ఎమ్మార్పీ పెంచుకో.. అడిగితే ‘దిక్కున్నచోట చెప్పుకో!’
- BAGADI NARAYANARAO

- Oct 13, 2025
- 3 min read
మద్యం లైసెన్సీలకు ఎక్సైజ్ రూట్‌మ్యాప్
బాటిల్‌పై రూ.10 పెంపు
బెల్టుల్లో ఎవడిష్టం వాడిది
అవలంగి కల్తీపై అధికారులపై చర్యలు లేవు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో ఒకవైపు కల్తీ మద్యం, మరోవైపు ఎమ్మార్పీ వయోలేషన్ యథేచ్చగా జరుగుతున్నా ఇంకా ఎక్సైజ్ అధికారులు అందులో తమ పాత్ర లేనట్టే ధృతరాష్ట్రుడి గుడ్డితనాన్ని నటిస్తున్నారు. సారవకోట మండలం అవలంగిలో నకిలీ మద్యం తయారుచేస్తున్న రాకెట్ పట్టుబడినా ఇంతవరకు ప్రధాన నిందితుడ్ని పట్టుకోలేదు సరికదా.. అక్కడ ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం ఉందంటూ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఇటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఆబ్కారీ శాఖలో ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో ప్రస్తుతం కల్తీ మద్యం బయటపడిన ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలలో ఎక్సైజ్ అధికారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంది. విచిత్రమేమిటంటే.. అసలు కల్తీ మద్యం రాష్ట్రంలో మొదట బయటపడిరది శ్రీకాకుళం జిల్లాలోనే. ఇక్కడ మాత్రం ఎటువంటి చర్యలూ లేవు సరికదా.. రాష్ట్రమంతా కల్తీలిక్కర్ మీద డిస్కషన్ నడుస్తుంటే.. సందిట్లో సడేమియా లాగ జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఎమ్మార్పీ మీద రూ.10 పెంచి అమ్ముకునే వెసులుబాటును ఎక్సైజ్ అధికారులు లైసెన్సీలకు అనధికారికంగా కట్టబెట్టారు. ఎక్కడా క్వార్టర్ బాటిల్ తీసుకొని బిల్లు ఇమ్మని అడగరు కాబట్టి ఎమ్మార్పీ వయోలేషన్ ఉందని నిరూపించలేరని ఎక్సైజ్ అధికారుల ధీమా.
పలాసకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు మన్యాల శ్రీనివాస్ యాదవ్ పలాస`కాశీబుగ్గ పట్టణంలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు ఒక ఫిర్యాదు ఇచ్చారు. పలాస` కాశీబుగ్గలో మద్యం సిండికేట్‌గా ఏర్పడి ఒక మద్యం బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలుచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పలాసలో మద్యం బాటిల్‌పై అదనంగా రూ.10 వసూలు చేయడం మూడు నెలల క్రితమే ప్రారంభమైంది. అదనపు వసూలుపై మద్యం ప్రియుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొద్దిరోజులు వెనక్కు తగ్గారు. ఇప్పుడు రాష్ట్రమంతా కల్తీ మద్యంపై డైవర్ట్ కాగా, ఇక్కడి సిండికేట్ మళ్లీ రూ.10 అదనంగా వసూలు చేయడం ప్రారంభించింది.
జిల్లాలో మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నా, గ్రామాల్లో బెల్ట్ షాపులు తెరిచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నా ఎక్సైజ్ అధికారులకు తెలియకుండా జరగడం లేదు. ఎక్సైజ్ అధికారులు ఇచ్చిన రూట్‌మ్యాప్‌ను సిండికేట్ అమలుచేస్తుంది. మద్యం వ్యాపారులకు ప్రభుత్వం నుంచి రావల్సిన కమీషన్ రాకపోవడంతో అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం 20 శాతం కమీషన్ ఇవ్వడానికి నిర్ణయించి నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. పాలసీ అమల్లోకి వచ్చి మద్యం విక్రయాలు ప్రారంభం అయిన తర్వాత 14 శాతం వరకు కమీషన్ అందుతుంది. ఇది వ్యాపారులకు ఏమాత్రం గిట్టుబాటు కావడంలేదు. గతంలో మద్యం వ్యాపారం చేసి రెండు చేతులా తినినవారికి గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడపడం వల్ల ఏం చేయాలో పాలుపోలేదు. ఇటువంటి వారికి కొత్త ఎక్సైజ్ పాలసీ పెద్ద అదృష్ట దేవతగా కనిపించింది. 20 శాతం మార్జిన్‌తో షాపు దొరికితే పంట పండినట్టేనని భావించారు. అప్లికేషన్ ఫీజు రూ.2 లక్షలు పెట్టినా, షాపు లాటరీలో పేలిన తర్వాత ప్రతీ ఏడాది 10 శాతం ఫీజు పెంచినా ఏమాత్రం ఫికర్ కాకుండా కొందరైతే వందలకొద్దీ అప్లికేషన్లు వేశారు. ఇందుకోసం వందలమందిని భాగస్వాములుగా చేర్చుకున్నారు. తీరా వ్యాపారంలోకి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు కోసం అప్పు చేసినదానికి వడ్డీ కూడా కిట్టుబాటు కావడంలేదు. ఎక్సైజ్ అధికారుల పరిస్థితి కూడా ఇంతే. వైకాపా హయాంలో జీతం తప్ప గీతం లేకపోవడం వల్ల చేతులకు దురద పెరిగిపోయింది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అటు అమరావతి నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అనేకమంది ఎక్సైజ్ అధికారులు స్థలాలో, ప్లాట్లో, ఫ్లాట్లో ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈఎంఐలు బకాయిలు పడిపోయారు. మద్యం ప్రైవేటు పాలసీ కావడంతో వాటన్నింటినీ మళ్లీ సరైన ట్రాక్‌లో పెట్టి ఆస్తులు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. అందుకే లైసెన్సీలు భయపడుతున్నా మేమున్నామంటూ భరోసా ఇచ్చి మరీ ఎమ్మార్పీ వయోలేషన్, బెల్టులకు డంపింగ్ వంటివి చేయిస్తున్నారు. ఇందులో ఎక్కువ సొమ్ములిచ్చిన లైసెన్సీకి ఎక్కువ ఫేవర్ చేస్తున్నారు. ఆ షాపు పరిధిలో కాకుండా వేరేవారి షాపు ఏరియాలో కూడా ఉన్న బెల్టు షాపులకు ఇక్కడి నుంచే మద్యం సరఫరా చేయిస్తున్నారు.
గ్రామాల్లో ఉన్న బెల్టుషాపులు బాటిల్‌పై రూ.20 నుంచి రూ.40 అధికంగా వసూలు చేస్తున్నారు. గతంలో షాపుల నుంచి ఎమ్మార్పీకే బెల్టులు కొనుగోలు చేయగా, ట్రాస్ట్‌పోర్టు, మిగిలిన రిస్క్‌ల కింద రూ.10 ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. ఇప్పుడు మద్యం దుకాణంలోనే బెల్టులకు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. కాబట్టి వారు దాని మీద మరింత పెంచి గ్రామాల్లో అమ్ముతున్నారు. ఇవన్నీ ఎక్సైజ్ అధికారులకు తెలుసు. మద్యం షాపుల్లో అధిక ధరకు విక్రయించడంపై ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకోమంటూ సమాధానం ఇస్తున్నారంటే ఎక్సైజ్ అధికారులు ఎంతలా భరోసా ఇచ్చివుండాలి?!
నకిలీ మద్యం తయారుచేస్తూ దొరికిన నీలకంఠం కేసులో కూడా మరో వాదన ఉంది. ఎప్పట్నుంచో ఇక్కడ కల్తీ మద్యం తయారవుతున్న విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసినా చర్యలకు వెనుకాడారని, సారవకోటలో ఉన్న నీలకంఠం పార్టనర్‌గా ఉన్న షాపు మంత్లీలు ఇవ్వడంలో వెనుకబడటం వల్లే నకిలీ విషయాన్ని బయటపెట్టారని మద్యం వ్యాపారుల సర్కిల్‌లో ఒక టాక్ ఉంది.
నీలకంఠు అంటేనే కల్తీ లిక్కర్‌కు కేరాఫ్. అటువంటి వ్యక్తుల మీద ఎక్సైజ్ అధికారులకు నిఘా ఉండదని భావించలేం. బెల్ట్‌షాపులు ఏర్పాటుచేసి మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరిస్తుంటే జిల్లాలో ఎక్సైజ్ అధికారుల మాత్రం అన్ని నియోజకవర్గాల్లో మద్యం షాపులకు సమాంతరంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు తెరిచి అధిక ధరకు మద్యం విక్రయిస్తున్నారు. మద్యం షాపులకు ఇచ్చిన టార్గెట్‌లను రీచ్ కావాలన్నా, కట్టిన లైసెన్స్ ఫీజును సంపాదించాలన్నా బెల్ట్ షాపులు, అధిక ధరలకు విక్రయాలు తప్పదని వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు.
ఈ నెల 9న కలెక్టర్ నవోదయం 2.0పై అబ్కారీ, పోలీసు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. నాటుసారా రహిత జిల్లా లక్ష్యంగా నిఘా, దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నవోదయం 2.0లో కేవలం నాటుసారా అంశం మాత్రమే ఉంటుంది. మరి కల్తీ లిక్కర్ నాటుసారా కంటే ప్రమాదమన్న విషయం అక్కడెవరూ చెప్పకపోవడం విశేషం.










Comments