ఇంకెన్నాళ్లు సమ్మె పేరు చెబుతారు?
- BAGADI NARAYANARAO

- Jun 2
- 1 min read
డివిజన్‌కు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి
ఉన్న సిబ్బందితో రోజుకో వీధికి వెళ్లినా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

నగరపాలక సంస్థలో ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎక్కువమంది గత కొద్ది రోజులుగా సమ్మెలో ఉన్నమాట వాస్తవం. అయితే అదే సాకు చూపించి ఇంకా ఎన్నాళ్లు నగరాన్ని చీకట్లోలోకి నెట్టేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. విద్యుత్ దీపాలు వెలిగించాల్సిన సిబ్బంది సమ్మెలో ఉండొచ్చుగాక. అంతమాత్రాన ప్రభుత్వం వారి డిమాండ్లు అంగీకరించేవరకు వారు సమ్మెలోనే ఉంటే నగరంలో వీధి దీపాలు వెలిగించరా? అని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఉన్న సిబ్బందితో రోజుకొక వీధివైపు చూసినా వెలుగులు వస్తాయి కదా? అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవమే. ఉన్న సిబ్బందితో కనీసం రోజుకొక డివిజన్‌లో ఒక రోడ్డును పరిశీలించినా నగరంలో కనీసం 15 రోజులకు అన్ని వీధి దీపాలనూ వెలిగించొచ్చు. అది వదిలేసి సిబ్బంది సమ్మెలో ఉన్నారని చెప్పి తప్పించుకోవడం సరికాదని ప్రజలు అంటున్నారు. అదే పాలకవర్గం ఉండుంటే.. సంబంధిత కార్పొరేటరో, లేదా వార్డు కౌన్సిలరో దగ్గరుండి ఈ పనులు చేపట్టివుండేవారు కదా.. కార్పొరేషన్‌కు స్పెషల్ అధికారిగా ఉన్న కలెక్టర్ డివిజన్‌కు ఒక స్పెషల్ అధికారిని వేసి ఈ సమస్యకు పరిష్కారం చూపలేరా? అని అడుగుతున్నారు. అధికార పార్టీలో ఉన్న నాయకులు తమ వీధిలో దీపాలు వెలగడంలేదని ఫిర్యాదు చేస్తే మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు కార్యాలయం ప్రహరీకి ఆనుకొని టెంట్ వేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను చూపిస్తున్నారు. అదే కలెక్టర్ తలచుకుంటే జిల్లాలో వివిధ శాఖల్లో ఉన్న ఎలక్ట్రీషియన్లను తెచ్చి నగరానికి వెలుగులు పంచడం పెద్ద విషయం కాదు.










Comments