రూ.లక్ష జీతగాళ్లకూ నెలాఖరు కష్టాలే!
- DV RAMANA

- 2 days ago
- 3 min read

జీవన వ్యయం పెరిగిపోయింది. రూపాయి విలువ తరిగిపోయింది. ఒకనాడు చిల్లర పైసలే మహాభాగ్యంగా కళ్లకు అద్దుకునేవారు. కానీ ఇప్పుడు రూపాయి ఇస్తే బిచ్చగాడు కూడా తీసుకోకపోగా అదోరకంగా తిరిగి చూసే రోజులు దాపురించాయి. ఒకనాడు వెయ్యి రూపాయల జీతంతో దర్జాగా జీవించే పరిస్థితులు కాస్త ఆ వెయ్యి పక్కన మరో రెండు సున్నాలు చేర్చి లక్ష రూపాయల జీతం సంపాదించేవారిని సైతం నెలాఖరు రోజుల్లో బిత్తరుచూపులు చూసేలా చేస్తున్నాయి. ఒకప్పుడు రూ.లక్ష జీతమంటే అబ్బో.. ఇంకేముంది వారి లైఫ్ సెటిల అయిపోయినట్లేనని అందరూ ఆనందపడేవారు. లక్షే కాదు రూ.50వేల జీతగాళ్లను కూడా ఎంతో గొప్పగా చూసేవారు. కానీ రోజులు మారాయి. జీతాలు ఎంతగా పెరుగుతుంటే.. అంతకు మించి అన్నట్లు జీవన వ్యయం పైపైకి ఎగబాకుతున్నది. అది చాలదన్నట్లు అవసరాలు పెరుగుతున్నాయి. ఫలితంగా ఎంత పెద్ద జీతగాడికైనా నెలాఖరు వచ్చేసరికి జేబులు ఖాళీ అయిపోతున్నాయి. బ్యాంకు బ్యాలెన్స్ చూడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ‘జీతం బాగానే వస్తోంది.. కానీ నెల పూర్తిగా గడవకముందే అదంతా ఎటు పోతున్నదో అర్థం కావడం లేదు’ అన్న అవేదన, ఆందోళన దాదాపు అందరినీ వేధిస్తున్నది. కాగితాల మీద జీతం అంకెలు ఘనంగా కనిపిస్తున్నా.. ఖర్చుల వరకు వచ్చేసరికి అవన్నీ త్వరత్వరగా కరిగిపోయి కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయన్నది సగటు సంపాదనపరుల ఆవేదన. ఈ పరిస్థితికి కారణం ఏమిటి అన్న ప్రశ్నకు పలు అధ్యయనాలు ఆసక్తికర కారణాలు వెల్లడించాయి. జీవన వ్యయం పెరగడం అన్నది ఆ కారణాల్లో ఒకటే తప్ప.. అదే ఏకైక కారణం మాత్రం కాదని ఇవి స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్‌లో అన్ని రకాలు వస్తువులు, సేవలు అదుపు లేకుండా పెరిగిపోయి మన జేబుకు చిల్లు పెడుతున్నాయన్నది అందరికీ తెలిసిన కారణమే. కానీ మరో ముఖ్యమైన, ఎవరూ పెద్దగా గుర్తించలేని.. గుర్తించినా అంగీకరించడానికి ఇష్టపడని కారణం.. జీతంతోపాటు పెరిగే మన అవసరాలు, మన జీవనసరళి (లైఫ్‌స్టైల్). ఇవి నిశ్శబ్దంగా మన జేబు, బ్యాంకు అకౌంట్‌పై దాడి చేస్తూ పోటీ పడి వాటిని ఖాళీ చేసేస్తున్నాయి. జీతం పెరగడంతోనే మన జీవన హాదా పెరిగినట్లు భావించడం సహజం. అందువల్ల కొత్తగా పుట్టుకొచ్చే పలు అవసరాలను మరో ఆలోచన లేకుండా ఆహ్వానించేస్తాం. ఈ పరిస్థితినే లైఫ్‌స్టైల్ క్రీప్ అంటారు. గతంలో మన ఇళ్లలో.. అదీ ధనవంతులు, పెద్ద ఉగ్యోగుల ఇళ్లలో ఇంటందరికీ కలిపి ఒకే ఒక్క ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండేది. కానీ సెల్‌ఫోన్లు వచ్చిన తర్వాత దానికి అదనంగా ఎక్కడికి వెళ్లినా మాట్లాడటానికి వీలుగా ఇంటి యజమాని చేతిలోకి సెల్ వచ్చింది. ఆ తర్వాత దాంతో అందరికీ అవసరం పెరిగింది. అందువల్ల ఇంటిల్లిపాదీ సెల్‌ఫోన్‌ను తమ హస్తభూషణంగా మార్చుకున్నారు. చివరికి ఇప్పుడు స్కూలుకు వెళ్లి పిల్లలు కూడా ఆన్‌లైన్ పాఠాల పేరుతో తమకూ సెల్‌ఫోన్ కొనిపిస్తున్నారు. ఫోన్లు కొంటే సరిపోదు కదా!.. వాటిని ప్రతినెలా రీఛార్జి చేయించాలి. అంటే అదొక అదనపు ఖర్చు. అలాగే తక్కువ జీతం ఉన్నప్పుడు చిన్న ఇంటిలోనే సర్దుకునేవారు. కానీ జీతం పెరిగితే దాంతో పాటు విలాసవంతమైన పెద్ద ఇళ్లకు మారాలనుకుంటున్నారు. దానివల్ల అద్దె పెరగడం లేదా సొంత ఇల్లయితే లోన్ ఈఎంఐల భారం ప్రతినెలా మన జీతంలో వాటా కోరుతంటాయి. ఇక ఇంట్లో ఏసీ, బయట తిరగడానికి కారు వంటివి కొన్నేళ్ల క్రితం వరకు విలాస వస్తువులుగా పరిగణన పొందేవి. కానీ ప్రస్తుత మెట్రో, నగర, సిటీ జీవనంలో అవి అవసరంగా మారాయని అధిక శాతం మంది భావిస్తున్నారు. వాటిని రుణాలతో కొంటే ఈఎంఐలు, అలాగే వాటి నిర్వహణ ఖర్చులు జీతాన్ని మరింత కరిగించేస్తున్నాయి. అలాగే సెలవుల్లో విహారయాత్రలు, అవుటింగులు బడ్జెట్ బరువును మరింత పెంచేస్తున్నాయి. కష్టపడి పనిచేస్తున్నప్పుడు వచ్చే ఆదాయంతో ఎంజాయ్ చేయాలి కదా.. అని అనేకమంది వాదిస్తుంటారు. అందులో తప్పులేదు. కానీ అది మితిమీరకూడదన్నదే చాలామంది విస్మరిస్తున్న అంశం. పెరుగుతున్న జీతానికి మించి అవసరాలు, ఖర్చులు పెరిగినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సంపాదిస్తున్నది అనుభవించడానికే కదా.. అన్న ధోరణితోనే అధికశాతం మంది జీతాన్ని ఎప్పటికప్పుడు ఖర్చు చేసేస్తూ.. బ్యాంకు బ్యాలెన్స్‌ను జీరో చేసేస్తుంటారు. జీవితం అన్నాక భవిష్యత్తు గురించి ఆలోచించాలి.. అనుకోని సమస్యలు, ఊహించని అవసరాలు వచ్చినప్పుడు ఇతరుల వద్ద చేతులు చాచకుండా ప్రతినెలా జీతంలో కొంత వెనకేసుకోవాలన్న ఆలోచన పెద్దగా కనిపించడంలేదు. ఇటువంటి ధోరణి అనుకోని పరిస్థితుల్లో మనల్ని అప్పుల పాలు చేస్తుంది. మరికొందరు పొదుపు చేస్తున్నారే తప్ప దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చి ఆ విధంగా కూడా కొంత ఆదాయం సంపాదించవచ్చన ఆలోచన చేయలేకపోతున్నారు. ఈ జనరేషన్ యువత కొంత అవగాహనతో వ్యవహరిస్తున్నా.. ఇంకా చాలమార్పు రావాల్సిన అవసరం ఉంది. చాలామందికి పొదుపు చేసిన సొమ్మును ఏవైనా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కమిట్‌మెంట్లు, అవసరాలు, ఒత్తిళ్లు వాటిని డామినేట్ చేస్తున్నాయి. ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.. వచ్చే నెల చూసుకుందాం లే.. అన్న ఆలోచనతో పెట్టుబడి ఆలోచనలను వాయిదా వేసుకుంటున్నారు. ఇలా ఏదో ఒక సాకుతో ప్రతినెలా ఇన్వెస్ట్‌మెంట్ ఆలోచనలను వాయిదా వేస్తూ పోతే ఒకేసారి పెద్ద అవసరం వచ్చి బొక్కబోర్లా పడే దుస్థితి ఏర్పడుతుంది. చిన్న నగరాల్లో పరిస్థితి ఒకలా ఉంటే.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో పెద్ద జీతగాళ్ల జీవనం కూడా సాదాసీదాగానే ఉంటుంది. రూ.లక్ష జీతం ఉన్నా.. ఒకటో తేదీన ఆ సొమ్ము చేతిలో పడకముందే స్కూలు ఫీజులు, ఈఎంఐలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు క్యూ కడతాయి. క్రెడిట్ కార్డులు, బై నౌ పే లేటర్ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లు పెద్ద జీతగాళ్లను కూడా మాయ చేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జీతంలో కొంత పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్లే మనకు రక్ష.






Comments