top of page

వారి త్యాగం ‘బంగారం’!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 5 hours ago
  • 2 min read
  •  దేశం కోసం దక్షిణ కొరియన్ల అద్భుత స్ఫూర్తి

  •  దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలన్న ఆర్తి

  •  పెళ్లి ఉంగరాలతో సహా ఇళ్లలో ఉన్న నగలన్నీ అప్పగింత

  •  మొత్తంగా 227 టన్నుల సువర్ణం అందజేత

  •  మనదేశంలో బంగారం కొనవద్దనడంపైనే భిన్నవాదనలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

దేశాల ఆర్థిక వ్యవస్థలు విదేశీ మారకద్రవ్యం, బంగారం నిల్వలపై ఆధారపడి ఉంటాయి. యుద్ధాలు వంటి అంతర్జాతీయ పరిణామాలు, దిగుమతి బిల్లులు పెరగడం వంటి కారణాలు ఈ నిల్వలను తీవ్రంగా ప్రభావితం చేసి ఆయా దేశాలా ఆర్థిక వ్యవస్థలను ఒడుదుడుకులకు గురిచేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నిల్వలు తరిగిపోయి సంక్షోభంలో చిక్కుకోవడం లేదా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి బంగారం నిల్వలను తాకట్టు పెట్టి విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తేవడం వంటి చర్యలతో గట్టేక్కేందుకు ఆయా దేశాల జాతీయ ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటాయి. గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితులను మనదేశం కూడా ఎదుర్కొన్నప్పుడు రెండు సందర్భాల్లో అప్పటి ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంకులో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నాయి. మళ్లీ ఈ ఏడాది పశ్చిమాసియాలో యుద్ధపరిస్థితుల్లో చమురు, బంగారం దిగుమతుల బిల్లు తడిసిమోపెడవుతుండటంతో ఈ సారి ప్రధాని నరేంద్రమోదీ నేరుగా ప్రజలకు అప్పీల్ చేశారు. కనీసం ఏడాదిపాటు బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రయత్నాలే గతంలోనూ జరిగాయి. 1960 దశకంలో చైనా, పాకిస్తాన్‌లతో వరుస యుద్ధాలు, కరువు పరిస్థితుల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుంది. దాంతో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది. దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువ కాగా.. వినియోగం మాత్రం చాలా ఎక్కువ. ఫలితంగా ప్రతి ఏటా బంగారం దిగుమతుల కోసం పెద్ద ఎత్తున విదేశీమారక ద్రవ్యం వెచ్చించాల్సి వస్తుంది. ఈ భారం తగ్గించుకునేందుకే నాడు గోల్డ్ కంట్రోల్ చట్టాన్ని తేవడంతోపాటు బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు విధించారు. కానీ ఆ చర్యలు పెద్దగా ఫలితాల నివ్వకపోగా బంగారం మార్కెటింగ్‌కు దారులు తెరిచినట్లయ్యింది. ఇప్పుడు మోదీ కూడా బంగారం కొనుగోళ్ల ఆపాలని ప్రత్యేకంగా పిలుపునివ్వడం ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నదానికి చర్చ జరుగుతోంది. మార్కెట్‌వర్గాలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. బంగారం కొనుగోళ్లు, దిగుమతులు తగ్గాయని కొందరు చెబుతుంటే.. దానికి మోదీ పిలుపు ఒక్కటే కారణం కాదని, గత ఏడాది కాలంలో బంగారం ధరలు జెట్ వేగంతో పెరగడం కూడా కొనుగోళ్లు తగ్గడానికి ముఖ్యకారణంగా నిలుస్తోందని అంటున్నారు. మన దేశ పాలకుల పిలుపునకు ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించడంలేదని గత, ప్రస్తుత ఉదంతాలు వెల్లడిస్తున్నాయి.

కొరియన్ ప్రజల త్యాగం

అయితే దీనికి భిన్నమైన స్పందన దక్షిణ కొరియాలో కనిపించి అబ్బురపర్చింది. భారత్‌లో సంక్షోభం తలెత్తిన సమయంలోనే.. అంటే 1990 దశకం చివరిలో దక్షిణ కొరియాను ఆర్థిక మాంధ్యం తీవ్రంగా దెబ్బతీసింది. ఆ కష్టసమయంలో అప్పుల కోసం దిక్కులు చూస్తున్న ప్రభుత్వానికి అక్కడి ప్రజలే పెద్ద అండగా నిలిచారు. అతిముఖ్యంగా భావించే పెళ్లి ఉంగరాలతో సహా తమ ఒంటి మీద ఉన్న బంగారు నగలను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేసి.. ఆర్థిక విపత్తు నుంచి దేశాన్ని గట్టెక్కిండంలో తమ వంతు బాధ్యత నిర్వర్తించారు. మÖడు దశాబ్దాల క్రితం 1997లో తలెత్తిన ఆసియా ఆర్థిక సంక్షోభం దక్షిణ కొరియాను తీవ్రంగా దెబ్బతీసింది. విదేశీ మారక నిల్వలు క్షీణించి పరిస్థితి చేయి దాటిపోతున్నది. దాన్నుంచి బయటపడేందుకు కొరియన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయం కోరింది. అప్పటికే చరిత్రలో అతిపెద్ద బెయిల్ అవుట్ ప్యాకేజీల్లో ఒకదాన్ని స్వీకరించాల్సి వచ్చింది. అటువంటి క్లిష్ట సమయంలో దక్షిణ కొరియా ప్రజలు చూపించిన స్ఫూర్తి ప్రపంచాన్ని విస్మయపరిచింది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఇళ్లలో ఉంచుకున్న బంగారాన్ని స్వచ్ఛందంగా అందించాలని ప్రజలను ప్రభుత్వం కోరింది. ఈ పిలుపునకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. 35 లక్షల మందికి పైగా ప్రజలు తమ పెళ్లి ఉంగరాలు సహా గొలుసులు, గాజులు, కుటుంబ వారసత్వ ఆభరణాలు, బంగారు నాణాలు, చివరకు ఒలింపిక్ పతకాలను కూడా ప్రభుత్వానికి అందజేశారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని ఇచ్చేందుకు ప్రజలు బ్యాంకుల ముందు బారులు తీరారు. ఫలితంగా నాలుగు నెలల్లోనే 227 టన్నుల బంగారం ప్రభుత్వ ఖజానాకు చేరింది. దీని విలువ అప్పటి లెక్కల ప్రకారం 2.1 బిలియన్ డాలర్లకుపైనే ఉంది. ఆ బంగారాన్ని ప్రభుత్వం కరిగించి అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించి, వచ్చిన నిధులతో విదేశీ రుణ భారం తగ్గించుకుంది. ఆ సమయంలో దక్షిణ కొరియా ప్రజల ఐక్యత, త్యాగం ఇతర దేశాల పెట్టుబడిదారులను విపరీతంగా ఆకర్షించాయి. దీన్నే ‘గోల్డ్ కలెక్షన్ మూవ్‌మెంట’ అని అప్పట్లో అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు అభివర్ణించాయి. ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప ప్రజా భాగస్వామ్య ఉద్యమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశం కోసం వ్యక్తిగత సంపదను త్యాగం చేయడానికి లక్షలాది మంది ముందుకు రావడం జాతీయ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఆ సంక్షోభం నుంచి దక్షిణ కొరియా వేగంగా కోలుకుని, కొద్ది సంవత్సరాల్లోనే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంది. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదిగింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page