ఎవరి గుండెలాపేయడానికో..?!
- SATYAM DAILY
- Sep 3, 2025
- 2 min read
పెద్ద పెద్ద బాక్స్‌లతో బయల్దేరుతున్న డీజే సౌండ్ సిస్టమ్స్
లేదు లేదంటూనే వదిలేస్తున్న పోలీసులు
ఇప్పటికే గుండెపోటుతో మృతిచెందినవారెందరో!
గర్భస్రావాలతో పాటు మూగజీవాలు అంతరించే ప్రమాదం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజే ప్రాణం తీసింది. డీజే సౌండ్ బ్యాక్సుల దగ్గర డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.
అమలాపురంలోని డీజే సౌండ్ బాక్సుల నుంచి వెలువడిన భారీ శబ్దానికి కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఇరవై ఏళ్ల పప్పుల వినయ్ మరణించాడు. అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామానికి చెందిన వినయ్ తన స్నేహితులతో కలిసి అమలాపురంలో జరిగిన దసరా ముగింపు ఉత్సవాల్లో డీజే బాక్సుల ముందు డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.
బీహార్‌లో ఇటీవల పెళ్లింట విషాదం గుర్తుంది కదా..? డీజే సౌండ్ మోతకు వరుడి గుండె లయ తప్పింది. స్టేజిపైనే గుండెపోటు రావడంతో అతడు అక్కడికక్కడే కుప్పుకూలిపోయాడు. పెళ్లి తర్వాత ఆనందోత్సాహాల మధ్య బరాత్ జరగాల్సిన రోజే శవయాత్ర నిర్వహించాల్సి రావడం అందరినీ కలిచివేసింది.
జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో ఫిబ్రవరి 26న డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. రిసెప్షన్ వేళ పాటలు, ఆటలు చేస్తూ సందడిగా ఉన్న వాతారణంలో విషాదం అలముకుంది. డీజేకు డ్యాన్స్ చేస్తున్న 19 ఏళ్ల ముత్యం ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయాడు.
ఆంధ్రప్రదేశ్‌లో గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ.. యువకుడు కుప్పకూలి చనిపోయిన ఘటన మరవక ముందే.. అలాంటి సంఘటనే తెలంగాణలో 2033 సెప్టెంబర్ 27న జరిగింది.
..డీజే కారణంగా చనిపోయిన వారి వివరాల్లో ఇవి కొన్ని మాత్రమే. శ్రీకాకుళం జిల్లాలోనూ డీజే మ్యూజిక్ మధ్య డ్యాన్స్ చేస్తూ మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి.

గణేష్ నిమజ్జనం.. కుర్రోళ్లకు కిక్కే కిక్కు.. డాన్సులతో, రంగులతో అంతా హడావిడి సందడి నెలకొంటుంది. మారిన కాలం.. మారిన ఆహారపు అలవాట్లతో యువకులు సైతం గుండెపోటుతో చనిపోతున్నారు.

వినాయక నిమజ్జనాలు చవితి తర్వాత మూడు రోజుల నుంచే మొదలయ్యాయి. చిన్న వినాయకుడైనా పెద్ద ఊరేగింపుతో తీసుకెళ్తున్నారు. ఇందుకు జనాలను కూడెయ్యాలంటే డీజే తప్పనిసరి. డీజేలు వద్దంటూనే పోలీస్ శాఖ అనుమతులిచ్చేస్తోంది. ఇక డీజే సౌండ్‌తో పాత ఇళ్లు పగుళ్లు ఇస్తున్నాయి.. ఇటీవల చాలామంది హృద్రోగులు గుండెపట్టుకుని దూరంగా పరుగెడుతున్నారు.
గతంలో చాలామంది పెళ్లిళ్లలోను, ఇతర ఊరేగింపుల్లోనూ డీజే సౌండ్స్ కారణంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన సంఘటనలు ఉన్నాయి. కనీసం వారిని ఆసుపత్రికి తరలించే సమయం కూడా లేకపోతోంది. పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలు, రాజకీయ పార్టీల ఊరేగింపు.. ఇలా పలు కార్యక్రమాలలో ఇటీవల డీజేలను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల గుండె చాలా వీక్‌గా ఉన్న వాళ్లకు హార్ట్ ఎటాక్ వస్తుందని డాక్టర్లు అంటున్నారు. అందువల్లే చాలామంది మృతి చెందుతున్నారని వారు చెబుతున్నారు. అలాగే ఆడవాళ్లకు గర్భస్రావం జరిగే అవకాశం కూడా ఉందంటున్నారు.
అయినా వద్దు వద్దంటూనే పోలీసులు తక్కువ డెసిబుల్స్ సౌండ్స్‌తో వాడండి అంటూ అనుమతులిచ్చేస్తున్నారు. శబ్ద తరంగాలను నియంత్రించేందుకు చట్టం కూడా అందుబాటులో ఉంది. దాని ప్రకారం ఈ సమయం నుంచి ఈ సమయం వరకే ఇంత శబ్దతరంగాలను ఉపయోగించుకొని వేడుకలు చేసుకోవాలని ఉంది. కానీ ప్రజలు అవేమీ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా వాటిని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. దీంతో ఈ చట్టం సరిగా అమలు కాకపోవడంతో.. రోజురోజుకు శబ్ద కాలుష్యం పెరుగుతోంది.
కొన్నిచోట్ల పంటపొలాల్లో కీటకాలను తరిమేందుకు ఎక్కువ డెసిబుల్స్‌లో శబ్ధతరంగాలు వినియోగించడం మనకు తెలుసు. అయితే వేడుకల్లో వాడే డీజేల కారణంగా పలు రకాల రోగాల బారిన పడటమే కాకుండా, ప్రకృతిలోనూ బతికే జీవాలు అంతరించిపోతున్నాయని నిపుణులు అంటున్నారు.
ఇక ఈరోజు ఇన్ని బాక్సులేసుకొని రోడ్డంతా ఆక్రమించేసిన ఈ డీజే ఏ ఇరుకువీధిలోకి వెళ్తుందో..? దీని శబ్దాలకు ఎన్ని ఇళ్లు బీటలువారుతాయో? ఎంతమంది గుండెలు పట్టుకుంటారో? ఇంకెందరి చెవుల నుంచి రక్తం కారుతుందో? ఇన్ని మరణాలకు కారణమవుతున్న డీజేలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తారో? లేదా నాయకుల ఒత్తిడికి తలొగ్గుతారో? చూడాలి మరి.










Comments