top of page

అద్దెకో బాయ్‌ఫ్రెండ్! కాలక్షేపానికే సుమా!!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 3 min read
  • సినిమా, షాపింగ్.. దేనికైనా తోడుగా

  • పనిని బట్టి గంటలు, రోజుల లెక్కన ఛార్జీలు

  • నగరాల్లోని యువతులు, మహిళలే వినియోగదారులు

  • జపాన్‌లో పుట్టి ఇండియాలో ప్రవేశించిన కొత్త సంస్కృతి

  • ఆన్‌లైన్ వేదికగా శరవేగంగా విస్తరిస్తున్న పెయిడ్ ‘సేవ’

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ఓ యువతి కో పార్టనర్ అనే వెబ్‌సైట్ ద్వారా ఒక బాయ్‌ఫ్రెండ్‌ను బుక్ చేసుకుంది. ఇద్దరూ ఒకచోట కలుసుకుని అక్కడి నుంచి షాపింగ్ మాల్‌కు వెళ్లారు. షాపింగ్ చేయడంలో ఆ అద్దె బాయ్‌ఫ్రెండ్ ఆమెకు చాలా సాయపడ్డాడు. ఆమె బ్యాగులన్నీ అతనే మోశాడు. అంతే కాదండో.. తన పాత లవర్ గురించి చెప్తూ ఎమోషనల్ అయిన ఆమెను ఓదార్చాడు. బాధ మర్చిపోయేలా చేయడానికి, నవ్వించడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. సమయం ముగిసిన తర్వాత ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. అద్దెకు బాయ్‌ఫ్రెండ్లు కూడా లభించే కాలం వచ్చేసిందనడానికి ఇదో ఉదాహరణ.

పాత సినిమాల్లో చివరి దశలో ఉన్న తండ్రి పాత్రధారి కూతురి పెళ్లి చేయాలని తహతహలాడిపోతుంటాడు. అంగీకరించని కూతురికి ఒక షరతు విధిస్తాడు. పెళ్లి చేసుకుంటేనే ఆస్తి ఆమెకు రాస్తానని.. లేకపోతే లేదని పీక మీద కత్తి పెడతాడు. దాంతో ఆస్తి పోతుందన్న భయంతో ఆమె ఒక కుర్రాడితో తాత్కాలికంగా భర్తగానో, ప్రియుడిగానో నటించేలా ఒప్పించి తండ్రి వద్దకు తీసుకొస్తుంది. ఇది కూడా అద్దెకు బాయ్‌ఫ్రెండును తెచ్చుకోవడంలాంటిదేనని భావించవచ్చు. ఆ తరం నుంచి ఇప్పటివరకు బాయ్‌ఫ్రెండ్ అంటే ఒకరకమైన భావన ఉండేది. ఏదో తప్పు చేస్తున్నారని కుటుంబం, సమాజం కూడా భావించేవారు. ఇప్పుడు అద్దెకు బాయ్ ఫ్రెండ్ అన్న కాన్సెప్ట్ చూసినా కూడా అదే భావం స్ఫురిస్తుంది. కానీ మొదట పేర్కొన్న ఉదంతాన్ని కాస్త నిశితంగా చూస్తే.. ఈ తరం యువత బాయ్‌ఫ్రెండ్ అన్న పదానికి నిర్వచనాన్ని మార్చేసినట్లు స్పష్టమవుతుంది. ఒంటరితనాన్ని దూరం చేసే ఒక తోడు కోసమే యువతరం అర్రులు చాస్తున్నది. దీనికి మన కుటుంబ వ్యవస్థ మారిపోవడమే ప్రధాన కారణం అని చెప్పాలి. పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు ఒంటరితనం అనే ప్రశ్నే ఉత్పన్నం అయ్యేది కాదు. కానీ కాలం మారింది. చిన్న కుటుంబాలు వచ్చాయి. అందులోనూ తెల్లవారితే చాలు.. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతుంటారు. దాంతో యువతే కాకుండా, మధ్య వయస్కులు, వృద్ధులు కూడా చాలా సందర్భాల్లో ఒంటరితనం అనుభవించాల్సి వస్తున్నది. దాన్నుంచే బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు తెచ్చుకునే కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చింది. షాపింగ్ చేయడానికి, షికారుకు వెళ్లడానికి, కాలక్షేపానికి ఇలా రకరకాల అవసరాలకు బాయ్‌ఫ్రెండ్‌లను అద్దెకు ఇచ్చే వెబ్‌సైట్లు విదేశాలతోపాటు మన దేశంలోకి కూడా అడుగుపెట్టాయి.

జపాన్‌లో పుట్టుకొచ్చిన సంస్కృతి

సినిమాకు వెళ్లాలనిపిస్తుంది. కానీ ఒంటరిగా వెళ్లి రెండు గంటలకుపైగా కూర్చోవడం బోర్ కొడుతుంది. అలాంటప్పుడు కలిసి సినిమా చూడటానికే బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు తెచ్చుకోవచ్చు. షికారుకు వెళ్లేటప్పుడు వెంట మరొకరు ఉంటే కాలక్షేపం బాగా అవుతుందని భావిస్తే.. ఆ అవసరం తీర్చడానికీ ఈ బాయ్‌ఫ్రెండ్స్ అక్కరకు వస్తారు. ఇలా ఒకటేమిటి.. ఏ సమయంలో.. ఏ అవసరానికైతే ఒక తోడు కావాలనుకున్నప్పుడు.. కోరినంత డబ్బులు ఇస్తే చాలా బాయ్‌ ఫ్రెండ్స్ అందుబాటులో ఉంటున్నారు. మీ అవసరాన్ని, ఎంచుకునే సమయాన్ని బట్టి గంటకు లేదా రోజు లెక్కన ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు జపాన్‌కు పరిమితమైన ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మనదేశంలోనూ వేళ్లూనుకుంటున్నది. రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్స్ కాన్సెప్ట్ 90వ దశకంలోనే జపాన్‌లో అంకురించింది. వ్యక్తిగత జీవితంలో ఎవరూ అందుబాటులో లేనప్పుడు ఒంటరిగా వెళ్లడం ఇష్టం లేనప్పుడు కొద్ది గంటలపాటు ఒక వ్యక్తిని అద్దెకు తీసుకోవడం అప్పట్లోనే జపాన్‌లో ప్రారంభమైంది. బ్రేకప్ చెప్పినప్పుడ తమ మనసులో భావాలను వేరొకరితో పంచుకోవాలన్నా ఇలాంటి సేవలను వినియోగించుకునేవారు. దీనికి మంచి ఆదరణ లభించడంతో 2010లో రెంట్ ఏ గర్ల్‌ఫ్రెండ్ కాన్సెప్ట్ కూడా మొదలైంది.

సేవ, సమయం బట్టి రేటు

జపాన్‌లో ఈ తరహా సేవలకు ఆదరణ లభించడానికి ఆ దేశప్రజల జీవనశైలే కారణం. రోజులో ఎక్కువసేపు పనిలో నిమగ్నం కావడం, ఒంటరిగా జీవించడం, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదనే భావనల కారణంగా చాలామంది తమ మనోభావాలను అపరిచితులతో పంచుకునేందుకే ఇలాంటి సేవలను ఎంచుకుంటున్నారు. జపాన్‌లో ఇలాంటి సేవలకు రూ.1700 నుంచి రూ.3500 (భారతీయ కరెన్సీ ప్రకారం) వరకు ఛార్జి చేస్తున్నారు. భోజనం, రవాణా, ఇతర ఖర్చులు కలిస్తే ఇంకా పెరుగుతుంది. నెలకు సగటున పదిమంది కస్టమర్ల వరకు వస్తుంటారని అద్దె బాయ్‌ఫ్రెండ్స్ చెబుతున్నారు. తమ కస్టమర్లలో అధికశాతం మంది యÖనివర్సిటీ విద్యార్థినులు, విడాకులు తీసుకున్న మహిళలు ఉంటున్నారు. కాగా చాలామంది దీన్ని ఒక కొత్త అనుభవంలా ఆస్వాదిస్తున్నారు. ఈ సంస్కృతి జపాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించింది. కో పార్టనర్ అనే వెబ్‌సైట్ తనను తాను ప్రొఫెషనల్ సోషల్ సపోర్ట్ సర్వీస్ ప్లాట్‌పారంగా పేర్కొంటున్నది. హాంగ్ అవుట్ కోసమైతే గంటకు రూ.1500.. క్లబ్బింగ్, మÖవీ పార్టనర్, షాపింగ్ బడ్డీ, మెడికల్ సపోర్ట్ వంటి సేవలకు గంటకు రూ.2వేలు వసూలు చేస్తున్నారు. నెల్ అనే పేరుతో ఉన్న మరో ఆన్‌లైన్ ప్లాట్‌పారంలో ఉద్యోగాల వెబ్‌సైట్ మాదిరిగా అద్దె బాయ్‌ప్రెండ్‌గా పనిచేయాలనుకునేవారు తమ ప్రొఫైల్స్‌ను అప్‌లోడ్ చేసి ఏ తరహా కంపానియన్ సేవలు అందించగలమో పేర్కొనాల్సి ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ట్రెండ్ మరింత క్రేజీగా మారింది. రెంట్ యువర్ ఓన్ బాయ్‌ఫ్రెండ్ ఇండియా అనే ఇన్‌స్టా పేజీకి పదివేలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. కాఫీ డేట్లు, కార్ సెల్ఫీలు వంటి సేవలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. పెద్ద పట్టణాలు, నగరాలకు చెందిన 20 ఏళ్లు దాటిన యువతులు, మహిళలు ఈ సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నట్లు తెలిసింది. కాగా ఆదాయం కోసమే ఈ సేవల రంగంలోకి వస్తున్నామని అద్దె బాయ్‌ఫ్రెండ్స్‌గా వ్యవహరిస్తున్నవారు చెబుతున్నారు. వ్యక్తిగత సంరక్షణ, సమయపాలన, మంచి COMMUNICATION స్కిల్స్, ఎదుటివారిని సౌకర్యంగా ఉంచగలిగే సామర్థ్యం, మనస్తత్వం ఉన్నవారికి ఎక్కువ అవకాశాలు లభిస్తుంటాయని ఈ వెబ్‌సైట్ల నిర్వాహకులు చెబుతున్నారు. మనదేశంలో అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్ విధానం ఇంకా వ్యవస్థీకృతం కాలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి నియంత్రణలు, మార్గదర్శకాలు కూడా లేవు. అయితే కాలక్రమంలో ఇది పెద్ద వ్యాపారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page