top of page

నిజాయితీకి కులం కాటు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Mar 3
  • 2 min read
  • ఉత్త పుణ్యానికి కొత్త కమిషనర్ సస్పెన్షన్

  • అగ్గిమీద గుగ్గిలమైన ఆయన సామాజికవర్గం

  • దాన్ని డైవర్ట్ చేయడానికి మరో అధికారిపై వేటు

  • సస్పెండైన ఇద్దరికీ నిజాయితీపరులుగా పేరు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు సస్పెన్షన్‌పై ఆయన సామాజికవర్గం నుంచి ఎదురైన తీవ్ర వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న జగన్మోహనరావును సస్పెండ్ చేశారా? అంటే.. ఔననే ఉద్యోగవర్గాలు అంటున్నాయి. వెలమ సామాజికవర్గానికి చెందిన జగన్మోహనరావును సస్పెండ్ చేయడం ద్వారా తమకు ఎవరైనా ఒకటేనన్న సంకేతాలు పంపడానికే వ్యవహారం సద్దుమణిగిన తర్వాత కూడా ఆయనపై వేటు వేశారని చెబుతున్నారు. జరిగిన పరిణామాలు చూస్తే ఈ వాదనలో కూడా వాస్తవం ఉందనిపించక మానదు. దీని వెనుక కులం కోణం, రాజకీయ అవసరాలు ఉండొచ్చేమో గానీ సస్పెండైన ఇద్దరు అధికారులూ నిజాయితీపరులే కావడం ఇప్ప్పుడు చర్చకు దారి తీస్తున్నది. శానిటేషన్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగిస్తేనే యూనియన్ మీటింగ్ పెట్టుకొని సహాయ నిరాకరణ చేస్తామని అల్టిమేటం ఇచ్చిన క్షేత్రస్థాయి ఉద్యోగులు ఇప్ప్పుడు ఇద్దరు సిన్సియర్ ఆఫీసర్లను సస్పెండ్ చేయడాన్ని కులం కోణంలో మాత్రమే చూడటంలేదు. ఎందుకంటే.. డయేరియా వ్యవహారంతో ఇద్దరికీ సంబంధం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

ఆ వర్గం గరం గరం

కమిషనర్‌గా సస్పెండ్ కావడానికి 14 రోజుల ముందే బాధ్యతలు స్వీకరించిన హనుమంతు కూర్మారావు కూడా నిజాయితీపరుడు కావడం, సిన్సియర్‌గా పని చేసే అధికారిగా గుర్తింపు తెచ్చుకోవడం ఆయనకు ఎలా శాపంగా మారిందో.. జగన్మోహన్‌రావు పరిస్థితి కూడా అలాగే మారింది. దీనికితోడు ప్రజల సొమ్మును టన్నుల లెక్కన మేసేస్తున్న అధికారులు సురక్షితంగా ఉండటం కూడా జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. హనుమంతు కూర్మారావును సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల నుంచి ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. మరో జిల్లాలో అయితే సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు కూడా జరిగి ఉండేవి. కానీ ఇక్కడ అధికార, ప్రతిపక్షాలు ఒకేలా ఆలోచిస్తున్నాయి. కూర్మారావు సస్పెండైన తర్వాత స్థానికంగా ఓ హÃటల్‌లో కాళింగ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులంతా సమావేశమై తమ కులాన్ని కావాలనే అణగదొక్కేస్తున్నారని ఇప్పటికే జిల్లాలో అధికారుల స్థాయిలో తమవారు కనిపించకుండాపోయారని, ఇప్ప్పుడు ఏరికోరి తెచ్చుకున్న కూర్మారావుకు కూడా పొగబెట్టేశారంటూ వీరంతా ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా సగటు కాళింగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. ఇప్పటికే జిల్లాలో కాళింగులకు రాజకీయంగా అన్యాయం జరిగిందన్న భావనతో ఎప్పటికప్ప్పుడు వీరంతా పిక్నిక్ రూపంలోనో, సంఘ సమావేశం రూపంలోనో తమ అసంతప్తిని బయటపెడుతున్నారు.

వాడు కాకపోతే వీడు.. వీడు కాకపోతే వాడు

అందుకే కూర్మారావు సస్పెన్షన్ వివాదం నుంచి కాళింగులను డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం వేసిన ఎత్తుకు జగన్మోహన్‌రావు బలైపోయారు. వాటర్‌వర్క్స్ విభాగంలో లీకేజీని అరికట్టకపోవడం వల్ల నీరు కలుషితం కాగా.. దానికి కారణమైన ఆ ఏరియా ఫిట్టర్‌ను సస్పెండ్ చేయాలని భావించారు. ఆయన కూడా కాళింగ సామాజికవర్గానికే చెందిన ఉద్యోగి కావడంతో అగ్నిలో ఆజ్యం పోసినట్లు అవుతుందని భావించి ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు. తర్వాత వాటర్‌వర్క్స్ ఏఈపై వేటు వేయాలని చూశారు. ఆయన బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, కొద్ది రోజుల ముందు నుంచి సెలవులో ఉండటం వల్ల అదీ కుదరలేదు. ఇప్ప్పుడు ఉన్న ఫళంగా కాళింగులను శాంతింపజేయాలంటే వారు తరచూ ఉచ్ఛరిస్తున్న వెలమ సామాజికవర్గం అధికారిని సస్పెండ్ చేయాలి. అప్ప్పుడు కార్పొరేషన్ పరిధిలో ఇంజినీరింగ్ విభాగంలో వెలమ అధికారి ఎవరున్నారా అని చూస్తే జగన్మోహన్‌రావు కనిపించారు. దీంతో పుటుక్కున ఆయన్ను సస్పెండ్ చేసేశారు. వాస్తవానికి ఫిట్టర్ లెవల్‌లో పోయే పనికి ఇద్దరు నిజాయితీ గల అధికారులు బలైపోయారు. అసలు ఇద్దరికీ ఈ కేసుతో సంబంధం లేదు. తన వాటర్ బాటిల్ తానే తెచ్చుకునే డీఈఈ, తన ఇంటికి వెళ్లడానికి కూడా కార్యాలయం వాహనం వాడని కూర్మారావు ఈ కుల రాజకీయాలకు బలైపోయారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page