top of page

ఇరుపక్షాల వైఖరులు అసమంజసమే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 2 min read

ప్రభుత్వాలు మారినప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీల సిద్ధాంతాలు, లక్ష్యాలకు అనుగుణంగా వాటి ప్రాథమ్యాలు కూడా మారిపోతుంటాయి. అందుకోసం తమ ఆలోచనలను అర్థం చేసుకుని, కార్యాచరణతో అల్లుకుపోగల సివిల్ సర్వీసుల అధికారులు ప్రభుత్వాలు ఎంచుకోవడం కూడా సర్వసాధారణం. అయితే ఎవరి సిద్ధాంతాలు, లక్ష్యాలు ఏవైనా.. పరిపాలనలో ఎన్ని మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చినా వాటి అంతిమ లక్ష్యం మాత్రం ప్రజాశ్రేయస్సే. తమను ఎన్నుకున్న ప్రజలకు మేలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయడానికే ప్రజాప్రభుత్వాలు, వాటి నిర్ణయాలను అమలుచేసే అధికార వ్యవస్థలు పనిచేయాలి. కానీ గత కొన్నేళ్లుగా పాలకుల ప్రాథమ్యాలు కొంత గాడి తప్పుతున్నాయి. సీనియారిటీ, నిజాయితీ, నిబద్ధత వంటి కొలమానాలు పక్కకు వెళ్లిపోయి.. తమ అడుగులకు మడుగులొత్తే వారినే పాలకపార్టీలు ఎంచుకుంటున్నాయి. గత ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో ఉన్నవారిని తప్పించి ఏమాత్రం ప్రాధాన్యత లేని లూప్‌లైన్ పోస్టుల్లోకి నెట్టేయడం, పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగులో పెట్టడం వంటి చర్యలకు తరచూ ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిభావంతులైన అధికారుల సేవలు కూడా ప్రజలకు అందకుండా నిరీక్షణ(వెయిటింగ్)లో ఉండిపోతున్నాయి. సక్రమంగా పనిచేయని వారిని, ప్రభుత్వ ýక్ష్యాలను చేరుకోలేనివారిని కీలక పోస్టుల నుంచి మార్చడంలో తప్పు లేదు గానీ.. రాజకీయ కారణాలు, ఇతరత్రా ఇంకేవో కారణాలతో మంచి అధికారులను దూరం పెట్టడం ప్రభుత్వానికి, వ్యవస్థలకు, ప్రజలకే నష్టం. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పుడు ఈ అంశమే మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు రాష్ట్రాల్లో డైనమిక్ అధికారులుగా పేరొందిన ఇద్దరిని కారణాలు ఏమైనా గానీ పోస్టింగు లేకుండా వెయిటింగ్‌లో పెట్టడంపై విస్తృత చర్చ జరుగుతోంది. వారిలో ఒకరు ఏపీ అధికారి కాటా ఆమ్రపాలి కాగా, మరొకరు తెలంగాణ బ్యూరోక్రాట్ అయిన స్మితా సబర్వాల్. మహిళా అధికారులైన వీరిద్దరూ డైనమిక్ ఆఫీసర్లుగా, సమస్యల పరిష్కారంలో, ఏ శాఖలో ఉన్నా ఆ శాఖను సంస్కరించడంలో దిట్టలుగా పేరొందినవారే. వీరిపై ఆరోపణలు కూడా తక్కువే. అయినా ఇద్దరినీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పక్కన పెట్టడం సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందంతోనే కాకుండా పనితీరుతో మంచి మార్కులు కొట్టేసే ఈ అధికారులు కార్యక్షేత్రాలకు దూరంగా ఉండిపోతున్నారు. ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కాటా ఆమ్రపాలి అచ్చ తెలుగు అధికారిణి. ప్రతిభతో స్వల్పకాలంలోనే ఉన్నత పోస్టులు అందుకున్నారు. తెలంగాణలో వరంగల్, అర్బన్ జిల్లాల కలెక్టర్‌గా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఆమ్రపాలిని ఏపీకి కేటాయించారు. అయితే తెలంగాణలోనే పనిచేయాలన్న లక్ష్యంతో పలు రకాలుగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఏపీ క్యాడర్‌లోనే ఉండిపోయారు. టూరిజం కార్పొరేషన్ ఎండీగా కొన్నాళ్ల నుంచి పనిచేస్తున్న ఆమె తాజా బదిలీల్లో పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది. ఫలితంగా ఆమె సేవలు వినియోగించుకునే పరిస్థితి ఇప్పట్లో లేకుండాపోయింది. అయితే తెలంగాణకు వెళ్లిపోవాలన్న తన లక్ష్యం నెరవేరనందున తరచూ సెలవులు పెడుతున్నందునే ఆమెను లూప్‌లైనులో పెట్టారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణకు చెందిన క్రేజీ అధికారిణి కూడా దాదాపు ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఆమే స్మితా సబర్వాల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో పనిచేసిన ఆమె తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర కేడర్‌కు కేటాయింపు పొందారు. దాంతోపాటు టీఆరఎస్(బీఆరఎస్) ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పెషల్ సెక్రటరీగా ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో కీలకపాత్ర పోషించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, యాదాద్రి అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులను స్వయంగా పర్యవేక్షించారు. మిషన్ భగీరథ అమల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఒకదశలో సీఎం తర్వాత ఆమెనే అన్నంతగా స్మితా సబర్వాల్ హవా కొనసాగింది. అయితే 2023 ఎన్నికల్లో బీఆరఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్మిత ప్రాబల్యం మసకబారిపోయింది. ప్రాధాన్యం లేని పోస్టులకు పరిమితమయ్యారు. దాంతో సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా ప్రభుత్వ విధానాలపై పోస్టులు పెట్టారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఈమె వ్యవహార శైలిపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించిన ఫలితంగా ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే లూప్‌లైనులో ఉండిపోవడం కంటే ఖాళీగా ఉండటమే మేలన్న ఉద్దేశంతో స్మితా సబర్వాల్ ఈమధ్యకాలంలో ఎక్కువగా సెలవుల్లోనే ఉంటున్నారు. ఇక్కడ ఇద్దరు అధికారుల వైఖరుల్లోనూ వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. తనకు ఏపీలో పనిచేయడం ఇష్టం లేకపోయినా దాన్ని ఏమాత్రం తన పనితీరుపై చూపకుండా ఆమ్రపాలి ఏ శాఖలో ఉన్నా నిబద్ధతతో పని చేశారు. టూరిజం శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ స్మితా సబర్వాల్ మాత్రం తన ప్రాధాన్యత తగ్గిపోగానే.. తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో శ్రద్ధ తగ్గించారు. పని చేయడం కంటే సోషల్ మీడియా పోస్టులకు, సెలవులకు ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవస్థలో అన్ని శాఖలను ఒకవిధంగా చూడాలి. కొన్ని నేరుగా ప్రజలతో సంబంధం కలిగి ఉంటాయి. మరికొన్ని పరోక్ష సంబంధాలు కలిగి ఉంటాయి. కానీ ప్రభుత్వాలు, అధికారులు కొన్నింటిని ప్రధానమైనవిగా, మరికొన్నింటిని అప్రధానమైనవిగా పరిగణిస్తూ ఆ మేరకే పని చేస్తుంటారు. కానీ చిన్నవి, అప్రధానమనుకున్న శాఖలు లేకుండా వ్యవస్థను నడపలేమన్న విషయాన్ని మాత్రం గమనంలోకి తీసుకోరు. ఈ కురచ ఆలోచనలను దూరం పెడితే ప్రభుత్వానికి, అధికారులకు మంచి పేరు వస్తుంది. ప్రజలకు మేలు జరుగుతుంది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page