ఇందిర వెనుకడుగు..పాక్ అణు బలుపు!
- DV RAMANA

- 16 hours ago
- 3 min read
కహూతా కేంద్రంలో రహస్య అణు కార్యక్రమాలు
దానిపై సంయుక్త దాడికి ఇజ్రాయెల్ ప్రతిపాదన
కానీ దానికి అనుమతి ఇవ్వని నాటి ప్రధానమంత్రి
ఐరాసలోనే నాటి పరిణామాల ప్రస్తావనతో తాజా చర్చ

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
‘మాది అణ్వాయుధ దేశం. అవసరమైతే అణుయుద్ధం చేస్తాం’ అనే మాట పాకిస్తాన్ నుంచి తరచూ వినిపిస్తుంటుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్‌లో తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత పాక్ పాలకులు అణు బూచి చూపించి భారత్‌ను బెదిరించడం పరిపాటిగా మారింది. కానీ అణు దాడికి పాల్పడేంత దుస్సాహసం మాత్రం ఆ దేశం చేయదన్నది సుస్పష్టం. అలా చేస్తే.. దాని తర్వాత విపరిణమాలు ఏ స్థాయిలో ఉంటాయో పాక్ పాలకులకు తెలుసు. ఆ సంగతెలా ఉన్నా.. అసలు పాకిస్తాన్ అణుశక్తి సంతరించుకోగలిగేలా చేసిన పాపం ఒక విధంగా మనదేశానిదే. మరీ ముఖ్యంగా ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ కారణమని కొద్దిరోజులుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాక్ అణు సామర్థాన్ని పొందకుండా ఆదిలోనే అడ్డుకునే మహత్తర అవకాశం ఇజ్రాయెల్ ద్వారా లభించినా ఇందిర ఆ ప్రత్యేక ఆపరేషన్‌కు అనుమతి ఇవ్వలేదట! ఫలితంగానే పాకిస్తాన్ కహుతా అణు కేంద్రం ఏర్పాటు చేసుకుని, అణుబాంబును అభివృద్ధి చేయగలిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీటిని కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఇవేవీ ప్రతిపక్షాలు చేసిన రాజకీయ ఆరోపణలు కావు. ఆమెరికా నిఘా సంస్థ సీఐఏ మాజీ అధికారి రిచర్డ్ బార్లో ఇటీవల ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఈ విషయం చెప్పారు. అలాగే అడ్రియన్ లెవీ, కేథరిన్ స్కాట్ క్లర్క్ రాసిన ‘డిసెప్షన్’ అనే పుస్తకంలో పేర్కొనడంతోపాటు ఏకంగా ఇజ్రాయెల్ రాయబారే ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ విషయం ప్రస్తావించడంతో 1980 నాటి అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వారు పేర్కొన్న అంశాల ప్రకారం..
అణుశక్తిపై పాక్ ఆసక్తి
బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో భారత్‌తో జరిగిన యుద్ధంలో ఓటమిపాలైన పాకిస్తాన్ తన భద్రత కోసం అణ్వాయుధాలపై దృష్టి సారించింది. మరోవైపు 1974లో భారత్ ‘స్మైలింగ్ బుద్ధ’ పేరుతో పోక్రాన్‌లో తొలి అణుపరీక్షను విజయవంతంగా నిర్వహించడం పాక్‌ను మరింత తొందరపెట్టింది. అణుబాంబును తయారుచేయాలన్న కాంక్షను బలవత్తరం చేసింది. అప్పటినుంచి పాక్ పాలకులు అణు కార్యక్రమాలు ముమ్మరం చేశారు. దీన్ని గుర్తించిన ఇజ్రాయెల్ తన మిత్రదేశమైన భారత్ ముందు ఒక కీలక ప్రతిపాదన పెట్టింది. ఇరుదేశాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించిన పాక్ అణుశక్తి స్థావరమైన కహుతా కేంద్రంపై దాడి చేసి.. దాన్ని పూర్తగా ధ్వంసం చేయాలన్నది దాని సారాంశం. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. అదే సమయంలో పాక్ అణు కార్యక్రమం గురించి తెలిసినా అమెరికా మౌనంగా ఉండిపోవడం, ఆఫ్గనిస్థాన్ యుద్ధం వంటి పరిణామాలు పాక్‌కు వరంగా పరిణమించాయి. విదేశీ అణు పరిశోధనల్లో పాల్గొన్న అనుభవమున్న తమ దేశానికి చెందిన ఏక్యూ ఖాన్ అనే అణు శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అణు టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే కాకుండా ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలకు విక్రయించే స్థాయికి ఎదిగింది. కాగా 1998లో భారత్ అదే పోక్రాన్‌లో రెండోసారి అణుపరీక్షలు జరిపిన రెండు వారాల వ్యవధిలోనే పాక్ తన తొలి అణుపరీక్ష జరిపి తాను కూడా అణ్వాయుధం చేయగలిగానని ప్రపంచానికి తొలిసారి సవాల్ విసిరింది. అప్పటినుంచీ చీటికీమాటికీ అణుదాడి చేస్తానని భారత్‌ను హెచ్చరిస్తోంది.
ఐరాసాలోనూ ఇజ్రాయెల్ ప్రస్తావన
ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మాట్లాడిన పాకిస్తాన్‌కు ఇజ్రాయెల్ చెప్పిన సమాధానం కూడా 1980ల కథను మరోసారి గుర్తుకు తెచ్చింది. అసలు అప్పుడు ఏం జరిగిందంటే.. భారత్‌కు చెందిన రా(ఆర్‌ఏడబ్ల్యూ), ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ నిఘా సంస్థలు కలిసి పాక్ అణు స్థావరంపై బాంబులు వేసి దాని కథ ముగిద్దామని ఆనాడు ఇజ్రాయెల్ ఆఫర్ చేసింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మొదట ఈ ఆఫర్‌కు సుముఖంగా కనిపించినా.. చివరి క్షణంలో రహస్య ఆపరేషన్‌కు అనుమతి ఇవ్వలేదని ఇజ్రాయెల్ ఐరాసలో ప్రస్తావించిన ఈ అంశాలనే నాలుగు దశాబ్దాల క్రితం ‘డిసెప్షన్’ అనే పుస్తకంలో దాని రచయితలు పొందుపర్చారు. 1980ల ప్రారంభంలో పాక్ అణు కార్యక్రమాన్ని ముప్పుగా పరిగణించిన ఇజ్రాయెల్ శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి పాక్‌స్తాన్‌పై ఉమ్మడి దాడి చేద్దామని భారత్‌కు ప్రతిపాదించింది. ఇజ్రాయెల్ నుంచి వచ్చే ఎఫ్-16, ఎఫ్-15 యుద్ధ విమానాలు మన దేశంలోని జామ్‌నగర్ వైమానిక స్థావరంలో ఇంధనం నింపుకొన్న తర్వాత అక్కడి నుంచే పాక్‌లోని కహుతా అణు కేంద్రంపై బాంబు దాడి చేసి నాశనం చేయాలనేది ప్లాన్. ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ విమానాలకు భారత జాగ్వార్ విమానాలు తోడుగా ఉండి సహాయం చేయాలనేది ప్లాన్. 1981లో ఇరాక్‌లోని ఒసిరాక్ అణు రియాక్టర్‌పై దాడి చేసిన విధంగానే పాకిస్తాన్‌పై కూడా దాడి చేయాలని ఇజ్రాయెల్ కోరుకుంది. కానీ చివరి క్షణాల్లో ఇందిర వెనక్కి తగ్గడం.. ఆ తర్వాత 1984లో ఆమె హత్యకు గురవ్వడంతో ఆ ప్రతిపాదన తెరమరుగైపోయింది. పాక్‌పై ఇజ్రాయెల్ విమర్శలు కొత్త కాదు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుండటాన్ని తప్పుపట్టడం కూడా మొదటిసారి కాదు. పాక్ నియంత జియా ఉల్ హక్ నాయకత్వంలో ఆ దేశం అణు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ అనేకసార్లు హెచ్చరించింది. 1979లో దీని గురించి బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్‌కు కూడా ఒక లేఖ రాసింది.
ఎందుకు వెనుకడుగు?
అణుదాడి ప్రణాళిక అమలు చేయకుండా ఇందిరాగాంధీ వెనక్కి తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. కహుతాపై దాడి చేస్తే దానికి ప్రతిగా పాకిస్తాన్ ముంబైలోని బాబా అణు పరిశోధన కేంద్రం (బీఏఆర్‌సీ) వంటి భారతీయ అణు కేంద్రాలపై దాడులకు తెగబడవచ్చని, అదే జరిగితే భారీ ప్రాణనష్టం వాటిల్లుతుందని ఇందిర భావించారు. ఆ సమయంలో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆఫ్గనిస్తాన్‌లో సీఐఏ నిర్వహించిన ఆపరేషన్లలో పాకిస్తాన్ కీలక భాగస్వామిగా ఉంది. అందువల్ల రోనాల్డ్ రీగన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం పాక్‌పై ఏ సైనిక చర్యనూ అంగీకరించేది కాదు. అమెరికా మద్దతు లేకుండా దాడికి దిగితే అది భారత్-అమెరికా సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని భావించినందునే ఇందిరా గాంధీ ఇజ్రాయెల్ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిసింది. అయితే రిచర్డ్ బార్లో వంటి సీఐఏ మాజీ అధికారుల దృష్టిలో ఇందిరా గాంధీ నిర్ణయం ‘రాజకీయంగా సరైందే కావచ్చు గానీ.. వ్యూహాత్మక వైఫల్యమేనని’ అంటున్నారు. కహుతాపై నాడు దాడి చేసి ఉంటే పాక్ అణు కార్యక్రమాలు ఆలస్యమయ్యేవి. భారత్‌తో ఘర్షణలు, ఉగ్రవాదులను ఎగదోయడం వంటివి తగ్గేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.










Comments