తగ్గింది హడావుడే.. డయేరియా కాదు!
- NVS PRASAD

- Mar 2
- 2 min read
ఆర్భాటమే తగ్గింది.. ఆందోళన అలాగే ఉంది!

ఇతర ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కొత్త కేసులు
మున్సిపల్ హెల్త్ విభాగం అసమర్థతే కారణం
నాగావళిని మలవ్యర్థాలతో కలుషితం చేస్తున్న మాఫియా
అటువైపు దష్టి సారించని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్
క్లోరినేట్ చేసినా కుళాయి నీరంటే హడలిపోతున్న జనం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలో ప్రబలిన డయేరియా అరికట్టే పేరుతో అధికారులు చేసిన హడావుడి సోమవారం నుంచి తగ్గుముఖం పట్టింది. కానీ డయేరియా మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. వ్యాధి మొద{ వెలుగు చూసిన ప్రాంతంలో కేసులు తగ్గి ఉండొచ్చుగానీ.. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఒకటో రెండో కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఇది సాధారణమేనని, ప్రతి సీజన్‌లోనూ ఇటువంటివి నమోదవుతాయని అధికారులు సరిపెట్టుకుంటారో లేక సీరియస్‌గా తీసుకుంటారో వారే నిర్ణయించుకోవాలి. కాగా వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం నీరు కలుషితం కావడమేనని తేలింది. ఒక ప్రాంతంలో కుళాయిల ద్వారా మురుగునీరు రావడం వల్ల మాత్రమే ప్రబలిన వ్యాధి కాదిది. మొత్తం నాగావళి నదిలో నీరే పొల్యూట్ అయిపోయింది. ఈ విషయంలో హెల్తాఫీసర్ సుధీర్‌కు కనీస పరిజ్ఞానం లేదు. 38 సచివాలయాలకు 38 మంది శానిటేషన్ సెక్రటరీలు, ప్రతి శానిటేషన్ డివిజన్‌కు ఇద్దరు సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు వంటి పెద్ద యంత్రాంగమే ఉన్నా హెల్తాఫీసర్లు మాత్రం కనీసం ఇన్నాళ్లలో దీన్ని మానిటర్ చేయలేకపోయారు. కమిషనర్ వెనకో, కలెక్టర్ వెనకో చేతులు నులుపుకుంటూ వెళ్లడం తప్ప స్వతహాగా వాటర్ వర్క్స్‌ను పరిశీలించిన పాపాన పోలేదు. ఇది పూర్తిగా ఇంజినీరింగ్ విభాగం బాధ్యతగా భావించడమే దీనికి కారణం. వాటర్‌లో క్లోరినేషన్ దగ్గర్నుంచి పీహెచ్ లెవల్ వరకు అన్నింటినీ చూడాల్సింది హెల్త్ విభాగమేనని ఆయనకు తెలియదనుకోడానికి వీల్లేదు. ఎందుకంటే.. క్లోరినేషన్ పేరుతో సొమ్ము చేసుకుంటున్నది హెల్తాఫీసరే కాబట్టి తాగునీటి సరఫరాలో తన పాత్రా ఉంటుందని ఆయనకు ఎరుకే. అయితే ఆ కోణంలో ఎప్ప్పుడూ ఆయన పని చేయలేదు. నాగావళి నదిలో ఉన్న ఇన్‌ఫిల్ట్రేషన్ బావుల్లోకి మలమూత్రాలతో కూడిన నీరు చేరుతున్నదని చెప్పడానికి చింతిస్తున్నాం. కానీ ఇప్పటికైనా సీరియస్‌గా తీసుకుంటారన్న ఆశాభావంతో ఈ కథనాన్ని ప్రచురిస్తున్నాం.
నీటి క్వాలిటీపై శ్రద్ధ ఏదీ?
నగరంలో సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసే మాఫియా ఒకటి ఉంది. పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఉన్న యాతపేట దీనికి కేంద్రం. ఇక్కడ దాదాపు 30 సెప్టిక్ క్లీనింగ్ ట్యాంకర్లు ఉంటాయి. వీరు నగరం చుట్టుపక్కల ఎక్కడ సెప్టిక్ ట్యాంకును క్లీన్ చేసినా, ఆ వ్యర్థాలను తీసుకెళ్లి నాగావళి నదిలో కలిపేస్తున్నారు. అది కూడా ఇన్‌ఫిల్ట్రేషన్ బావులకు దగ్గరలో! ఆమదాలవలస నియోజకవర్గం మొదలవలస, గోరింట ప్రాంతాల నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న రెల్లిగెడ్డ కాలువలో ఆ వ్యర్థాలను ఈ మాఫియా కలిపేస్తున్నది. రోడ్డు మీద ట్యాంకర్‌ను ఉంచి, దాని డిశ్చార్జి పైప్‌ను కల్వర్టు మీద నుంచి రెల్లిగెడ్డ కాలువను దించుతున్నది. ఈ నీరు కాలభైరవ పీఠం మీదుగా నాగావళి నదిలో ఉన్న ఇన్‌ఫిల్ట్రేషన్ బావుల వద్దకు చేరుతుంది. జరిపినాయుడుపేట, తమ్మినాయుడుపేట మధ్యలో ఉన్న ఈ పంట కాలువలో మలం కలవడం వల్ల నాగావళి నది కలుషితమవుతోంది. అయితే ఒక్కరోజు కూడా హెల్తాఫీసర్ సుధీర్ అటువైపు కన్నెత్తి చూడలేదు. తీవ్రమైన దుర్గంధంతో గాలి పీల్చలేకపోతున్నామంటా పరిసర ప్రాంతవాసులు మొరపెట్టుకున్నా హెల్తాఫీసర్ పట్టించుకోలేదు. క్లోరినేషన్ జరిపేముందు నీటి క్వాలిటీని పరిశీలించాలి. వీటన్నింటికీ రికార్డులు ఉంటాయి. కానీ పరిశీలించాల్సిన అధికారే పట్టించుకోపోవడంతో రొటీన్‌గా మారిపోయాయి.
హెల్త్ విభాగంపై కుదరని నమ్మకం
వాటర్ ట్యాంకులన్నీ క్లీన్ చేశామని, నీటి సరఫరా పునరుద్ధరించామని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నా ఇంకా కుళాయిల నుంచి వచ్చిన నీటిని తాగడానికి సిక్కోలు ప్రజలు సిద్ధంగా లేరంటే.. యంత్రాంగం మీద ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ పైప్‌లైన్లను సరిచేసి, కాలువలను శుభ్రం చేసి, నీటి సరఫరాను పునరుద్ధరించినా ప్రజలకు నమ్మకం కలగకపోవడానికి కారణం ఇంకా డయేరియా కేసులు వెలుగుచూస్తుండటమే. సోమవారానికి కూడా అనేక ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. చాలామంది బయటి నుంచి నీరు కొనుక్కుంటున్నారు. కానీ మున్సిపల్ ట్యాప్ ముఖం మాత్రం చూడటంలేదు. మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్ అధికారుల కొరత ఉంది. దాన్ని అధిగమించడానికి ఎమ్మెల్యే స్వయంగా మున్సిపల్ మంత్రితో ఆమధ్య మాట్లాడారు. కానీ హెల్త్ విభాగంలో పూర్తిస్థాయి సిబ్బంది ఉన్నారు. అయినా శ్రీకాకుళంలో శానిటేషన్ సరిగా లేదన్న ఫిర్యాదులకు కొదవ లేదు. అందరి నోటా హెల్తాఫీసర్ చేతకానితనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఆయన అవినీతి కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. శానిటేషన్ సెక్రటరీలతో బిర్యానీలు తెప్పించుకోడంపై ఉన్న శ్రద్ధ వార్డు స్థాయిలో పారిశుధ్యం మీద వాడితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిపిన సమీక్షలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెల్త్ విభాగం మీద శివాలెత్తినా పరిస్థితిలో మార్పు వస్తుందనుకోవడం భ్రమ.






Comments