసమానంగా బంగారంపై విదేశీ మారకద్రవ్యాన్ని భారత ప్రభుత్వం ప్రతి ఏటా ఖర్చు చేయాల్సి వస్తున్నది. యుద్ధాలు, ఇతర సంక్షోభ పరిస్థితులు ఈ భారం ఊహించనంతగా పెరిగిపోతున్నది. దీనికి కారణం అందరికీ తెలిసిందే. భారతీయులు పసిడి ప్రియులు. బంగారు ఆభరణాలు ధరించడమే కాకుండా.. వివాహాది శుభకార్యాల్లో పిసరంత బంగారమైన తప్పనిసరిగా కొనాల్సిందేనన్న సంప్రదాయానికి వారంతా బద్ధులు. భారతీయుల సెంటిమెంట్లతోనూ పసిడి పెనవేసుకోపోయింది. అందుకే ప్రపంచంలో చైనా తర్వాత ఇండియాలోనే బంగారం కొనుగోళ్లు ఎక్కువ. కానీ మనదేశంలో అవసరాలకు తగినంత బంగారం ఉత్పత్తి చేసే గనులు లేవు. దాంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. కానీ అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. ఈ రోజు ఉన్న ధర రేపు ఉండదు. వీటిని తట్టుకుని అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకోవాలంటే భారీ ఎత్తున విదేశీమారక ద్రవ్యం వెచ్చించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో దేశంలో బంగారం కొనుగోళ్లు, వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పలు పథకాలు ప్రవేశపెడుతూనే ఉంది. కానీ ఏ ఒక్కటీ ఆశించినంతగా సత్ఫలితాలు ఇవ్వడంలేదని 1968లో అప్పటి ఇందిర ప్రభుత్వం తీసుకొచ్చిన గోల్డ్ కంట్రోల్ యాక్ట్ సహా అనేక పథకాల పనితీరు స్పష్టం చేస్తుంది. 2015లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన గోల్డ్ మానిటైజేషన్ పథకానిదీ అదే దుస్థితి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం బంగారం కొనుగోళ్లను అదుపు చేసేందుకు మరో పథకం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. పశ్చిమాసియా సంక్షోభం ఎప్పటికి పూర్తిగా పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు వీలుగా ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని కొద్ది నెలల క్రితమే ప్రధాని మోదీ నేరుగా దేశప్రజలకు పిలుపునిచ్చారు. దానివల్ల పెద్దగా ఫలితం కనిపించడంలేదని వార్తలు వస్తున్న తరుణంలో కొత్త పథకం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గిండంతో పాటు ప్రజలు తమ ఇళ్లలో పెద్దఎత్తున దాచిపెట్టుకున్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతిపాదిస్తున్న ఈ పథకాన్ని కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌గానే పిలుస్తున్నప్పటికీ గతంలో ప్రవేశపెట్టిన మానిటైజేషన్ పథకంలో పలు మార్పులు చేసి, మరింత ఉపయోగకరంగా రూపొందించినట్లు సమాచారం. వచ్చే రెండు మÖడు వారాల్లో దీన్ని ఆచరణలోకి తెచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త పథకం ద్వారా దేశవ్యాప్తంగా వెయ్యి టన్నులకు తక్కువ కాకుండా బంగారం సమీకరించాలని ప్రభుత్వ లక్ష్యమని అంటున్నారు. ప్రతిపాదిత కొత్త పథకం అమల్లో బంగారు ఆభరణాల వ్యాపారుల(జ్యూయలర్స్)ను భాగస్వాములను చేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలు ప్రభుత్వ సంస్థల వద్దకు వెళ్లే అవసరం లేకుండా జ్యూయలర్ల ద్వారా తమ బంగారం పెట్టుబడులను ఈ పథకంలో పెట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటివరకు ఈ అవకాశం బ్యాంకుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ప్రజలకు సులభతరంగా ఉంటుందని ఆల్ ఇండియా జ్యూయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ అభిప్రాయపడింది. నిపుణుల అంచనా ప్రకారం భారతీయ కుటుంబాల ఇళ్లలో ఉన్న బంగారంలో కేవలం ఐదు శాతం ఈ పథకం కింద ప్రభుత్వ ఖజానాకు చేరినా 80 నుంచి 90 బిలియన్ డాలర్ల వరకు లిక్విడ్ కరెన్సీ రూపంలో అందుబాటులోకి వస్తుందని అంచనా. అలాగే దిగుమతులపై ఆధారపడటాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. కొత్త స్కీమ్ ప్రతిపాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో అసలు 2015 నాటి పాత గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఎందుకు విఫలమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అప్పటి పథకం ప్రధాన ఉద్దేశం బంగారం దిగుమతులను తగ్గించడం, మనదేశ కరెంటు ఖాతా లోటును నియంత్రించడమే లక్ష్యం. ఆ పథకం కింద ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే దానిపై 2.25 నుంచి 2.50 శాతం వరకు వడ్డీ లభించేది. అయితే ఇది అంత ఆకర్షణీయంగా లేకపోవడంతో పదేళ్లలో అంటే 2025 మార్చి నాటికి ఈ పథకం ద్వారా 38 టన్నుల బంగారం మాత్రమే బ్యాంకులకు చేరింది. దేశంలో సుమారు 25వేల టన్నుల బంగారం ఉందని అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో బయటకొచ్చింది చాలా తక్కువేనని చెప్పాలి. ఈ పథకం విఫలం కావడానికి నిపుణులు పలు కారణాలు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుబ వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలను కరిగించి బ్యాంకుల్లో జమ చేయడానికి ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఇష్టపడలేదు. పాత బంగారంపై పన్ను విధిస్తారని, ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందన్న భయాలు కూడా ఈ పథకాన్ని ప్రజలకు చేరువ కాకుండా అడ్డుకున్నాయి. ఈ పథకం వల్ల పెద్దగా లాభదాయకత లేదన్న భావనలో బ్యాంకులు ఈ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయలేదు. పాత స్కీమ్ స్థానంలో ప్రవేశపెడుతున్న కొత్త పథకంలో దాని కంటే మెరుగైన ప్రయోజనాలు ఏముంటాయన్న చర్చ జరుగుతోంది. ఇంతవరకు బంగారాన్ని బ్యాంకుల్లోనే జమ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వాటితో పాటు ప్రైవేట్ జ్యూయలర్స్ కూడా భాగస్వామ్యం కల్పించడం వల్ల ఎక్కువమంది మానిటైజేషన్‌కు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇళ్లలో ఆభరణాల రూపంలో నిరుపయోగంగా ఉన్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. బంగారం కోసం డాలర్లపై ఆధారపడే బాధ నుంచి దేశానికి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఫలితంగా రూపాయి విలువ అంతర్జాతీయంగా బలపడుతుంది. దిగుమతులు తగ్గడం వల్ల ధరలు అదుపులోకి వస్తాయి.. మన కంట్రోల్లోనే ఉంటాయి. కానీ ఇవన్నీ పథకం విజయవంతం కావడంపైనే ఆధారపడి ఉంటాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page