top of page

పురుడు పోసుకుంటున్న భూకంపాల హెచ్చరిక వ్యవస్థ

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 2 min read

ప్రకృతి ప్రకోపించి భూకంపం రూపంలో విరుచుకుపడటంతో వెనిజులాలోని పలు ప్రాంతాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇప్పటికే మృతుల సంఖ్య వెయ్యి దాటగా.. వేలల్లో క్షతగాత్రులు ఆస్పత్రుల పాలయ్యారు. వరుసగా రెండు అంతకుమించి ఎక్కువసార్లు భూ కంపిస్తే ఎంతబలంగా నిర్మించిన కట్టడాలైన పేకమేడల్లా కూలిపోతాయి. దీన్నే వెనిజులా భూకంపం మరోసారి నిరూపించింది. పెద్దపెద్ద భవనాలు ఉన్నఫళంగా కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద వేలాదిమంది చిక్కుకున్నారు. వారి వెలికితీత కార్యక్రమాలు మందకొడిగా జరుగుతున్నాయి. అదే సమయంలో దఫదఫాలుగా సంభవిస్తున్న ప్రకంపనలు వెనిజులా వాసులను వణికిస్తున్నాయి. వీటివల్ల శిథిలాల తొలగించి వాటి కింద చిక్కుకున్నవారిని రక్షించే చర్యలు వేగం పుంజుకోలేకపోతున్నాయి. వెనిజులా సంగతి ఇలా ఉంటే.. సరిగ్గా వెనిజులాలో వరుస భూకంపాలు సంభవించిన రోజే ఇక్కడ మనదేశంలో పెట్టని కోటల్లా మనం మురిసిపోయే మంచుకొండలు.. హిమాలయ పర్వత సానువుల్లోనూ భూప్రకంపనలు సంభవించి తీవ్ర అలజడి, ఆందోళన రేపాయి. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా, మరికొన్ని ప్రాంతాల్లో భూమి కంపించాయి. దీనివల్ల ప్రాణనష్టం లేకపోయినా.. భూకంపాల ముప్పును తప్పించే ముందస్తు హెచ్చరికల వ్యవస్థ గురించి చర్చ మొదలైంది. హెచ్చరిక వ్యవస్థల సంగతి ఎలా ఉన్నా.. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు, ప్రాంతాలు భూకంపాల జోన్‌లో ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైన భూకంపాల జోన్‌గా హిమాలయ పర్వత ప్రాంతాన్ని భూగర్భ శాస్త్రవేత్తలు రెడ్ జోన్‌లో చేర్చారు. భారత టెక్టానిక్ ప్లేట్ నిరంతరం యురేషియాన్ ప్లేట్‌ను ఢీకొంటుండటం వల్ల అక్కడ భూమి అడుగున ఒత్తిడి తీవ్రంగా పెరుగుతున్నది. ఆ ఒత్తిడి ఒక్కసారి రిలీజ్ అయితే భారీ భూకంపాలు సంభవించే ముప్పు ఉంటుంది. ఈ కారణంతోనే హిమాలయ ప్రాంతాన్ని అతి సున్నితమైన భూకంపాల జోన్‌గా పరిగణిస్తున్నారు. మంచు పర్వతాలు, అనేక హిమానీ నదాలకు పుటినిల్లు అయిన హిమాలయాల్లో భూకంపం సంభవిస్తే ఆ విలయం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించశక్యం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందు హెచ్చరిక వ్యవస్థ రూపొందించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నా అవి ఇంకా ఫలవంతం కాలేదు. భారత్‌లోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడా భూకంపాల రాకను ముందుగా పసిగట్టి హెచ్చరించే వ్యవస్థలు అందుబాటులోకి రాలేదు. కానీ భూమి లోపలి పొరల్లో ప్రకంపనలు ప్రారంభమైన వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలో వాటిని గుర్తించి అప్రమత్తం చేయగలిగే సాంకేతికత మాత్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నది. ఆ కొద్ది నిమిషాలు, సెకన్లే వేలాది ప్రాణాలు కాపాడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును మనదేశంలోని రూర్కీ ఐఐటీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వం కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ప్రజలకు తక్షణ హెచ్చరికలు పంపేందుకు భూదేవ్ అనే మొబైల్ యాప్‌ను కూడా రూపొందించింది. మరోవైపు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం కూడా కొత్త తరహా వ్యవస్థలను పరీక్షిస్తున్నది. ప్రాంతీయ సిస్మిక్ డేటాను అధ్యయనం చేసి వెంట వెంటనే భూకంపాల తీవ్రతను అంచనా వేయగలిగే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. భూకంపం సంభవించినప్పుడు ముందుగా భూమి నుంచి పి`వేవ్స్ అను తరంగాలు వెలువడి వేగంగా ప్రయాణిస్తాయి. ఇవే ప్రమాదానికి తొలి సంకేతంగా పనిచేస్తాయి. అనంతరం కొంత గ్యాప్‌తో ఎస్ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్ విడుదలవుతాయి. భారీ విధ్వంసాలకు ఇవే కారణమవుతాయి. ఈ తరంగాల ఆధారంగానే ముందస్తు హెచ్చరిక వ్యవస్థల తయారీకి భారత పరిశోధన రంగం ప్రయత్నిస్తున్నది. భూకంప కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేసే ప్రత్యేక సెన్సర్లు పి`వేవ్స్‌ను వెంటనే గుర్తించి ఆ సమాచారాన్ని కంట్రోల్ రూములోని కంప్యూటర్ కేంద్రానికి చేరవేస్తాయి. ఆ సమాచారం ఆధారంగా భూకంప కేంద్రం ఎంత దూరంలో ఉంది. ప్రమాదకరమైన ఎస్`వేవ్స్ ఎటువైపు ప్రయాణిస్తాయన్న వివరాలను విశ్లేషించి హెచ్చరికలు పంపుతాయి. దీనివల్ల ప్రకంపనలు ఆయా ప్రాంతాలకు చేరే లోపే కొన్ని సెకన్ల ముందే ప్రమాద హెచ్చరికలు అందుతాయి. ఇక్కడ కొన్ని సెకన్లు అంటే చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ అత్యవసర పరిస్థితుల్లో అవే అత్యంత విలువైనవి. ఆ కాస్త వ్యవధిలోనే చాలా రక్షణ చర్యలు చేపట్టవచ్చు. ఈ సెన్సర్లలో అధిక శాతం ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని గడ్వాల్, కుమావ్ హిమాలయ పర్వత సానువుల్లో ఏర్పాటు చేశారు. హిమాలయన్ ఫాల్టీ లైన్లకు అతి సమీపంలో ఉన్నందున ప్రకంపనలను వేగంగా గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే.. సెన్సర్లు భూకంప నిలయాలకు అతి సమీపంలో ఉన్నప్పటికీ ఆ ప్రాంతావాసులకు మాత్రం ముందస్తు భూకంప సమాచారం అందించలేకపోవడం. భూకంప కేంద్రాలకు పదులు, వందల కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాలకే వీటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. హిమాలయ పర్వత ప్రాంతాలన్నింటికీ రియల్‌టైమ్ సిస్మిక్ వ్యవస్థను విస్తరించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఈ విషయంలో జపాన్, తైవాన్, అమెరికా మరికొన్ని దేశాలు ఈ తరహా సెన్సర్ వ్యవస్థల ప్రయోగాల్లో మనకంటే ముందు ఉన్నాయి. వాటిని విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి కూడా. అందుకే ఆయా దేశాల్లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తున్నా కూడా ఆస్తి, ప్రాణ నష్టం మనలాంటి దేశాల కంటే తక్కువస్థాయిలోనే ఉంటుంది. ఇప్పటికే వెనిజులా తరహాలో సంభవిస్తున్న ఘోర ప్రకృతి విపత్తులను చూసిన తర్వాతైనా మన దేశం, శాస్త్రవేత్తలు ఆధునిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేలా తమ పరిశోధనలను వేగవంతం చేయాలి. హిమాలయ రీజియన్‌లో ఇప్పటికే ఏర్పాటు చేసి సెన్సర్ వ్యవస్థలను దేశంలో గర్తించిన ఇతర భూకంప జోన్లలోనూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page