ఉపాధికి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్
- Guest Writer
- 1 day ago
- 2 min read
మారుతున్న ఏపీ సామాజిక ముఖచిత్రం
జాతీయ సగటు జనాభా పెరుగుదలకు ఆమడ దూరంలో గుంటూరు, గోదావరి తీరం
ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న జనగమనం

ఒక్కసారి ఈ మ్యాప్ వైపు చూడండి.. ఇందులో ఎర్రరంగు మార్క్ చేసి ఉన్న ప్రాంతాలు జాతీయ సగటు జనాభా పెరుగుదల కంటే ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నాయి. మన రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క జిల్లా కూడా ఎరుపెక్కలేదు. కేవలం విశాఖ, కర్నూల్ మాత్రమే కొంచెం ఎల్లో కలర్‌లోకి మారాయి. ఇక్కడ ఎరుపెక్కడానికి రెండు కారణాలు... ఒకటి అత్యంత పేదరికం, రెండోది అత్యధిక పట్టణీకరణతో కూడిన అభివృద్ధి. ఆ రెండూ అస్సలు లేవు ఆంధ్రాలో. ఎందుకు?
ఆంధ్రా మొత్తంలో కొద్దో గొప్పో జనాభా పెరిగిన ప్రాంతాలు వైజాగ్, కర్నూల్. వైజాగ్ మొత్తం ఉత్తరాంధ్రను ఆదుకోగలిగింది. హైదరాబాద్, బెంగళూర్ ఊతంతో కర్నూల్ కొంత అభివృద్ధి చెందింది. అత్యంత తక్కువ అభివృద్ధి అంటే.. 50 శాతం కంటే తక్కువ జనాభా పెరుగుదల ఈ ముప్పయ్యేళ్లలో జరిగింది మాత్రం గుంటూరు, గోదావరి జిల్లాల్లో. అంటే ఆ రెండూ వెనుకబడి ఉన్నాయనా? అలా అనలేం కానీ.. అక్కడ నుంచి ఎక్కువ జనాభా వేరే ప్రాంతాలకు తరలిపోయింది అనవచ్చు. ఒకటి కొద్దో గొప్పో సంపాదన ఉండి చదివించుకోగలిగినవారి పిల్లలు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడం. హైదరాబాద్‌తో పాటు, పూణే, నోయిడా, చెన్నై, బెంగళూర్ లాంటి సాఫ్ట్వేర్ సెంటర్స్‌కు వెళ్లిపోయారు. మరికొంత మంది విదేశాలలో ఉద్యోగాలు సంపాదించారు. కానీ అత్యధిక శాతం మంది ఏదో ఒక పని చేసుకోవాలి అనుకుంటూ హైదరాబాద్‌కు వెళ్లిన వారే ఎక్కువ. అందుకే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఎరుపెక్కాయి. సంపద అంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కలకు తరలిపోయింది. అక్కడ ఇల్లు కొనుక్కుని స్థిరపడడం అనేది జీవితకాల భాగ్యం అనుకుంటూ 30 ఏళ్ల కాలంలో పుట్టినవారందరూ అక్కడే స్థిరపడ్డారు.
గత 15 సంవత్సరాల్లో మరిన్ని మార్పులు ఉధృతంగా జరిగాయి. ఈ లెక్కలు మరో మూడేళ్ల తర్వాత మాత్రమే తెలుస్తాయి. కనుక హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడం వలన అత్యంత నష్టపోయింది అటు జనాభా పరంగా, ఇటు సంపద తరలింపు పరంగా గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలే. అంతేకాదు ముఖ్యమైన వాణిజ్య ఉపాధి కేంద్రాలైన గుంటూరు విజయవాడ బెల్ట్‌లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చాలా మూతపడిపోయాయి. ప్రజలు ఎక్కువ భాగం ఉచితాలు లేనిదే బతకలేని స్థితిలోకి బలవంతంగా నెట్టబడ్డారు. కనుక ఈ ప్రాంతానికి జరిగిన నష్టాలను పూడ్చడానికి ఒక అవకాశం రాష్ట్ర విభజన. అసంబద్ధ విభజనతో అత్యధిక నష్టం కలిగిన ఈ గుంటూరు-గోదావరి జిల్లాల ప్రజలకు సరైన న్యాయం జరగాలి. కానీ రాష్ట్ర విభజన తర్వాత చట్టపరంగా ఆంధ్రాకు దక్కిన ఐఐటీ, ఐసెర్, డిఫెన్స్ రంగాల పరిశ్రమలు, కీయా లాంటివి రాయలసీమకు వచ్చాయి. ఐఐఎం, పెట్రో వర్సిటీ లాంటివే కాకుండా కొద్దో గొప్పో సాఫ్ట్‌వేర్ జాబ్స్, రైల్వేజోన్ లాంటివి విశాఖ ప్రాంతానికి వచ్చాయి. కానీ మధ్యలో ఉన్న ప్రకాశం నుంచి గోదావరి జిల్లాల వరకు కొత్తగా ఏ మాత్రం అభివృద్ధి ఛాయలు కనిపించలేదు.. ఉన్న రోడ్లు పాడయ్యాయి తప్పించి. వ్యవసాయంలో వాడే రసాయన ఎరువులు, పురుగు మందుల వలన వస్తోన్న అధిక కేన్సర్ జబ్బుల కోసం ఎయిమ్స్ మాత్రమే మంగళగిరిలో వచ్చింది.
ఈ ముప్ఫై ఏళ్లలో జరిగిన అన్యాయానికి ఎంతో కొంత ఉపశమనం రాజధానిగా అమరావతి ప్రాంత అభివృద్ధి. ఏ పేరు పెట్టుకున్నా సరే అభివృద్ధి మాత్రం ఈ ప్రాంతం మొత్తానికి అవసరం. దానికి ఫోకల్ పాయింట్‌గా అమరావతి అభివృద్ధి అనివార్యం. ఏపీసీఆర్‌డీఏ రీజియన్ ప్రాంతం మొత్తం ఔటర్ రింగ్ రోడ్డుతో అతి తక్కువ కాలంలో దేశంలోని మిగిలిన అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతాల స్థాయికి చేరుకునే సదవకాశం కలిగింది. ఒక రెండు మూడు తరాలు వెళ్లిపోయాయి. ఇక్కడ ఉండి పుట్టి పెరిగే నేటి తరం అయినా వేరొక ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే స్థిర నివాసం ఉండాలి అంటే ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి జరిగి తీరాలి.
అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. ఈ మధ్య ప్రాంతానికి జరిగిన అన్యాయం సరిదిద్దే క్రమంలో అమరావతి అభివృద్ధి అనివార్యం. నేడు ప్రతిపక్షం కూడా సర్దుకుని ఈ ప్రాంత వెనుకబాటును గుర్తించడం ముదావహం. వారు కోరుకున్న ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందాలి అంటే ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు గుంటూరు-అమరావతి మధ్యలో అధునాతన ఎయిర్‌పోర్ట్, రవాణా హబ్ ఏర్పాటు జరగాల్సి ఉంది. మచిలీపట్నం ఓడరేవుకు కనెక్టివిటీ ఇప్పటికే కేంద్రం చేపట్టింది. తీరప్రాంత అభివృద్ధి నమూనా కూడా మచిలీపట్నం నుంచి రామాయపట్నం వరకూ ఒక పారిశ్రామిక వాడను సృష్టించబడటం అనేవి ఈ ప్రాంత ఆధునిక జీవనానికి నాంది ప్రస్తావన మాత్రమే.
- కష్ణ చందలూరి






Comments