న్యూజీలాండ్.. అవుతుందా న్యూఇండియా!
- DV RAMANA

- 2 days ago
- 2 min read
మినీ ఇండియాగా న్యూజీలాండ్!
శరవేగంగా పెరుగుతున్న భారతీయ సంతతి
అక్కడ జన్మిస్తున్న ప్రతి 8మందిలో ఒకరు ఇండియనే
యువతరాన్ని బాగా ఆకర్షిస్తున్న చిన్న దేశం
వలస వెళ్లి స్థిరపడుతున్నవారే అధికం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
ఉపాధి అవకాశాలు, వలసలు.. దేశాలు, ప్రాంతాల సహజ స్వరూపాన్ని మార్చేయడం సహజ పరిణామ క్రమం. అత్యధిక జనాభా కలిగిన భారతదేశం నుంచి ప్రతి ఏటా వందలు, వేల మంది ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడుతుంటారు. దానికి అసలు సిసలు ఉదాహరణగా కెనడాను పేర్కొనవచ్చు. మనదేశం నుంచి పంజాబీలు అధికసంఖ్యలో కెనడాకు తరలిపోయి స్థిరపడుతున్నారు. అందువల్ల ఆ దేశాన్ని మినీ పంజాబ్ అని వ్యవహరిస్తుంటారు. అలాగే అమెరికాలోని పిట్స్‌బర్గ్, డల్లాస్ వంటి నగరాల్లో భారతీయ జనాభా గణనీయంగా పెరుగుతోంది. ఇలాగే కొనసాగితే కొంతకాలానికి స్థానికులు మైనారిటీలుగా, వలస వచ్చినవారు మెజారిటీ వర్గంగా మారే పరిస్థితులు ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి పరిణామం ఇప్పటికే న్యూజీలాండ్‌లో కనిపిస్తున్నది. కొన్నేళ్లుగా భారత్ నుంచి ఈ చిన్న దేశానికి వలసలు పెరుగుతున్నాయి. విద్య, ఉద్యోగాలు, ఇతర వ్యాపకాల పేరుతో ఇండియా నుంచి ఈ దేశానికి ఏటా పెద్దసంఖ్యలో ప్రజలు వలస వెళ్తున్నారు. అలా వెళ్లినవారు అక్కడే స్థిరపడిపోతున్నారు. ఇప్పటికే పెళ్లయినవారు కుటుంబంతో సహా న్యూజీలాండ్‌కు వెళ్లిపోతుంటే.. యువత పెళ్లిళ్లు ఇక్కడే చేసుకున్నా.. భార్యలను తీసుకెళ్లి అక్కడే కాపురాలు పెడుతున్నారు. అక్కడే పిల్లలను కనడం, చదివించడం, జీవితంలో స్థిరపడేలా చేస్తుండటంతో న్యూజీలాండ్‌లో భారతీయుల సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నది. దాంతో న్యూజీలాండ్ కాస్త న్యూ ఇండియాగా మారిపోతున్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపిస్తున్నది.
నాలుగు రెట్ల పెరుగుదల
స్టాటిస్టిక్స్ న్యూజీలాండ్ సంస్థ విడుదల చేసిన అధికారిక జనన నమోదు గణాంకాల ప్రకారం ఆ దేశంలో పుట్టిన ప్రతి ఎనిమిది మంది శిశువుల్లో ఒకరి తల్లి భారతీయ మహిళ కావడం విశేషం. అక్కడ యూరోపియన్ మూలాలు కలిగిన జనాభాతో పోల్చితే భారత సంతతి జనాభా వేగంగా పెరిగిపోతున్నదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం మనదేశం నుంచి ఏటేటా వలసలు పెరుగుతుండటమే కాకుండా అక్కడి భారతీయుల సంతానోత్పత్తి పెరుగుతుండటం కూడా కారణమని అంటున్నారు. 2008 నుంచి న్యూజీలాండ్‌లో జననాల గణాంకాలు పరిశీలిస్తే భారతీయుల వాటా నాలుగు రెట్లకుపైగా పెరిగినట్లు తెలిసింది. గత రెండు దశాబ్దాలుగా భారతీయ మహిళలకు పుట్టిన పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2008లో 2.8 శాతంగా ఉన్న భారతీయ సంతతి వృద్ధి రేటు 2012లో 3.5 శాతానికి, 2016లో 5.5 శాతానికి, 2020లో 7.9 శాతానికి, 2024లో 12.4 శాతానికి పెరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంటే 16 ఏళ్ల వ్యవధిలో భారత సంతతి జననాల వృద్ధి రేటు సుమారు నాలుగు రెట్లు పెరిగినట్లు అంచనా. న్యూజీలాండ్‌లో భారతీయుల జనాభా పెరగటానికి కారణాలో మొదటిది వలసలు కాగా.. అక్కడ ఉంటున్న ఇండియన్స్ వయసు చాలా తక్కువగా ఉండటం మరో కారణం. అంటే భారత్ నుంచి ఎక్కువగా యువతరమే అక్కడికి వలస వెళ్లి, సెటిల్ అవుతుండటంతో.. సంతానోత్పత్తి, జననాý రేటులో ఇండియన్సే ఎక్కువగా ముందుంటున్నారు. ఫలితంగా స్థానిక న్యూజీలాండ్ ప్రజలతో పోల్చితే భారతీయ సంతతి ప్రాబల్యం పెరుగుతోంది. గత రెండు దశాబ్దాల్లో న్యూజీలాండ్‌కు వలస వచ్చిన వారిలో యువతరంవారే అధికంగా ఉండటం, అదే సమయంలో న్యూజిలాండ్‌లో ఉన్న యూరోపియన్ మూలాలు కలిగిన జనాభాలో అధికశాతం వయసు పైబడిన వారు కావడం వల్ల సహజంగానే ఇండియన్స్‌లో సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటున్నట్లు విశ్లేషిస్తున్నారు.
విస్తరిస్తున్న భారతీయ సమాజాలు
ఆక్లాండ్, హామిల్టన్, వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్ తదితర న్యూజీలాండ్ నగరాల్లో భారతీయ సమÖహాలు బాగా పెరిగాయి. భారత్ నుంచి వచ్చిన మెజారిటీ కుటుంబాలు అక్కడే శాశ్వతంగా స్థిరపడటానికి మొగ్గు చూపుతున్నాయి. అక్కడి ప్రశాంతత, ప్రకృతి రమణీయత, శాంతిభద్రతల సమస్య లేకపోవడం, ఉపాధి అవకాశాలు భారతీయ యువతను ఆకర్షిస్తున్నాయి. న్యూజీలాండ్ జాతీయ సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు సుమారు 1.5-1.6 జననాలకు పడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో నివసిస్తున్న వివిధ జాతుల ప్రజల్లో సంతానోత్పత్తి తగ్గిపోవటం ఆందోళనకరమైన అంశంగా మారింది. ముఖ్యంగా రష్యా, జపాన్, న్యూజీలాండ్ తదితర దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అదే సమయంలో ఇండియన్స్ సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉండటం ప్రస్తుతం న్యూజీలాండ్‌లో మనోళ్ల సంఖ్య పెరగటానికి ముఖ్య కారణంగా మారింది. అక్కడ పెరుగుతున్న భారతీయ జనాభా ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ, సమాచార సాంకేతికత, విద్య, రిటైల్, వ్యాపార రంగాల్లో ప్రముఖ స్థానం సంపాదిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారతీయ సమాజం పెరుగుతున్న సరళిని పరిశీలిస్తే న్యూజీలాండ్‌లో ఇండియన్స్ మెజారిటీ స్థాయికి చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చని సామాజిక అధ్యయన నిపుణులు అంచనా వేస్తున్నారు.






Comments