top of page

ఎన్నికలకు ముందే బెంగాల్‌ దంగల్‌!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jan 10
  • 3 min read

మరో మూడు నెలల్లో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దానికి ముందే ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో 50 లక్షలకుపైగా ఓట్లను తొలగించడం ఇప్పటికే వివాదాస్పదమైంది. దాంతోపాటు ఎన్నికలకు ముందే అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ ఆధిపత్య యుద్ధానికి దిగడంతో ఆ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా రాజుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ దన్నుతో బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మించి పవర్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను రాష్ట్రంపై ప్రయోగిస్తోందంటున్నారు. ఎన్నికల కమిషన్‌ ద్వారా లక్షల సంఖ్యలో ఓట్లను తొలగించిన కేంద్ర సర్కారు తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్న ఐప్యాక్‌పైకి ఈడీని ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఒక రాజకీయ కన్సల్టెన్సీ సంస్థపై ఈడీ దాడులు చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు. పశ్చిమ బెంగాల్లో పాగా వేయడమే లక్ష్యంగా కేంద్రం ముందు నుంచే పావులు కదుపుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలోని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఒకదాని తర్వాత ఒకటిగా వశపర్చుకుంటున్న బీజేపీకి బెంగాల్‌ మాత్రం కొరుకుడు పడటం లేదు. వాస్తవానికి 2021 ఎన్నికల్లోనే ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ శాయశక్తులా ప్రయత్నించినా.. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సర్కారును, పార్టీని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు ఆమెకే అధికారం కట్టబెట్టారు. దాంతో ఇప్పుడు మళ్లీ ఆ రాష్ట్రంపై కమలదళం గురిపెట్టింది. ఇటీవల జరిగిన బీహార్‌ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంలో తమ తర్వాత టార్గెట్‌ పశ్చిమ బెంగాల్‌ అని ఆ పార్టీ అగ్రనేతలు బహిరంగంగాన ప్రకటించారు. రాజకీయ పార్టీగా అధికారంలోకి రావాలని కోరుకోవడం, అందుకు తగిన లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయడం తప్పు కాదు గానీ.. బీజేపీ కేంద్రంలో తనకున్న అధికారాన్ని ఫణంగా పెట్టి బెంగాల్‌పై దండెత్తుతున్న తీరే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎస్‌ఐఆర్‌ పేరుతో ఆ రాష్ట్రంలో 50 లక్షలకుపైగా ఓటర్లను తొలగించడం రాజకీయ దుమారం రేపింది. ఆ వివాదం ఇంకా సద్దుమణగకముందే అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున పని చేస్తున్న ప్రముఖ పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ గ్రూపు అయిన ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(ఐప్యాక్‌)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాడి చేయడం సంచలనంగా మారింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ సహా దేశంలో అనేక పార్టీలకు చెందిన రాజకీయ సమాచారం ఐప్యాక్‌ వద్ద ఉండటంతో ఈ దాడులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. కోల్‌కతాలోని ఐప్యాక్‌ కార్యాలయంపై మూడు రోజుల క్రితం ఈడీ అధికారులు దాడి చేసి కార్యాలయంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసంలో కూడా సోదాలు జరిపారు. పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌) కింద ఈ సోదాలు నిర్వహించినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఐప్యాక్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై అనుమానాలతోనే ఈ దాడులు చేసినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. కొన్ని లావాదేవీలు, ఫండిరగ్‌ సోర్సులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. అయితే దాడుల తుది వివరాల గురించి ఇప్పటి వరకు ఈడీ అధికారులు వెల్లడిరచలేదు. ఐప్యాక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రతీక్‌ జైన్‌ తృణముల్‌ కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ దాడులను నిరసిస్తూ బంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సోదాలు జరుగుతున్న సమయంలోనే ప్రతీక్‌ జైన్‌ నివాసానికి వెళ్లారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనిఖీలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన హార్డ్‌డిస్క్‌, అభ్యర్థుల జాబితా, సంస్థాగత డేటాను సీజ్‌ చేసేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఎన్నికల వ్యూహాలను తస్కరించేందుకే బీజేపీ ప్రోద్బలంతో ఈడీ సోదాలు చేసిందని ఆమె ఆరోపించారు. దీనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై తాము సోదాలు జరపలేమా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఒకపక్క సర్‌ పేరుతో ఓటరు జాబితా నుంచి ఓటర్లను తొలిగిస్తూ మరోపక్క తమ పార్టీకి చెందిన సమాచారాన్ని దొంగలిస్తున్నారని మమత ఆరోపించడం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. మరోవైపు ఈడీ అధికారులు మమతా బెనర్జీపై తీవ్ర ప్రత్యారోపణలు చేశారు. ప్రతీక్‌జైన్‌ వ్యక్తిగత ఫోన్‌ను తాము తనిఖీ చేయకుండా ఆమె స్వాధీనం చేసుకున్నారని, తమను బెదిరింపులకు గురి చేశారని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ ఈడీ ఏకంగా కలకత్తా హైకోర్టులో పిటిషన్‌ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, డీసీ సౌత్‌, పోలీస్‌ కమిషనర్‌, రాష్ట్ర డీజీపీ, సీబీఐలను ఇందులో ప్రతివాదులుగా చేర్చింది. కాగా దీనికి ప్రతిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈడీకి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ వేసింది. సోదాల సందర్భంగా ఈడీ అధికారులు వారితోపాటు వచ్చిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది చాలా దారుణంగా వ్యవహరించారని ఆ పిటిషన్‌లో ఆరోపించడంతో వివాదం మొత్తం కోర్టుకు చేరినట్టయ్యింది. త విధులకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని ఈడీ హైకోర్టును కోరింది. మరోవైపు ఈడీ చర్యలను నిరసిస్తూ రాష్ట్రంలో మమతాబెనర్జీ పార్టీ నిరసన ప్రదర్శనలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించింది. అలాగే సీఎం మమతాబెనర్జీ స్వయంగా షేక్‌స్పియర్‌ సరాని పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి ఫిర్యాదు చేశారు. కొన్ని ముఖ్యమైన పత్రాలు కనిపించడం లేదని అవి చోరీ అయ్యాయంటూ ఐప్యాక్‌ నుంచి మరో ఫిర్యాదు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ముందే రాజకీయ వివాదం రాజుకోవడం ఆ రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలు, అల్లర్లు, దాడులు గుర్తుకొచ్చి ఎన్నికల నాటికి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని భయపెడుతున్నాయి.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page