top of page

ఇసై జ్ఞానీ.. మీకు అర్థమవుతోందా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 3 min read

సినీ సంగీత ప్రపంచంలో ఒక స్రష్ట(ఇసై జ్ఞాని)గా వాసికెక్కిన ఇళయరాజా గురించి గత కొంతకాలంగా వ్యతిరేక ప్రచారం జరుగుతున్నది. తను స్వరపర్చిన పాటలను బయట ఎక్కడ పాడినా తనకు రాయల్టీ(పారితోషికం) ఇవ్వాల్సిందేనంటూ గాయకులను, సంస్థలను హెచ్చరిస్తూ.. వారిని కోర్టులకు లాగుతున్నారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ మ్యూజిక్ కంపెనీ దాఖలు చేసిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఇళయరాజాకే వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం ఈ ప్రచారాన్ని మరోమలుపు తిప్పింది. తాము హక్కుదారులుగా ఉన్న సినిమాల పాటలకు ఇళయరాజా అక్రమంగా రాయల్టీ అందుకోవడానికి, హక్కులు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఇళయరాజా గతంలో అనేకమందిపై ఇవే తరహా కేసులు వేయడం విశేషం. వీటన్నింటిని విన్న తర్వాత సినిమా పాటలపై రాయల్టీ హక్కులు ఎవరికి ఉంటాయి? అన్న ప్రశ్న తలెత్తకమానదు. దీనికి చట్టపరంగా అయితే ఒక రకంగానూ, నైతికంగా ఆలోచిస్తే మరో రకంగానూ సమాధానం చెప్పాల్సి వస్తుంది. దానికి ముందు ఒక వస్తువు, సినిమా, ఒక రచనపై హక్కులు డబ్బు పెట్టుబడి పెట్టి తయారు చేయించినవారికి దక్కుతుందా లేక తమ సజనను, శ్రమను పెట్టుబడిగా పెట్టి రూపొందించివారికి చెందుతాయా? అన్న ధర్మసందేహం చుట్టూనే ఈ వివాదం తిరుగుతోంది. పుస్తక ప్రచురణ రంగంలో కాపీ రైట్స్ రచయిత వద్దే ఉంటాయి. ఎందుకంటే అది స్వయం సజన. కాల్పనిక సృష్టి. అదే పారిశ్రామిక ఉత్పత్తులైతే పరిశ్రమ యజమానికే సర్వహక్కులు ఉంటాయి. జీతాలు తీసుకుంటూ ఉత్పత్తులు రూపొందించడమే కార్మికులు, ఉద్యోగుల పని. ఇక సినిమా రంగానికి వస్తే స్థూలంగా చూస్తే.. సినిమా పూర్తి హక్కులు కోట్లు ఖర్చుపెట్టి, కష్టనష్టాలకోర్చి నిర్మించిన నిర్మాతకే దఖలు పడతాయి. అదేవిధంగా సినిమాల్లోని పాటల కాపీరైట్ హక్కులు కూడా సదరు నిర్మాత లేదా వాటి మార్కెటింగ్ హక్కులు పొందిన మ్యూజిక్ కంపెనీ వద్దే ఉంటాయి. కాపీరైట్ చట్టం`1957 ప్రకారం సృజనాత్మక శ్రమ ఇద్దరు వ్యక్తులు లేదా సంస్థల మధ్య కుదిరే ఒక కాంట్రాక్టు ద్వారా ఆర్థిక ఆస్తిగా మారుతుంది. సంగీతం లేదా సాహిత్యాన్ని సష్టించినవారు ఒకసారి దానికి రెమ్యూనరేషన్ తీసుకున్న తర్వాత దాని హక్కులు పెట్టుబడిదారుడికి బదిలీ అవుతాయని చట్టం చెబుతున్నది. అయితే 2012లో ఈ చట్టంలో సవరణలు జరిగాయి. వీటి ప్రకారం.. సినిమా కోసం సృష్టించిన సంగీత లేదా సాహిత్య కృతికి నిర్మాత నుంచి పారితోషికం తీసుకున్నా కూడా రచయిత లేదా స్వరకర్త దానిపై తమ రాయల్టీ హక్కును పూర్తిగా వదులుకున్నట్లు కాదు. సినిమా హక్కులు నిర్మాత వద్ద ఉన్నా, బయట ప్రపంచంలో దాని రింగ్‌టోన్స్, స్ట్రీమింగ్, పబ్లిక్ పెర్ఫార్మెన్స్, యూట్యూబ్, స్పాటిఫై, రేడియో, స్టేజ్ షోల్లో ఆ పాట లేదా సాహిత్యాన్ని వినియోగిస్తే సంబంధిత రచయిత లేదా స్వరకర్తకు రాయల్టీ ఇవ్వాలని ఈ సవరణ స్పష్టం చేస్తున్నది. అయితే ఈ చట్టానికి ముందు కాలంలోని పాటలకు తామెందుకు రాయల్టీ చెల్లించాలని నిర్మాతలు, మ్యూజిక్ కంపెనీలవారు వాదిస్తున్నారు. పాత నిబంధనల ప్రకారం తమకే పూర్తి హక్కులు ఉన్నాయంటూ వారు ఆధారాలు చూపిస్తున్నారు. ఇది చట్టపరమైన కోణం. కానీ నైతికంగా ఈ సమస్యను పరిశీలిస్తే మరో కోణం కనిపిస్తుంది. సంగీతం లేదా రచన అనేవి మనిషి మేధస్సుకు సంబంధించినవి. వాటిని సజనతో సష్టిస్తారు. మస్తిష్క మథనం నుంచి పుట్టే ఈ సంగీత, సాహిత్యాలకు కేవలం కొంత పారితోషికంతో వెల కట్టగలమా.. అలా వెల కట్టడం న్యాయమా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. పుస్తకాలు రాసే రచయితలకు ఇదే కోణంలో రాయల్టీలు చెల్లించే విధానం ఇప్పటికే అమల్లో ఉంది. అదేరీతి పాటలను సష్టించే స్వరకర్త (సంగీత దర్శకుడు)కు కూడా రాయల్టీ ఇవ్వాలన్న వాదన వినిపిస్తోంది. ఈ పద్ధతి చాలా పాశ్చాత్య దేశాల్లో ఉంది. మరి మనదేశంలో ఎందుకు వర్తింపజేయకూడదన్నది ఇళయరాజా వాదన. కాపీరైట్ చట్ట సవరణ ద్వారా సృజనాత్మక సృష్టికి రాయల్టీ వర్తింపజేసినప్పటికీ 2012కి ముందునాటి తమ సజనశీలతకు కూడా ఎందుకు వర్తించరన్నది ప్రస్తుత వివాదం. ఈ వాదన పూర్తిగా కొట్టివేయదగ్గది కాదు.. సానుకూలంగా పరిశీలించాల్సిన అంశమే. ఈ నేపథ్యంలోనే ఇళయరాజాపై కొంత దుష్ప్రచారం కూడా జరుగుతోంది. సంగీత జ్ఞానిగా గుర్తింపు పొందిన ఆయన వ్యక్తిపరంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నారని, లిటిగెంట్ అని ఆయన్ను విమర్శిస్తున్నారు. ఒక సినిమాలో ఇళయరాజా పాటల్లోని ఓ చిన్న పల్లవిని హమ్ చేసినా సరే సదరు నిర్మాతలను కోర్టుకు ఈడ్చిన ఉదంతాలు ఉన్నాయి. అంతెందుకు తనను పైకి తీసుకొచ్చిన గానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా వదలకుండా స్టేజ్ షోల్లో తన పాటలు పాడితే రాయల్టీ ఇవ్వాల్సిందేనంటూ కేసులు పెట్టారు. స్టూడియో యజమాని దయతో ఉండటానికి ఓ రూము ఇస్తే.. అది తనదేనంటూ కోర్టుకెక్కిన చరిత్ర ఇళయరాజాది. సరిగ్గా ఇదే వాదన ఇప్పుడు ఆయన్నే కోర్టు ద్వారా దెబ్బకొట్టింది. సరిగమ సంస్థ దాఖలు చేసిన కేసులో వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు 1976`2001 మధ్య ఇళయరాజా సంగీతం అందించిన 134 చిత్రాల పాటలను వాడుకోవద్దని మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. ఆ సినిమాల పాటల హక్కులను ఇళయారాజా కొన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు దఖలుపరిచారు. ఆ చర్య అనైతికం. ఎందుకంటే.. ఆ సినిమాల పాటలకు సంబంధించి శాశ్వత హక్కులను నిర్మాతలు సరిగమ ఆడియో సంస్థకు విక్రయించారు. వాళ్లు సొంతం చేసుకున్న రైట్స్‌ను వారి ప్రమేయం లేకుండా ఇళయరాజా వేరే వాళ్లకు అమ్మడం నేరమే కదా! హక్కులపై ఆయన పోరాటం సంగతెలా ఉన్నా.. ఈ చర్యే ఆయన నైతికతను దెబ్బతీసింది. ఏ చట్టం ఆధారంగా తన హక్కులపై పోరాటం చేస్తున్నారో.. అదే చట్టం ఆయన తప్పు చేయడాన్ని నిలదీసింది. ఆంక్షలు విధించింది. ఒక వ్యక్తి తనదైన రంగంలో అసాధారణ మేధస్సు, సజనాత్మకతను ప్రపంచానికి చాటవచ్చు. కానీ నడవడిక ఆదర్శంగా లేకపోతే ఆ సజనకు పొరలు కమ్మినట్లే!


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page