top of page

భారత్ లక్ష్యంగా బంగ్లా భుజంపై చైనా గన్

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 3 min read

ఏకు మేకు అవ్వడం ఇదేనేమో! ఒకప్పుడు మనుగడ కోసం పోరాడుతూ మనదేశం అండతో స్వేచ్ఛావాయువులు పీల్చుకుని పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మన పక్కలోనే బల్లెంలా తయారవుతున్నది. భారత్ తన శత్రువులుగా పరిగణిస్తూ నిత్యం వాటితో సమస్యలు ఎదుర్కొంటుంటే.. ఇప్పుడు బంగ్లాదేశ ఆ దేశాలతోనే మిలాఖత్ అయ్యి భారత్ వ్యతిరేకంగా వ్యూహాత్మక సైనిక కార్యకలాపాలకు వీలుగా తన భూభాగాలనే శత్రువులకు అప్పగిస్తున్నది. గతంలో పాక్ పాలకుల గత వేధింపులను, అన్యాయాలను విస్మరించి ఇప్పుడు ఆ దేశంతో చేతులు కలపడమే కాకుండా.. ఇప్పుడు ఏకంగా చైనాతో చేతులు కలిపి భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. 2024లో షేక్‌హసీనా ప్రభుత్వం పతనమై, ఆమె భారత్‌కు పారిపోయి ఆశ్రయం పొందిన తర్వాత బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి అక్కడ భారత వ్యతిరేక చర్యలు పెరిగాయి. తాజాగా బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ చైనా పర్యటన ఈ చర్యలను మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్లింది. చైనాతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో దాదాపు అన్నీ భారత్‌కు లక్ష్యంగా చేసుకున్నవే కావడం గమనార్హం. పైగా అవి మనదేశ భద్రతను సవాల్ చేసేలా ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ విషయంలో ముందుగా బంగ్లా ప్రధానే చొరవ తీసుకోవడంతో చైనా అధినేత జిన్‌పింగ్ పని మరింత సులువైంది. ముందుగా ప్రతిపాదించిన ఒప్పందాలతోపాటు పనిలో పనిగా బంగ్లాదేశ్-మయన్మార్ - చైనా ఎకనామిక్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనను ఆయన తెరపైకి తెచ్చారు. ఈ పర్యటనలో బంగ్లా`చైనా మధ్య 17 ఒప్పందాలు కుదిరాయి. అవన్నీ దాదాపు భారత్`బంగ్లా సంబంధాలను దెబ్బతీసేవే అయినప్పటికీ వాటిలో ఒక ఒప్పందం మాత్రం భారత అధికారవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకప్పడు భారత్‌తో అమల్లో ఉన్న ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుని మరీ చైనాతో కుదుర్చుకోవడమే దీనికి కారణం. బంగ్లా`చైనా చర్చల్లో ప్రధానం బంగ్లాదేశ్‌లోని పోర్టులపైనే చైనా అధినేత దృష్టి సారించారు. పోర్టులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే భారత్‌ను సులభంగా దెబ్బతీయవచ్చన్నది చైనా ఆలోచన. ఇందులో భాగంగా ప్రధానమైన చిటగాంగ్ ఓడరేవును మరింత ఆధునికీకరించేందుకు చైనా ముందుకొచ్చినట్లు బంగ్లా సర్కారు ప్రకటించింది. ఆ తర్వాత మొంగ్లా పోర్టును మరింత సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దడంపైనా చర్చలు జరిగాయి. ఇక్కడ ఒక విషయం ప్రస్తావనార్హం. చాలాకాలంగా భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లోని కీలక పోర్టులను చైనా ఒక ప్రణాళిక ప్రకారం చేజిక్కించుకుంటున్నది. పాకిస్తాన్‌లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్‌టోట, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్టుల్లో ఇప్పటికే చైనా పాగా వేసింది. ఇప్పుడు వాటి సరసన బంగ్లాకు చెందిన మరో పోర్టు చేరబోతున్నది. అదే ఆ దేశంలోని రెండో పెద్ద పోర్టు అయిన మొంగ్లా. ఈ పోర్టుకు ఆనుకుని ఉన్న 110 ఎకరాల భూమిని భారతీయ ఆర్థిక మండలి (ఇండియన్ ఎకనమిక్ జోన్) అభివృద్ధి కోసం 2015లో షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో భారతీయ డెవలపర్‌కు కేటాయించారు. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసి అదే భూమిని చైనాకు అప్పగించారు. నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించలేదన్న సాకుతో గత అక్టోబర్ యానిస్ అహ్మద్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. భారత్`బంగ్లా సంబంధాల్లో ఏర్పడిన విభేదాలను ఆసరా చేసుకుని చైనా పావులు కదపడంతో ఆ భూమి ఇప్పుడు దాని చేతిలోకి వెళ్లిపోయింది. చిట్టగాంగ్, మొంగ్లా పోర్టులపై చైనా పట్టు పెరగడంతోపాటు బంగ్లాదేశ్‌లో దాని కదలికలు పెరగడం భవిష్యత్తులో భారత భద్రతకు, భౌగోళిక రాజకీయాలకు తీవ్ర సవాల్‌గా మారనుంది. మొంగ్లా పోర్టు మనదేశంలోని కోల్‌కతా పోర్టుకు కేవలం 188 కిలోమీటర్ల దూరంలోనే ఉండటమే వ్యూహాత్మకంగా అది చైనాకు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. మొంగ్లా పోర్టు ద్వారా భారత తూర్పు, ఈశాన్య సరిహద్దులు.. ప్రత్యేకించి భారత తూర్పు నావికాదళ కార్యకలాపాలపై నిఘా పెట్టడం సులువవుతుంది. ఇప్పటికే పశ్చిమంలో పాక్‌లోని గ్వాదర్, దక్షిణాదిన శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టుల నిర్వహణను హస్తగతం చేసుకున్న చైనా తూర్పు తీరంలోని బంగ్లా పోర్టులను చేజిక్కించుకోవడం మÖడువైపుల నుంచి భారత్‌ను చైనా నౌకాదశం ముట్టడించి సైనిక ఒత్తిడి పెంచే ప్రమాదం ఉంది. మరోవైపు ఉత్తర బంగ్లాదేశ్‌లోని తీస్తా నది ప్రాజెక్టును కూడా చైనాకు అప్పగించే దిశ మంతనాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలను మిగతా భారతదేశంతో కలిపే సిలిగురి కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. యుద్ధ సమయాల్లో భారత్‌కు ఇది అత్యంత కీలకం. ఈ పరిస్థితుల్లో చైనా ఆ ప్రాంతానికి చేరువ కావడం భారత ప్రాదేశిక సమగ్రతకు ప్రమాదంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు చైనా, పాకిస్తాన్ సరిహద్దులపైనే మనసైన్యం నిఘా కేంద్రీకరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బంగ్లాలో చైనా ఉనికి పెరిగేకొద్దీ భారత్ తన తూర్పు సరిహద్దు అయిన బంగాళాఖాతంపై అధిక సైనిక విభాగాలకు, నిఘా వ్యవస్థలను మోహరించాల్సి ఉంటుంది. అయితే శత్రువుల వ్యూహాలను ఎప్పటికప్పుడు చిత్తు చేయడంలో మనదేశం ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. సరిహద్దుల్లో చైనా కదిలికలను నిరంతరం గమనిస్తూ ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం, వారి వ్యూహాలను నిర్వీర్యం చేయడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు కూడా చైనా పోర్టుల వ్యూహానికి ప్రతిగా భారత్ మయన్మార్‌లోని సిట్వే పోర్టు, ఒమన్‌లోని దుక్మ్ పోర్టు, ఇండోనేషియాలోని సబాంగ్ పోర్టుల నిర్వహణ బాధ్యతలను తీసుకుని వ్యూహాత్మకంగా తన పరిధిలోకి తీసుకుంది. అదే సమయంలో తూర్పుతీరంలో అండమాన్ నికోబార్ దీవులను అత్యాధునిక మిలటరీ బేస్‌గా అభివృద్ధి చేస్తున్నది. చైనా`పాకిస్తాన్`బంగ్లాదేశ్ రూపంలో ముప్పు పొంచి ఉన్నప్పటికీ మన సరిహద్దుల రక్షణ, ఆర్థిక దౌత్య వ్యూహాలు, అధునాతన క్షిపణి వ్యవస్థలతో శత్రువుల వ్యూహాలకు చెక్ చెప్పేందుకు భారత్ సిద్ధంగా ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page