ఏడిస్తే సినిమాలు చూస్తారా?
- Guest Writer
- Sep 4, 2025
- 3 min read

సినిమాలు తీస్తే చూడరు. చూసేలా తీస్తే చూస్తారు. ఈ సత్యం తెలియక ఒక దర్శకుడు ఏడుస్తూ, తనని తాను చెప్పుతో కొట్టుకున్నాడు. ఈ వీడియో ఇపుడు వైరల్. ఆ సినిమా త్రిబాణధారి బార్భరిక్, దర్శకుడి పేరు మోహన్ శ్రీవత్స.
ఈ పేరు చూస్తే అది ఏ భాష చిత్రమో అర్థమవుతుందా? పేరును బట్టి పౌరాణిక సినిమా అనుకుంటారు. పోస్టర్లు చూస్తే సోషల్ మూవీ. తెలుగు కాకుండా మిగతా భాషల్లో కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారట. రెండున్నరేళ్లు కష్టపడి తీస్తే థియేటర్‌లో కనీసం పది మంది కూడా లేరని దర్శకుడి ఏడుపు. ఆయన అమాయకత్వాన్ని చూస్తే నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు.
సినిమా మాత్రమే వినోదంగా ఉన్న కాలంలో ఎంత డొక్కు సినిమాకైనా ప్రేక్షకులు వచ్చేవాళ్లు. ప్లాప్ అయినా బి, సి సెంటర్లలో ఎంతోకొంత డబ్బులిచ్చేవి. వినోదం ఇంట్లోకి , ఫోన్‌లోకి వచ్చేసిన తర్వాత థియేటర్‌తో అవసరం పోయింది. దీన్ని బ్రేక్ చేసి థియేటర్‌కి రప్పించాలంటే పెద్ద స్టార్స్ వుండాలి. విషయం లేకపోతే స్టార్స్ ఉన్నా మొదటి మూడు రోజుల కలెక్షన్ మాత్రమే. సోమవారం ఈగలు తోలుకోవాల్సిందే. ఇక చిన్న హీరోల సినిమాలకి విపరీతమైన బజ్, పబ్లిసిటీ వుంటే సగం హాలు నిండుతుంది. బాగలేకపోతే సాయంత్రానికి ఖాళీ.
ట్రెండ్ ఇలా వుంటే మన శ్రీవత్స త్రిబాణధారిని వదిలాడు. నితిన్, వరుణ్‌తేజ్ లాంటి హీరోలే జనాన్ని రప్పించలేకపోతే, ఇక సత్యరాజ్‌ని చూసి ఎందుకొస్తారు? టైటిల్ అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదివుండాలి. భీముడి మనుమడు, ఘటోత్కచుడి కొడుకు అంటే ఎవరికి తెలుస్తుంది? పురాణాల్ని మిక్స్ చేయడం హిట్ ఫార్ములా అనుకుంటే ఎట్లా? సినిమాలో ఆ జర్నీ వుండాలి కదా.
జానర్ చూస్తే రివేంజ్ డ్రామా. ఓటీటీలో కోకొల్లలున్నాయి. అంతకు మించి తీయగలిగితే ప్రేక్షకుడు నమ్ముతాడు, వస్తాడు. మీ బుర్రలో పుట్టిన ఏదో ఐడియాని లాగించేసి, డబ్బులిచ్చి రెండు గంటలు కూచోమంటే ప్రేక్షకుడు మీలా అమాయకుడా? ఫ్రీగా కూచునే పరిస్థితిలో కూడా లేడు.
టికెట్ ధరలు , పాప్‌కార్న్ ఖరీదు, ప్రయాణ దూరం అన్నీ కలిసి ప్రేక్షకున్ని థియేటర్‌కి దూరం చూసి చాలా కాలమైంది. మూడు కాదు కదా 30 బాణాలు వేసినా అతనిలో చలనం రాదు. కాంతారా, నరసింహ అవతార్‌లాగా పూనకం తెప్పిస్తే తప్ప రాడు.
సినిమా ఎప్పుడూ జూదమే. మంచి ముక్కలు పడినంత మాత్రాన షో చూపించలేం. చాలా కలసిరావాలి. వినాయక ఉత్సవాల సందడిలో జనం మునిగి వుంటే , చడీచప్పుడు లేకుండా సినిమా విడుదల చేసి ప్రేక్షకులు రాలేదని కన్నీళ్లు పెడితే యూట్యూబ్ వ్యూస్ పెరుగుతాయి తప్ప కలెక్షన్లు పెరగవు.
శుక్రవారం సినిమా చూసి, శని, ఆదివారాలు ప్రేక్షకులు ఆస్పత్రులపాలవుతున్న కాలం ఇది. ప్రేక్షకుడికి ఏం కావాలో అది తీయకుండా , మీకు వచ్చింది తీస్తే రిజల్ట్ ఇదే. నెక్స్ట్ టైమ్ బెటర్ లక్.
- జీఆర్ మహర్షి.
ఇండస్ట్రీలోకి రాకుంటే ఏమయ్యదాన్నంటే!!

చాలా మంది చదువుకునే సమయంలోనే కెరియర్ ను బిల్డ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్ ఇలా పలు రంగాలలో సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. అయితే జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి. పలు కారణాల వల్ల తాము అనుకున్న కలలను కూడా పక్కకు నెట్టి.. వేరే రంగంలో స్థిరపడాల్సి వస్తుంది. అలా ఇప్పటికే ఎంతోమంది ఫలానా ఉద్యోగంలో సెటిల్ అవ్వాల్సింది పోయి ఇండస్ట్రీలోకి వచ్చామంటూ చెప్పుకొచ్చారు కూడా.. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా కూడా చేరిపోయారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతూ దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ఇండస్ట్రీలోకి రాకపోయి ఉండుంటే ఏమయ్యేవారో తెలిసి అందరిని ఆశ్చర్యపోతున్నారు.
హీరోయిన్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారో తెలుసా? అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది రాశి ఖన్నా. 1990 నవంబర్ 30న ఢల్లీిలో జన్మించిన ఈమె.. చదువులో చిన్నప్పటి నుంచి ముందుండేది. ఢల్లీి యూనివర్సిటీలో ఇంగ్లీష్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. డిగ్రీ చదువుతున్నప్పుడే కొన్ని అడ్వర్టైజ్మెంట్ లకు కాపీ రైటింగ్ జాబ్ కూడా చేసింది. మరొకవైపు అకాడమిక్స్ లో టాపర్ గా నిలిచిన ఈమె ఐఏఎస్ ఆఫీసర్ గా మారి అడ్మినిస్ట్రేటివ్ సేవలు అందించాలని కలలు కందట . కానీ ఊహించని విధంగా వచ్చిన సినిమా ఆఫర్లతో కెరియర్ మొత్తాన్ని మార్చేసుకుంది. అలా రాశి ఖన్నా సినిమాలలోకి రాకపోయి ఉండుంటే.. నేడు ఐఏఎస్ ఆఫీసర్గా తన కలను నెరవేర్చుకునేదట. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రాశి ఖన్నా కెరియర్.. రాశి ఖన్నా కెరియర్ విషయానికి వస్తే.. డిగ్రీ చదువుతున్నప్పుడే మోడలింగ్లో అవకాశాలు రావడంతో అలా మోడలింగ్ వైపు వెళ్లిన ఈమె.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనూహ్యంగా మోడలింగ్లో అవకాశాలు రావడం. అట్నుంచి సినిమాల్లోకి వెళ్లడం అన్ని ఒక కలలా మారిపోయాయట. అలా అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. మోడలింగ్ తో కెరియర్ ఆరంభం.. మోడలింగ్ చేస్తున్న సమయంలో సుజీత్ సర్కారు దర్శకత్వంలో 2013లో విడుదలైన పొలిటికల్ స్పై థ్రిల్లర్ ‘మద్రాస్ కేఫ్’ లో అవకాశం లభించింది. ఇందులో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ క్యారెక్టర్ పోషించిన జాన్ అబ్రహం భార్య రూబీ సింగ్ అనే క్యారెక్టర్ పోషించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాతే తెలుగులో అవకాశాలు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత మనం, వెంకీ మామ, తొలిప్రేమ, థాంక్యూ, సర్దార్ ఇలా వరుస చిత్రాలతో మంచి విజయాలనే సొంతం చేసుకుంది.
-తుపాకి.కామ్ సౌజన్యంతో...










Comments