ఇది సంధి పొసగు మార్గమా?!
- DV RAMANA

- 6 days ago
- 2 min read

తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది.. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన సీజ్‌ఫైర్(కాల్పుల విరమణ) పరిస్థితి. ఇరాన్ అందజేసిన పది అంశాలపై ఇరువర్గాలు చర్చించి తుది ఒప్పందానికి వచ్చేందుకు వీలుగా రెండువారాలపాటు కాల్పుల విరమణ పాటించనున్నట్లు అన్ని పక్షాలు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే కాల్పుల విరమణకు తూట్లు పొడిచేలా దాదాపు అన్ని పక్షాలు వ్యవహరిస్తుండటంతో ఈ తాత్కాలిక శాంతి తుపాను ముందు ప్రశాంతతేనా అన్న అనుమానాలు, ఆందోళనలు కలుగుతున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణను తమ విజయంగా ప్రకటించుకోవడానికి అమెరికా, ఇరాన్ పోటీ పడుతుంటే.. మరోవైపు సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ లెబనాన్‌పై కాల్పులకు తెగబడటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు ట్రంప్ కూడా కామ్‌గా ఉండకుండా ఇరాన్‌ను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. తాత్కాలికంగానైనా యుద్ధం ఆగిందని ప్రపంచం ఊపిరి పీల్చుకునేలోపే పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ దాన్ని ఉల్లంఘించి లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలపై విరుచుకుపడి తీవ్ర విధ్వంసం సష్టించింది. సుమారు వందమంది వరకు మరణించారు. యుద్ధం పరిసమాప్తికి ఇరాన్ ప్రతిపాదించిన పది అంశాల్లో లెబనాన్ విషయం లేదని సాకు చూపిస్తూ తన చర్యలను ఇజ్రాయెల్ సమర్థించుకుంటున్నది. అయితే లెబనాన్ సహా ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న ఏ భూభూగంపైనా దాడులు చేయరాదని ఇరాన్ ఇచ్చిన పది అంశాల్లో స్పష్టంగా ఉంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించడాన్ని తప్పుపడుతూ.. అలా అయితే హర్మూజ్ జలసంధిలో రవాణాపై మళ్లీ ఆంక్షల విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇదే అంశం పెద్ద రాజకీయ సమస్యగా మారింది. శాంతి చర్చల సమయంలో ఇలాంటి సమస్యలే పరిస్థితిని సంక్లిష్టం చేస్తాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. దేశ భద్రత కోసం ఈ చర్యలు తప్పనిసరి అని, ఇరాన్‌తో అమెరికా ఒప్పందానికి తమ దాడులకు సంబంధం లేదంటున్నారు. ఇజ్రాయెల్ ఈ దాడుల ద్వారా ఇరాన్‌ను రెచ్చగొట్టి శాంతి ప్రక్రియను దెబ్బతీయాలని చూస్తున్నదని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అండతో పశ్చిమాసియాలో ఆధిపత్యం పెంచుకోవాలన్నది ఇజ్రాయెల్ వ్యూహమని, ఇప్పుడు యుద్ధం ఆగిపోతే అది నెరవేరదన్న భావంతోనే ఏదోవిధంగా సీజ్‌ఫైర్ ఒప్పందానికి తూట్లు పొడవడమే దాని లక్ష్యమని అంటున్నారు. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ గట్టిగా తిప్పికొట్టింది. లెబనాన్‌పై దాడులను తీవ్రంగా ఖండించింది. శాంతి చర్చలను ఉద్దేశపూర్వకంగా భంగం చేస్తున్నారని ఆరోపించింది. ఇదే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ట్వీట్లు మరింత కలవరం రేపుతున్నాయి. శాంతి చర్చలకు దిగివచ్చేలా ఇరాన్‌ను లొంగదీసుకున్నామని ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ట్రత్ సోషల్‌లో పెట్టిన ఒక పోస్టులో ప్రకటించుకున్నారు. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో తమదే విజయమని కూడా చాటుకున్నారు. ఇరాన్ శాంతికి సిద్ధమైందని, హర్మూజ్ జలసంధిలో రవాణాను పునరుద్ధరించడంలో అమెరికా పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో భారీ ఆర్థిక లాభాలు సాధ్యమని సంకేతాలు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా మరో ట్వీట్‌లో మరింత రెచ్చిపోయారు. ఈ నెల పదో తేదీన జరిగే చర్చల్లో ఇరాన్ కచ్చితంగా ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే ఆ దేశాన్ని నాశనం చేసి తీరుతామని హెచ్చరించారు. తమ దేశానికి చెందిన యుద్ధనౌకలు, సైనిక బలగాలు, యుద్ధ విమానాలు ఇప్పటికీ ఇరాన్ సరిహద్దుల చుట్టూ మోహరించి ఉన్నాయని, తుది ఒప్పందం కుదిరేవరకు అవి అక్కడే ఉంటాయని, ఇరాన్ ఏమాత్రం తోక ఝాడించినా ఆ దేశంపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ హెచ్చరికలు, ప్రకటనల ద్వారా ఇరాన్‌ను లొంగిపోయిన దేశంగా చూపించాలని ట్రంప్ ఆరాటపడుతున్నట్లుంది. మరోవైపు హర్మూజ్ జలసంధిపై పెత్తనం చెలాయించాలని, నౌకల రవాణాపై విధించే టోల్‌ఫీజులో వాటా పొందాలని ఆయన తహతహలాడుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ మూడు అంశాలు ఇరాన్‌ను అసహనానికి గురిచేయవచ్చు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం రవాణా జరిగే హర్మూజ్ జలసంధి పై ప్రస్తుతం భౌగోళికంగా ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ జలసంధి గుండా ప్రయాణానికి రుసుము వసూలు చేయాలని ఇరాన్ ఇప్పటికే నిర్ణయించి, ఆచరణలో పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తాత్కాలిక సంధి ద్వారా అది అధికారికమైనట్లు తెలిసింది. దాంతో హర్మూజ్ గుండా రవాణా అయ్యే ప్రతి బ్యారెల్ ముడిచమురుకు ఒక డాలర్ చొప్పున టోల్ ఫీజు వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. తుది ఒప్పందం ద్వారా ఈ ఆదాయంలో వాటా కోసమే అమెరికా అర్రులు చాస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇరాన్ ప్రతిపాదించిన పది పాయింట్లలో మరో అంశంపైనా రెండు దేశాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. తమ దేశంలో అణు కార్యక్రమాలు, పరిశోధనలు కొనసాగించేందుకు అంగీకరించాలన్నది ఇరాన్ షరతుల్లో కీలకమైనది. కానీ ట్రంప్ మాత్రం దానికి విరుద్ధంగా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకుంటామని అంటున్నారు. శాంతి చర్చలు ఇది ప్రధాన ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. తాత్కాలిక విరామ సమయంలోనే మూడు దేశాలు ఇన్ని వైరుధ్యాలు, భిన్న వాదనలు, రెచ్చగొట్టే ధోరణులు ప్రదర్శిస్తుంటే.. అవి తుది శాంతి చర్చలపై తీవ్ర ప్రభావం చూపించకమానవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నారు. మొత్తంగా చూసుకుంటే యుద్ధం ఆగినట్లే కనిపించినా పశ్చిమాసియా పరిస్థితి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఆ సెగను ప్రపంచమూ భరించక తప్పడంలేదు.






Comments