top of page

ఎవరీ వెంపటాపు భారతి?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 1 day ago
  • 2 min read
  •  అరసవల్లి ట్రస్ట్‌బోర్డులో అపరిచితురాలన్న వ్యాఖ్యలు

  •  ఆమె మూలాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనివే

  •  తండ్రి ప్రముఖ నక్సలైట్ నాయకుడు వెంపటాపు సత్యం

  •  ప్రజాస్వామ్యంపై నమ్మకంతో రాజకీయాల్లో కుమార్తె

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

కేసుల్లో ఉన్నవారి జాడ తెలియని సందర్భాల్లో పోలీసులు మీడియా ద్వారా ఒక రకమైన అప్పీల్ చేస్తుంటారు. ‘ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఆచూకీ తెలిస్తే పోలీసులకు తెలియజేయవలెను. ఆచూకీ చెప్పినవారికి తగిన రివార్డు ఇవ్వబడును’ అని ప్రకటిస్తుంటారు.

అచ్చం అలాగే కాకపోయినా.. ఒక మహిళ వివరాల కోసం జిల్లా రాజకీయ నాయకులతోపాటు ప్రజలు కూడా తెగ వెతికేస్తున్నారు. గూగుల్‌తో సహా సెర్చ్ ఇంజన్లన్నింటినీ కెలికేస్తున్నారు. అయినా వివరాలు లభించక ఉస్సూరుమంటున్నారు. ఇంతమందిని ఉత్కంఠకు గురి చేస్తున్న ఆ మహిళ పేరు వెంపటాపు భారతి. ఆమె కోసం జరుగుతున్న వెతుకులాటకు కారణమేంటి? ఆమె ఏదైనా వివాదంలో ఉన్నారా?? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. కానీ అవేవీ కావు. ప్రభుత్వం ప్రకటించిన అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవస్థానం కొత్త పాలకమండలిలో ఆమె పేరు ఉండటం.. ఆమె స్థానికురాలు కాకపోవడం.. ఆమె వివరాలు ఎమ్మెల్యేతో సహా ఇక్కడివారెవరికీ తెలియకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ట్రస్ట్ బోర్డు జాబితాలో ఉన్న మిగిలిన సభ్యులందరూ తెలిసినవారు కాగా వెంపటాపు భారతి అన్న ఆమె మాత్రమే ఈ ప్రాంతానికి.. ప్రత్యేకించి ఈ తరానికి అపరిచితురాలు. ఈ ప్రాంతంతో సంబంధంలేని, ఎవరికీ తెలియని మహిళను ప్రభుత్వం ఎలా ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించిందన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెంపటాపు భారతి పూర్వాపరాల కోసం ‘సత్యం’ ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తండ్రిది నక్సలిజం

వెంపటాపు భారతి నేపథ్యం సామాన్యమైనది కాదు. ఆమె కుటుంబం ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమంతో మమేకమైంది. ఈమెకు నేరుగా ఆ ఉద్యమంతో సంబంధం లేకపోయినా ఆమె తండ్రి వెంపటాపు సత్యనారాయణ అలియాస్ వెంపటాపు సత్యం 1967`68లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలను ఊపేసిన సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. ప్రముఖ నక్సలైట్ నాయకులైన ఆదిభట్ల కైలాసం, సుబ్బారావు పాణిగ్రాహి వంటి వారితో కలిసి ‘దున్నే వారిదే భూమి’ అన్న నినాదంతో సాయుధ పోరాటం సాగించారు. ఆ సమయంలోనే సీపీఐఎంఎల్ పార్టీలో చేరి 1969లో ఆ పార్టీ సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడయ్యారు. చారుముజుందార్ ఆధ్వర్యంలో పనిచేస్తూ పార్టీ శ్రీకాకుళం జిల్లా కమిటీ కార్యదర్శిగా కూడా పని చేశారు. 1970జూలై పది, పదకొండు తేదీల్లో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆదిభట్ల కైలాసంతోపాటు వెంపటాపు సత్యం కూడా చనిపోయారు. ప్రస్తుతం అరసవల్లి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితురాలైన వెంపటాపు భారతి స్వయంగా ఆమె కుమార్తె అయినప్పటికీ ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు.

ఈమెది రాజకీయం

నక్సలైట్ సిద్ధాంతాలతో సావాసం చేసిన కుటుంబంలో జన్మించినా భారతిలో ఆ వాసనలు మచ్చుకైనా లేవు. భారతి చిన్న వయసులో ఉన్నప్పుడే 1970లోనే తండ్రి వెంపటాపు సత్యం పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించడం, తర్వాత ఆ కుటంబం చెదిరిపోవడంతో ఆమె సాధారణ జీవితం గడిపారు. అంతేకాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన సమకాలీన రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ గ్రామంలో నివసిస్తున్న ఆమె ఆ గ్రామానికి గతంలో సర్పంచ్‌గా వ్యవహరించారు. గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారన్న ప్రచారం ఉన్నా అది రూఢీ కాలేదు. అయితే రాష్ట్ర విభజనకు ముందు సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జైసమైక్యాంధ్ర పార్టీలో చురుగ్గా పని చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. ఆ అవకాశం రాకపోయినా ఆ పార్టీలోనే కొనసాగుతున్న భారతికి అనూహ్యంగా పార్టీ అధిష్టానవర్గం అరసవల్లి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యురాలిగా నియమించింది. ఎవరో అపరిచితురాలిని నియమించారని టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందనడానికి ఈ నియామకమే ఒక నిదర్శనమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page