top of page

దేవుడా దీని యజమాని ఎవరో నీకైనా తెలుసా?

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 1 day ago
  • 2 min read

రికార్డుల్లో లేని స్థలానికి రూ. 8 లక్షల లోన్

మార్పిడులు, అనుమానాస్పద సెటిల్మెంట్లు

పోరంబోకు భూమికి ప్రైవేటు లీజులు

రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి.. సరికొత్త లీలలు


నగర నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి చుట్టూ నకిలీ పత్రాల మాయాజాలం నడుస్తోంది. రికార్డుల్లోనే లేని సబ్ డివిజన్ పేరుతో బ్యాంకుల్లో లక్షల రూపాయల రుణాలు పొందేయడం, ఒకరి భూమిని మరొకరు లీజుకు ఇచ్చి నెలకు రూ. లక్షల్లో జేబులు నింపుకోవడం ఇక్కడ నిత్యకృత్యమైపోయింది. డే అండ్ నైట్ జంక్షన్ సమీపంలోని ఆటో స్టాండ్ స్థలం చుట్టూ తిరుగుతున్న రూ. కోట్ల భూ భాగోతం, నకిలీ రికార్డుల దందాలపై ప్రత్యేక కథనం.

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

స్థానిక డే అండ్ నైట్ జంక్షన్ నుంచి సింధూర హాస్పిటల్‌కు టర్న్ తీసుకునే రోడ్డు ప్రారంభంలో ఉన్న ఆటో స్టాండ్ స్థలం ఎవరిదన్న విషయం తేలకముందే ఈ భూమిని మార్ట్‌గేజ్ పెట్టి ఆమదాలవలసలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో రుణం కూడా తీసేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

2006 డిసెంబరులో ఆమదాలవలసకు చెందిన వైశ్యరాజు ధనలక్ష్మి, రాజేంద్రరాజు పేరుతో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమదాలవలస బ్రాంచ్‌లో రూ.8 లక్షల రుణం తీసుకున్నారు. వీరి తదనంతరం 2018లో వారి వారసులుగా విశాఖపట్నంకు చెందిన ఊణ్ణ ఇందిర ఆ అప్ప్పునకు సరిపడా సర్వే నంబర్ 713/3సి లో స్థలాన్ని బ్యాంకుకు మార్ట్‌గేజ్‌గా పెట్టారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఈ 713/3సి అనే సబ్ డివిజనే లేదు. ఇది ఒక కథ.

ఇదే సర్వే నెంబర్ 713/3లోని 17 సెంట్లు స్థలాన్ని 1959 జూన్ 9న గోరిశెట్టి ముత్యాలుకు ఆమె భర్త ఫకీరు సెటిల్మెంట్ పత్రం కింద ఈ భూమిని ఇచ్చినట్టు కాగితాలు కనిపిస్తున్నాయి. ఇదొక కథ.

1995 జనవరి 11న గారకు చెందిన మార్పు ఆనంద్‌కు ఈ స్థలాన్ని గోరిశెîట్టి ఆదెమ్మ విక్రయించినట్టు కాగితాల్లో కనిపిస్తన్నాయి. పై పేరాలో గోరిశెట్టి ముత్యాలుకు గోరిశెట్టి ఆదమ్మ ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే.. ఇటీవల ఇంటిపేరు కామన్‌గా ఉంటే ఏదో ఒక ఆధారాలు తెచ్చి పత్రాలు సృష్టించడం సాధారణమైపోయింది. కాబట్టి ఎవరికి ఎవరు ఏమవుతారో ఎవరికీ తెలియకుండాపోయింది. ఇది మరో కథ.

వాస్తవానికి 1958 సర్వే ల్యాండ్ రికార్డుల్లో గోరిశెట్టి చంద్రయ్య, సోమవరపు రామస్వామి పేర్లు అధికారికంగా నమోదై ఉన్నాయి. ఈ స్థలాన్ని 2023లో నగరానికి చెందిన ప్రముఖ బంగారు వ్యాపారి కుటుంబం లీజు అగ్రిమెంట్ పొందినట్టు తెలిసింది. అయితే ఈ లీజు అగ్రిమెంట్‌ను మార్పు ఆనందరావు ఇచ్చినట్టు నగరంలో ప్రచారం సాగుతుంది. ఇది మరీ విచిత్రమైన కథ.

న్యూ బ్రిడ్జి రోడ్డుకు ఆనించి సర్వే నంబర్ 716, 713లో గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తుంది. సర్వే నంబర్ 716 ప్రభుత్వ భూమిగా, 713 జిరాయితీ అంటూ టౌన్ సర్వే అధికారులు అర్జీదారులకు ఎండార్స్‌మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వాస్తవంగా 716, 713 రెండూ సర్వే నంబర్లులో ఉన్న భూమి ప్రభుత్వానికి చెందినట్టు సర్వే సెటిల్మెంట్ రికార్డుల్లో నమోదై ఉంది. ఈ రెండు స్థలాలకూ రెవెన్యూ రికార్డుల మేరకు యజమాని ప్రభుత్వమే అయి ఉండాలి. కాని ఈ రెండు సర్వే నంబర్లు ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో ఉన్నట్టు రికార్డులు తయారుచేసి, వాటిని లీజుకు ఇచ్చి నెలవారీ రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఇప్ప్పుడు అసలెవరో, కొసరెవరో తెలియని భూమికి బ్యాంకులు రుణాలివ్వడం ఒకెత్తయితే, కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్లు గోడ కూల్చేశారని టూటౌన్‌లో కేసు నమోదు కావడం మరొక ఎత్తు. అసలు ఈ భూమి ఎవరిదని తేల్చడం ఎవరితరం కాదు. ఎందుకంటే.. ప్రస్తుతానికిది పూర్తిగా సివిల్ మేటర్. నగరానికి నడిబొడ్డులో సెంటు కోటి రూపాయలకు పైగా విలువ చేసేది కావడం వల్ల పత్రాలు పట్టుకొని తిరుగుతున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎవరికైతే రాజకీయ పలుకుబడి, పోలీసుల అండ ఉందో, వారు లీజులకు ఇస్తున్నారు, ప్రహరీలు కడుతున్నారు. దోబీఘాట్‌గా ఒకప్ప్పుడు నాగావళి ఒడ్డున ప్రభుత్వం ఇచ్చిన ఈ భూమి క్రయవిక్రయాల ద్వారా చేతులు మారడం కంటే సర్వే నెంబర్లు తెలుసుకొని తహసీల్దార్ కార్యాలయాన్ని మేనేజ్ చేసి సృష్టించుకున్న పత్రాలు పొందినవారే ఎక్కువమంది ఉన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page