top of page

ఎరువే కరువయ్యేనా?

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jul 24
  • 3 min read
  • ప్రభుత్వ కోటాలో సరఫరా వద్ద ఘర్షణ పడుతున్న రైతన్నలు

  • ఇలా వచ్చి అలా మాయమైపోతున్న బస్తాలు

  • వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినా దక్కని ఊరట

  • చేతులెత్తేసిన అధికారులు

  • కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌తో సరి

  • ఎప్పటిలాగే దోచేస్తున్న ప్రైవేటు డీలర్లు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
  • పొందూరు మండలం దల్లిపేట గ్రామ సచివాలయానికి రావాల్సిన ఎరువులు నేరుగా ఓ ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయి, అక్కడి నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతికి తరలిపోయిందంటూ స్వయంగా గ్రామ సర్పంచే సోమవారం గ్రీవెన్స్‌లో అధికారులకు ఫిర్యాదు చేశారు.

  • సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ సచివాలయం వద్ద 245 యూరియా బస్తాలు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో పెద్ద ఎత్తున అక్కడకు చేరిన రైతులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వివక్ష లేకుండా అందరికీ పంపిణీ చేయాలని, అలా కాకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం కోసం కొందరికి ఎక్కువ బస్తాలిస్తున్నారంటూ బుధవారం గొడవ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

  • కొత్తూరు మండల కేంద్రంలో ఎరువులు అందడంలేదంటూ మండల వ్యవసాయాధికారి కార్యాలయాన్ని నాలుగు రోజుల క్రితం రైతులు ముట్టడిరచారు.

    .. ఇదీ స్థూలంగా జిల్లాలో ఎరువుల కొరత కోసం వేరేగా చెప్పనక్కర్లేకుండా వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల సారాంశం. యూరియా ఏమైనా అందరూ తినే వస్తువా? లేదూ అంటే ఏమాత్రం ఈ భూమి మీద దొరకని పదార్థమా? ఎందుకింత రచ్చ జరుగుతుంది? అది కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో?

ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాంరా బుజ్జీ అని అతడు సినిమాలో బ్రహ్మాజీని ఉద్దేశించి తనికెళ్లభరణి అన్నట్టు అరువు తెచ్చుకుందామన్నా కూడా దొరకడంలేదు. స్వయంగా అచ్చెన్నాయుడే జిల్లాలో ఒక్క రైతు కూడా తమకు ఎరువులు అందడంలేదని ఫిర్యాదు చేయకూడదని వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు. అయితే పరిస్థితిలో మార్పు వచ్చిందా? లేదా? అనేదే ఈ కథనం. సూటిగా చెప్పాలంటే అచ్చెన్నాయుడు చెప్పిన తర్వాత కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు.

ree

జిల్లాకు సరఫరా చేసే ఎరువుల్లో 50 శాతం ప్రైవేట్‌కు, 50 శాతం మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతుసేవా కేంద్రాలకు, పీఏసీఎస్‌, మార్కెట్‌ కమిటీలకు ప్రభుత్వం సరఫరా చేస్తుంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా జరగకపోవడం వల్ల జిల్లాలో ఎరువుల కొరత ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి తగినంత కేటాయింపు జరగడం లేదని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాదిలో ఉన్న ప్రభుత్వ ఎరువుల కంపెనీల నుంచి రావాల్సిన కోటా రాష్ట్ర అవసరాలకు సరిపోవడం లేదనే ప్రచారం ఉంది. దీంతోపాటు కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ యూనిట్‌ మూసివేయడం స్థానిక సరఫరాపై ప్రభావం చూపుతుందని చర్చ సాగుతుంది. తెలంగాణలోని రామగుండం ఎరువుల యూనిట్‌ రాష్ట్ర అవసరాలు తీర్చడంలో విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు జిల్లాలో హోల్‌సేల్‌ ఎరువుల వ్యాపారులు ఇష్టానురీతిగా వ్యవహరిస్తూ అడ్డగోలు విక్రయాలు చేయడం, రైతుసేవా కేంద్రాలు, సొసైటీలకు సరఫరా చేసిన ఎరువులు పక్కదారి పట్టడమే కొరతకు కారణమనే విమర్శలు ఉన్నాయి.

ప్రైవేటులోనే లభ్యం

జిల్లాలో ఐదుగురు హోల్‌సేల్‌ వర్తకులు ఉన్నారు. శ్రీకాకుళంలో గౌతం ట్రేడర్స్‌ పేరిట సకలాబత్తుల, ఆమదాలవలసలో వైశ్యరాజు వెంకటరాజు, టెక్కలిలో తంగుడు విష్ణమూర్తి, వైశ్యరాజు గోవిందరాజుతో పాటు మరో వ్యాపారి ఉన్నారు. వీరు రిటైల్‌ డీలర్లకు ఎరువులు సరఫరా చేస్తుంటారు. వీరికి 50 కేజీల యూరియా రూ.242లకు దిగుమతి అవుతుంది. వీరి నుంచి రిటైల్‌ వ్యాపారులు అదనంగా రూ.40 నుంచి రూ.50 చెల్లించి తరలిస్తుంటారు. వీటిని రిటైల్‌ వ్యాపారులు మరో రూ.50 అదనంగా ధరను ఫిక్స్‌ చేసి రూ.325 నుంచి రూ.350లకు విక్రయిస్తున్నారు. డీఏపీ 50 కేజీల బస్తా విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. రూ.1280లకు దిగుమతి చేసుకుంటున్న డీఏపీని రిటైల్‌లో రూ.1450కు విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయాలంటే కాంప్లెక్స్‌ ఎరువులు, దుబ్బుగుళికలు, జింకును కొనుగోలు చేయాలని లింక్‌ పెడుతున్నారు. వీటిని కొనుగోలు చేస్తేనే డీఏపీ, యూరియాను రైతులకు ఇస్తున్నారు. రైతుసేవా కేంద్రాల్లో యూరియా 50 కేజీల బస్తా రూ.268, డీఏపీ రూ.1350కు విక్రయిస్తున్నారు. వీటితో పోల్చితే ప్రైవేట్‌లో ఒక్కో బస్తాపై అదనంగా రూ.100 వసూలు చేస్తున్నారు. వాస్తవంగా హోల్‌సేల్‌ వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్న ఎరువులను గొడౌన్లలో స్టోర్‌ చేయకుండా రిటైల్‌కు ఇచ్చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఐదుగురు హోల్‌సేల్‌ ఎరువుల వ్యాపారులకు ఎరువులు నిల్వ చేసే గొడౌన్లు లేవు. అయినా వీరు వేల టన్నుల ఎరువులను దిగుమతి చేసుకుంటూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

అధికార పార్టీ నాయకులు చెప్పినవారికే ఎరువులు

జిల్లాలో ఖరీఫ్‌ పంటల సాగుకు అవసరమయ్యే ఎరువుల కోసం ఒక ప్రణాళికను వ్యవసాయశాఖ అధికారులు రూపొందిస్తారు. దీన్ని అనుసరించి నెలవారీ డిమాండ్‌ మేరకు బఫర్‌ స్టాక్‌ను అనుసరించి ఎరువులకు ఇండెంట్‌ ఇవ్వడం అనవాయితీగా వస్తుంది. జిల్లాకు కేటాయిస్తున్న ఎరువుల్లో 50 శాతం మాత్రమే రైతు సేవాకేంద్రాలు, పీఏసీఎస్‌లు, మార్కెట్‌ కమిటీల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో యూరియా 10,583 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 6402, పొటాష్‌ 922, కాంప్లెక్స్‌ 3084, సూపర్‌ పాస్పేట్‌ 842 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేశామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 11 నాటికి ఏపీ మార్క్‌ఫెడ్‌ వద్ద యూరియా 5,692, డీఏపీ 215, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు 5,292 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నట్టు కలెక్టర్‌ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అయితే సొసైటీలు, రైతుసేవా కేంద్రాల్లో ఎరువులు దొరక్క రైతులు ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనికి కారణం సొసైటీలు, రైతుసేవా కేంద్రాలకు వచ్చిన ఎరువులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తరలించుకుపోయారనే ఆరోపణలు ఉన్నాయి. హోల్‌సేల్‌ వ్యాపారులు సరిహద్దులు దాటించి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నారని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏప్రిల్‌ ఒకటి నాటికి నిల్వ ఉన్న సుమారు 15,129 మెట్రిక్‌ టన్నుల ఎరువులు ఈ నెల 10 నాటికి సరఫరా అయ్యాయని అధికారులు చెబుతున్నా, రైతుల చెంతకు మాత్రం అరకొరగానే చేరాయని జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బఫర్‌ స్టాక్‌, డిమాండ్‌ మేరకు కావాల్సిన ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు అధికారులు చెబుతున్నారు.

డిమాండ్‌`సప్లైలో అంతరం

జిల్లాలో ఖరీఫ్‌లో సుమారు 4 లక్షల ఎకరాల్లో వరి, 30వేల ఎకరాల్లో మొక్కజొన్న, కొబ్బరి, జీడితోటలకు ఎరువులకు డిమాండ్‌ ఉంటుంది. వీటికి సుమారు 50వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు అవసరం. వరి ఎకరాకు 50 కేజీలు, మొక్కజొన్న, కొబ్బరి, జీడికి ఎకరాకు 100 కేజీలు యూరియా, డీఏపీ అవసరం. అయితే వీటిని ఖరీఫ్‌ ఎరువులు ప్రణాళిక ప్రకారం ప్రతి నెల డిమాండ్‌ మేరకు పంపిణీ చేయాలి. డిమాండ్‌, సప్లైలో అంతరం ఉండడంతో ఎరువులు సరఫరా సకాలంలో జరగడం లేదు. దీంతో యూరియా, డీఏపీ సరఫరాలో కొరత కారణంగా జిల్లాలలోని రైతులు ప్రైవేట్‌ డీలర్ల నుంచి అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో వ్యవసాయ శాఖ అధికారులు చేతులెత్తేశారు. ఎరువులను అవసరానికి మించి వినియోగిస్తున్నందునే కొరత ఏర్పడుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఎరువుల సరఫరాపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page