ఈ సాయంత్రం ‘తోడి’రాగానిదే
- Prasad Satyam
- Sep 11, 2025
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం కల్చరల్)
అణురేణు పరిపూర్ణమైనా రూపము.., మేలుకొనవే నీలమేఘ వర్ణుడా.., వాడల వాడల వెంట వసంతము..., నాకున్ చెప్పరే వలపు నలుపో తెలుపో..., నీవు దేవుడవు నేనొక జీవుడ..., కంటిమయ్య నీ చేతులు కన్నుల పండువగాను..., మత్స్య కూర్మ, వరాహ, మనుష్య, సింహ, వామనా ఇచ్చ రామా రామ రామ హితబుద్ధి కల్కి..., నీ లాస్యమొక్కటే నిలిచెనమ్మ జలధి..., కలిగెనిదే నాకు కైవల్యము..., ఓ పవనాత్మజా ఓ ఘనుడా... ఇటువంటి కీర్తనలతో ఈ సాయంత్రం ఆహుతులను మంత్రముగ్ధులను చేయడానికి వస్తున్నారు ప్రియాసిస్టర్స్. మాజీమంత్రులు ధర్మాన సోదరుల తల్లి ధర్మాన సావిత్రమ్మ 13వ వర్ధంతి సందర్భంగా కర్ణాటక సంగీత జోడీ షన్ముఖ ప్రియ, హరిప్రియ స్థానిక గ్రాండ్ కన్వెన్షన్‌లో జోడుగా థోడీ రాగాలు వినిపించనున్నారు. శ్రీకాకుళం రావడం ప్రియా సిస్టర్స్‌కు రెండోసారైనా ప్రతీ ఏడాది తన తల్లి స్మారకార్థం ధర్మాన నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు రావడం ఇదే మొదటిసారి. కర్ణాటక సంగీతంలో అనేక రాగాలున్నా ప్రియా సిస్టర్స్‌గా గుర్తింపు పొందిన వీరు థోడీతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. బహుశా ఈ రాగంతో వారి అనుబంధం భావోద్వేగపూరితమై ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఒక సందర్భంలో ‘ఇది మాలో ఆనందాన్ని నింపుతుంది. థోడీ పేరుకే ఒక రాగం, కానీ అనేక కూర్పులు ఉన్నాయి. గాయకులకైనా, సంగీతకారులకైనా ఇదొక సవాల్‌తో కూడిన రాగం.’ అన్నారు హరిప్రియ. అందుకే ప్రియా సిస్టర్స్ థోడీ రాగంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎక్కడా లేనివిధంగా ఒక కంపోజిషన్ మరోసారి పునరావృతం కాకుండా కచేరీ చేయడమే ప్రియా సిస్టర్స్ ప్రత్యేకం. అయితే కొత్త కాకపోవచ్చు. అత్యంత క్లిష్టమైన థోడీ రాగానికే అనేక వంపులు, సొగసులు అద్దిన వీరికి మిగిలిన రాగాలు ఒక లెక్క కాదు. సాధారణంగా రాగం సంప్రదాయం ఆధారంగా కచేరీలు జరుగుతాయి. కానీ వీరు మాత్రం అందుకు భిన్నంగా వేర్వేరు పాయింట్ల వద్ద రాగాన్ని వివరించే స్థానం (నెరవల్స్) ఎంచుకుంటారు. ఇది పూర్తిగా వారి మార్క్. బహుశా వారి గురువు టి.ఆర్.సుబ్రహ్మణ్యం నుంచి దీన్ని ఒడిసిపట్టివుంటారు. ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడూ ఎవరూ ఊహించని చోట నెరవల్స్‌ను రాగంలో భాగంగా చేసుకుంటారు. హరిప్రియ, షన్ముఖప్రియ మధ్య వయసు తేడా కేవలం ఏడాదిన్నరే. ఇద్దరిదీ రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు. ఇందులో ఒకరు బహిర్ముఖులు. బహుశా అందుకే తమిళనాడు క్రికెట్ జట్టులో ఆడగలిగివుంటారు. షన్ముఖప్రియ అంతర్ముఖురాలు. ఈ సోదరీమణులిద్దరూ తమ ఐదేళ్ల వయసులోనే కలిసి సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. ఇప్పటి వరకు కలిసే కచేరీలిస్తున్నారు. వీరిద్దరూ వేదిక మీద ఉంటే ఒకే ఆత్మతో రెండు శరీరాలు మనకు కనిపిస్తాయి. వీరు మాత్రం ఒకే ఆలోచనతో ఉంటారు.










Comments