ఇంతకీ ఆ స్థలం ఎవరిది?
- BAGADI NARAYANARAO

- 13 hours ago
- 2 min read
కొత్తబ్రిడ్జిని అనుకుని ఉన్న రెండు స్థలాలపై వివాదం
ప్రభుత్వ స్థలం ఆక్రమించారని ఆటోడ్రైవర్ల ఫిర్యాదు
గోడ కూల్చేశారని పక్క భూమి యజమానుల ఎదురు ఫిర్యాదు
అది కూడా ప్రభుత్వానిదేనన్న సరికొత్త వాదనలు
ఒకే భూమికి ఇద్దరు యజమానులు ఎలా?

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలోని అతి ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన డే అండ్ నైట్ జంక్షన్‌లో కొత్తబ్రిడ్జిని ఆనుకుని పక్కపక్కనే ఉన్న రెండు స్థలాలు ఓ పెద్ద భూవివాదానికి ఆజ్యం పోస్తున్నాయి. వాటిలో ఒక స్థలం ఎవరిదన్న వివాదం రాజుకుంటున్నది. బ్రిడ్జికి అనుకుని ఉన్న స్థలం ప్రభుత్వ పోరంబోకు భూమి అన్నది సుస్పష్టం. అందులో ఆ ప్రాంత ఆటోడ్రైవర్లు స్టాండ్ నిర్వహిస్తున్నారు. దీనికి ఎవరి అనుమతీ తీసుకోని ఆటో డ్రైవర్లు.. మరోవైపు ఆ ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని పక్క భూమి యజమానులు ఆక్రమించారని ఫిర్యాదు చేయగా తీగ లాగడంతో డొంకంతా కదులుతోంది. ఆ ప్రైవేటు భూమికి కూడా సొంతదారులుగా రెండు పార్టీలు తెరపైకి రాగా.. దానిపై ‘సత్యం’ ఆరా తీసినప్పుడు అసలు ప్రైవేటు ఆస్తిగా చెబుతున్న ఆ భూమి కూడా గతంలో దోబీఘాట్ నిర్వహణకు ఇచ్చిన ప్రభుత్వ భూమేనని తెలిసింది. మొత్తం మీద ఒక్క ఫిర్యాదుతో మొత్తం పుట్టంతా చెదిరిపోయి దాన్ని కబ్జా చేసిన, చేయడానికి ప్రయత్నిస్తున్న అవినీతి పాములు బయటకు వస్తున్నాయి.
ఆటోడ్రైవర్ల ఫిర్యాదుతో తెరపైకి
నగరంలోని కొత్తబ్రిడ్జికి ఆనుకుని ఉన్న సర్వే నెం.716లోని ప్రభుత్వ పోరంబోకు భూమి ఖాళీగా ఉండటాన్ని అవకాశంగా తీసుకుని డే అండ్ నైట్ జంక్షన్‌లో ఆటోలు నడుపుకునే కార్మికులు ఆ స్థలంలో కొన్నేళ్ల క్రితమే శ్రీలక్ష్మీ కనకదుర్గా ఆటో యÖనియన్ పేరుతో ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలానికి ఆనుకునే సర్వే నంబర్ 713/3 ఉంది. ఆ భూమి యజమానిగా చెప్పుకొంటున్న పూడి కోటేశ్వరరావు ‘వారాహి మెడికల్స’కు లీజుకు ఇచ్చారు. అయితే వారాహి మెడికల్స్ భవన నిర్మాణ సమయంలో సర్వే నెం.716లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని 24 అడుగుల మేరకు ఆక్రమించారని ఆ స్థలంలో ఆటోస్టాండ్ నిర్వహిస్తున్న డ్రైవర్లు ఫిర్యాదు చేశారు. ఆమేరకు గత ఏడాది అక్టోబర్`నవంబర్ నెలల్లోనే సర్వే చేసి 716 ప్రభుత్వ పోరంబోకేనని, అందులో 24 అడుగులు ఆక్రమణకు గురైనట్లు నిర్థారించారు. 713/3లో ఉన్న స్థలం తమదంటూ చెప్ప్పుకున్న కోటేశ్వరరావు తమ స్థలంలోనే ఆటోస్టాండ్ ఉందంటూ పోలీసులకు భార్యతో ఫిర్యాదు చేయించారు. దీంతో ఆటో డ్రైవర్లపై టూటౌన్‌లో క్రైమ్ నెం. 146/2025 కేసు నమోదు చేశారు. అసలు సర్వే నెం.713/3 ఎవరిదో తేల్చాలంటూ ఆటో డ్రైవర్లు కలెక్టర్ గ్రీవెన్స్‌ను ఆశ్రయించారు. జిరాయితీ భూమేనని పేర్కొన్నప్పటికీ దానికి యజమానులు మాత్రం ముందుగా చెప్ప్పుకున్నట్టు పూడి కోటేశ్వరరావు కాదని, ఆ స్థలం సోమవరపు రామస్వామి, గోరిశెట్టి చంద్రయ్యలని పేర్కొంటూ ఎండార్స్‌మెంట్ ఇవ్వడంతో మరో కొత్త వివాదానికి తెర లేచినట్లు అయ్యింది. యజమానుల సంగతి తేల్చకపోయినా.. రెండు స్థలాల వివాద పరిష్కారానికి పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో వాటి మధ్య గోడ నిర్మించారు. అయితే ఆ గోడను ఆటో డ్రైవర్లు కూల్చేశారంటూ కోటేశ్వరరావు భార్య పూడి ధనలక్ష్మి మళ్లీ ఫిర్యాదు చేశారు. దీంతో మళ్లీ ఆటోడ్రైవర్లపై అదే టూటౌన్‌లో కేసు (క్రైమ్ నెం. 100/2026) నమోదైంది. కానీ ఇందులో సర్వే నెంబరును 197లో కట్టిన గోడను డ్రైవర్లు కూల్చేశారని, అందుకే కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కోవడం విడ్డూరం.
అది కూడా ప్రభుత్వ భూమేనా?
ప్రభుత్వ పోరంబోకు అయిన సర్వే నెం.716లో 24 అడుగులు ఆక్రమణకు గురైందని అధికారులు నిర్థారించారు. దానికి పక్క భూమి అయిన సర్వే నెం.713/3లో భూమికి యజమానులుగా టూటౌన్‌కు ఫిర్యాదు ఇచ్చినవారు అసలు య్పుమానులు కారని సర్వే ఎండార్స్‌మెంట్ స్పష్టం చేసింది. ఇంతకీ ఆ స్థలం ఎవరిది? సెంటు కోటికి పైగా విలువ చేసే డే అండ్ నైట్ జంక్షన్‌లో దాదాపు 19 సెంట్ల స్థలం ఎవరిదన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఈ కథలో ఎవరు స్థలం ఆక్రమించుకున్నారు? ఎసఎలఆర్ ఎవరి పేరు మీద ఉంది? ఇప్పటికే కొంత స్థలం చేతులు మారడానికి కారకులెవరు? అసలు లింక్ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయి? వంటివి ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా, ప్రైవేటు భూమి అని పేర్కొంటున్న సర్వే నెం.713/3 కూడా ఒకప్పుడు ప్రభుత్వ భూమేనని చర్చ నడుస్తుంది. దోబీఘాట్ నిర్వాహణ కోసం సోమవారపు రామస్వామి, గోరిశెట్టి చంద్రయ్యలకు దఖలు పడినట్టు సర్వే ల్యాండ్ రికార్డుల్లో (ఎసఎలఆర్) నమోదై ఉన్నట్టు రెవెన్యూ అధికారులు ద్వారా తెలిసింది. ఈ లెక్కన సర్వే నెం.716, 713 భూములు రెండూ ప్రభుత్వ పోరంబోకులేనని పాతకాలంనాటి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే దశాబ్దాల క్రితం సర్వే నెం. 713/3లోని భూమి సోమవారపు రామస్వామి, గోరిశెట్టి చంద్రయ్యలకు దఖలు పడిన తర్వాత కొన్నాళ్లకు వారు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. దీంతో ఈ భూమికి వారసులమంటూ ఫోర్జరీ పత్రాలతో వీటిని అన్యాక్రాంతం చేస్తూ రెవెన్యూ రికార్డుల్లో కూడా మార్పులు జరిగిపోయాయని భోగట్టా. 716 ప్రభుత్వ భూమిలో 24 అడుగులు ఆక్రమించినందుకు చర్యలు తీసుకోవాలంటే ముందుగా 713/3 ఎవరిదో తేలాలి. అంతవరకు ఎవరు దోషులో, ఎవరు నిర్ధోషులో తెలియదు. ఇన్ని చిక్కుముడులను విప్పి అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత అధికారులదే.






Comments