top of page

“ఏకాంత వేళ.. ఏకాంత సేవ...”

  • Guest Writer
  • 5 hours ago
  • 3 min read

1985లో వచ్చిన అన్వేషణ సినిమాలో ఇళైయరాజా చేసిన పాట “ఏకాంత వేళ.. ఏకాంత సేవ...” అర్ధ శతాబ్ది ఇళైయరాజా (ఇళయరాజా అనడం సరికాదు) సినిమా పాట. ఔను ఇళైయరాజా సినిమా పాటకు యాబైయేళ్లు.

1976 మే 14న అణ్ణక్కిళి సినిమా విడుదలైంది. ఇళైయరాజా పాటకు తొలి సినిమా ఆ అణ్ణక్కిళి. (తెలుగులో రామచిలుక సినిమా) ఇళైయరాజా ప్రభంజనం మొదలై ఇవాళ్టికి యాబైయేళ్లయింది. ‘ఇళైయారాజా పాట’ శీర్షికన నేను ఆయన పలు పాటలపై రాశాను. ఇళైయరాజా గురించి పత్రికా రచన చేశాను. వీడియోలు చేశాను. బహుశా తెలుగులో ఇళైయరాజా గురించి నేను చెప్పినంతగా మరొకరు చెప్పలేదేమో?

విశేష సంగీతజ్ఞత, సృజనాత్మకత, విశేషమైన చింతన, ప్రౌఢత్వం, ప్రజ్ఞ, తెలివిడి, లోకజ్ఞానం, ప్రతిభ, పనితనం, సౌందర్యజ్ఞతతో ఎన్నెన్నో పాటలు చేశారు ఇళైయారాజా. దేశంలోని గొప్ప సంగీత దర్శకుల్ని సైతం విస్మయపరిచారు ఇళైయరాజా. నొ(నౌ)షాద్ స్వయంగా “నేను ఇళైయరాజా నుండి నేర్చుకోవాలి” అని బహిరంగంగా అన్నారు. ఒక సందర్భంలో తనకు సహాయకుడిగా పనిచేసిన ఇళైయరాజాను గమనించి సలిల్ చౌధరీ “ఇతడు భవిష్యత్తులో గొప్ప సంగీతం ఇవ్వనున్నాడు” అన్నారు. ఒక పాట రికార్డింగ్ సందర్భంలో ఇళైయరాజా పనితీరును గమనించి ఆర్.డీ. బర్మన్ ఆశ్చర్యపోయారు.

ఇళైయరాజా పాటకు ఒక మదపుటేనుగు అణిగిపోయేది. ఏనుగుల గుంపు సినిమా హాల్ దగ్గరకు వచ్చి ఇళైయరాజా పాట వినేది. ఒక వ్యక్తి ప్రాణాలను నిలబెట్టింది ఇళైయరాజా పాట.

భారతదేశం పాటలో, సంగీతంలో ఇళైయరాజా చేపట్టినన్ని అంశాలు మరెవ్వరూ అందివ్వలేదు. సింపనీ చేసి భారతదేశం కూడా సింపనీ సృష్టించగలదు అని అంతర్జాతీయంగా ఆశ్చర్యపరిచారు ఇళైయారాజా. కర్ణాటక సంగీతం, వెస్టన్ సంగీతం, జానపదం సంగీతం ఈ మూడిటినీ ఇళైయరాజా అంత గొప్పగా, లోతుగా, విశాలంగా దేశంలో మరో సంగీత దర్శకుడు ప్రయోగించ లేదు, ప్రయుక్తం చెయ్యలేదు.

ఇళైయరాజా మరో గొప్పతనం ఏమిటి? ఆయన తన కులాన్ని వదిలేసుకున్నారు! ఇది చాల గొప్ప విషయం. యాభై ఏళ్ల క్రితమే ఇళైయరాజా తన కులం అన్నదాన్ని వదిలేసుకున్నారు!

35 మార్కుల మనిషిగా కాకుండా 100 మార్కుల మనిషిగా బతుకుతున్నారు ఇళైయరాజా! ‘రిజర్వేషన్ వ్యక్తి కాదు.. ఇళైయరాజా రెవరెన్షల్ వ్యక్తి!’

కుల రాహిత్య జీవనం విషయంగా మనదేశంలోని ‘కులగ్రస్థుల’కు ఇళైయారాజా కనువిప్పు. మరో గొప్ప విషయం ఆయన భారతీయత. మనదేశంలోని ‘మతగ్రస్థుల’కు భారతీయతతో, సాంప్రదాయికతతో ఇళైయరాజా ఒక విజేత అయిన వాస్తవం ఒక చరిత్ర.

పరమ నాస్తికత్వం నుంచి, ‘బతుకు తెరువు కమ్యూనిజమ’ నుంచి ‘బుద్ధితో’ బయటపడి ఆస్తికత్వంతో, శుచితో, శుభ్రతతో గొప్ప కళాకారుడు అయ్యారు ఇళైయరాజా. ఇవాళ్టికీ ఆయన రికార్డింగ్ ధియేటర్ వాకిట్లో ‘ముగ్గు’ ఉంటుంది.

మన దేశంలో కులగ్రస్థులు, మతగ్రస్థులు సృష్టించలేని సంపదను తన ప్రతిభతో, తన తీరులో, తన పనితనంతో సృష్టించగలిగారు ఇళైయరాజా. పండితుల్ని, పామరుల్ని మెప్పించారు ఇళైయరాజా.

“ఏకాంత వేళ.. ఏకాంత సేవ...” పాట ఒక్క ఇళైయారాజాకు మాత్రమే స్ఫురించగల పాట. పాట తీరు, పాట నిర్మాణం ప్రత్యేకంగా ఉంటాయి. శ్రావ్యతకు శ్రావ్యత, కొత్తదానానికి కొత్తదనం, ఇంపుకు ఇంపు, సొంపుకు సొంపు వీటితో ఈ పాట ఒక విశేషమైన పాట. 1985 నాటికే కాదు ఈనాటికీ తెలుగు వాళ్లైన సంగీత దర్శకుల నుంచి ఇలాంటి తెలుగు పాట రాలేదు.

పాట పరిచయ సంగీతం నుంచీ, పల్లవి, రితమ్ (రిథమ్ కాదు), మధ్య సంగీత కూర్పు, చరణాలు అన్నింటా ఈ పాట ప్రశస్తమైన పాట.

ఇది 100 మార్కుల పాటా? ఈ పాట 100 మార్కుల పాట కాదు.. మరి? ఈ పాట 100 మార్కులు అన్న స్థితికి మించిన పాట.

కొన్నిటికి విలువకట్టడం, కొన్నిటిపై చర్చలు చెయ్యడం, అభిప్రాయపడడం తప్పవుతుంది. వివరణలు, విశ్లేషణలు చెయ్యడం కన్నా ఈ పాట విషయంలో సూటిగానూ, నేరుగానూ ఆస్వాదనలోకి వెళ్లిపోవడం సరైంది అవుతుంది. దర్శకుడు వంశీ ఈ పాటను తన శైలిలో గొప్పగా చిత్రీకరించారు. వంశీ దర్శకుడు కాబట్టే ఇళైయరాజా ఈ స్థాయి పాటను ఇచ్చారేమో? వినడానికే కాదు చూడడానికి కూడా ఈ పాట కొత్త అనుభూతిని ఇస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి పాడారు. వాళ్లు మాత్రమే పాడగల గొప్పగా పాడారు. అలరైన పాట అలరించే పాట.. “ఏకాంత వేళ.. ఏకాంత సేవ...” పాట.

- రోచిష్మాన్

9444012279

పాట కట్టాలంటే అంత తేలికేం కాదు...

పాట కట్టాలంటే అంత తేలికేం కాదు... సిట్యుయేషన్ అర్ధం చేసుకోవాల.. డైరక్టరుగారికి ఏం కావాలో ఎలా కావాలో తెల్సుకోవాల... అప్పుడు కవిగారితో కూర్చోవాల... ఇక్కడే మహదేవన్ ప్రత్యేకత... ముందు కవిగారిని రాసేయమనండి... అప్పుడే ట్యూను కడదాం... అలా చేసినప్పుడే సరస్పతికి సరైన గౌరవం ఇచ్చినట్టు అనేవారాయన.

ఇక ట్యూను కట్టేసిన తర్వాత అది పాడుతున్న సింగరుకు సౌకర్యవంతంగా ఉందా లేదా అనేది కూడా చూసుకునేవాడాయన. తనతో పనిచేసే ప్రతి ఒక్కరూ కంఫర్ట్ జోన్ లో ఉంటేనే మంచి ఔట్ పుట్ వస్తుందని బలంగా నమ్మేవారు. అందుకే ఆయన పుహళేందిని తన తోటి సంగీత దర్శకుడుగానే చూసేవారు తప్ప సహాయకుడుగా కాదు. అలా చూసినందుకు శంకరాభరణం నిర్మాతతో మరో సినిమాకు పని చేయడానికి ఆయన అంగీకరించలేదు.

రచయిత ఎంత కష్టపడి ఎంత ఆవేశంగా ఏం రాసినా దాన్ని ట్యూనులోకి తీసుకొచ్చి మరింత అర్ధవంతంగా తీర్చిదిద్దడం తన బాధ్యత అనుకునేవారాయన. దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం.. మనిషి అనేవాడున్నాడా అని దేవుడికొచ్చెను అనుమానం.. అని ఆత్రేయ ఆవేశపడ్డా... ఇది కవిత్వమా? ట్యూనుకు ఒదుగుద్దా అని అనుమానం పడ్డ ఆదుర్తి అనుమానాన్ని పటాపంచలు చేసి హిట్టు పాటగా మార్చిన వాడు మహదేవను.

స్వరం కట్టేప్పుడు వేసిన సంగతులు గాయకుడ్ని ఇబ్బంది పెడుతున్నాయని అనిపిస్తే చాలు తక్షణం దాన్ని మార్పు చేసి ఇలా పాడేయండి హాయిగా అని చెప్పి పని నడిపించేయగల సహృదయుడాయన. నెమ్మదిగా ఉండాల... ప్రశాంతంగా ఉండాల... ఆందోళన పడరాదు... అప్పుడే కళ పండుద్ది అని నమ్మిన కళాజీవి ఆయన.

శివం అనే ఓ సంగీత కళాకారుడు తిరువనంతపురానికి చెందిన ఓ నాటక సంగీత దర్శకుడ్ని తీసుకొచ్చి ఇతని పేరు పుహళేంది... అని పరిచయం చేయగానే తన స్నేహబంధంలోకి తీసేసుకున్నారాయన్ని.

అసలు పేరు వేలప్పన్ నాయర్ అయినా తనకు నచ్చిన కవి పేరును తన పేరుగా పెట్టేసుకోవడం పుహళేందిలో ఆయనకు నచ్చిన లక్షణం. అలా మొదలైన బంధం... 250 సినిమాలకు విస్తరించింది.

పుహళేందే తనను రికార్డింగు థియేటర్‌కు తీసుకురావాలి.. పుహళేందే తనను ఇంటి దగ్గర దింపాలి.. పాట ట్యూను కట్టేప్పుడు ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారో తెలియదుగానీ రికార్డింగు థియేటర్ కు వచ్చాక వారిద్దరి మధ్యా చాలా అరుదుగా మాటలు నడిచేవి. దాదాపు కళ్లతోనే మాట్లాడుకునేవారని నాటి గాయకులు చెప్తారు. ఒకరి మనసు ఒకరికి పూర్తిగా తెల్సినప్పుడు మాటలెందుకు మధ్యలో అన్నారట వెనకటికెవరో అలాన్నమాట ...

మామూలుగా నాగిరెడ్డి చక్రపాణి అంటే ఒక్కరే అనుకున్నాం అనేవాళ్లు మనకు తగుల్దారు... బాపు రమణల్లాగా... అయితే మామా అప్పూ కూడా అంతే ... పుహళేందిని మహదేవన్ అప్పూ అనే పిల్చేవారు.

రికార్డింగ్ థియేటర్‌లో మహదేవన్ జస్ట్ అలా కూర్చుని అబ్జర్వ్ చేయడమే ... సింగర్స్‌కు పాట నేర్పించడం దగ్గర నుంచీ ఆర్కెస్ట్రా కండక్ట్ చేయడం వరకూ అన్నీ పుహళేందే చూసుకునేవారు. కానీ అడుగడుగునా మామ కళ్లల్లోకి చూడడం ఆయన ఆమోద ముద్రతోనే పనులు నడిపించడం సాగేది. ఈ సమన్వయం వారిద్దరినీ బాగా ఎరిగిన వారికే అవగతమయ్యేది తప్ప అన్యులకు కుదిరే పని కాదు. అలా.. వీరిద్దరూ కల్సి ఓ పాటకు స్వరం కడుతున్న సందర్భం... మీ కళ్ల ముందు పెడుతున్నా... అందుకోసం ఇదంతా చెప్పాను తప్ప మీకు తెలియదని కాదు...ఈ ఫోటోలో... బాల సుబ్బరమన్నెం ముందు హార్మోనియం పెట్టుక్కూర్చున్న కుర్రాడే అప్పు అంటే...

- రంగావర్జుల భరద్వాజ

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page