ఏదయా.. యూరియా?
- BAGADI NARAYANARAO

- 14 hours ago
- 2 min read
నేతలు సిఫార్సు చేసిన వారికే సరఫరా
సామాన్య రైతులకు ప్రైవేట్ డీలర్లే శరణ్యం
అక్కడ అధిక రేట్లు, పురుగు మందుల షరతులు
అసంతప్తితో రోడ్డెక్కుతున్న అన్నదాత

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో రబీ సీజనుకు అవసరమైనంత యూరియా సరఫరా కాలేదని రైతు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఖరీఫ్‌లోనూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కి పోరాటాలు చేయడాన్ని దష్టిలో ఉంచుకుని రబీలోనైనా యూరియా అందుబాటులో ఉంచుతారని ఆశించిన రైతులకు ఇప్పుడూ చుక్కెదురైంది. టీడీపీ నాయకుల మితిమీరిన జోక్యం వల్ల రైతులందరికీ యూరియా అందడంలేదు. నేతలు చెప్పినవారికే అధికారులు సరఫరా చేస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనివల్ల సామాన్య రైతులు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేసుకోవాల్సి వస్తున్నదని అంటున్నారు. రెండు రోజుల క్రితం గార మండలంలో జరిగిన ఉదంతమే దీనికి నిదర్శనం. వమరవల్లి పంచాయతీలో కోఆపరేటివ్ సొసైటీ ద్వారా సుమారు 25 టన్నులు యూరియా విక్రయించారు. అయితే యూరియా వచ్చిందన్న సమాచారాన్ని రైతులందరికీ చేరవేయకుండానే సొసైటీ అధికారులు, మండల వ్యవసాయ అధికారుల సమక్షంలో అధికార పార్టీ స్థానిక నాయకులు తమకు ఇష్టమైన వారికి అమ్ముకున్నారని రైతులు ఆరోపించారు. దీనికి నిరసనగా గ్రామ రైతులు స్థానిక రైతుసేవా కేంద్రం వద్ద ధర్నా కూడా చేశారు. యూరియా పంపిణీకి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈకేవైసీ చేసి యూరియా పంపిణీ చేయాల్సి ఉన్నా.. అలా చేయలేదని ఆరోపించారు. ఇది ఒక గ్రామానికి పరిమితమైన సమస్య కాదని, జిల్లాలో రబీ పంటలు వేసిన అన్ని ప్రాంతాల్లోనూ ఇలాగే ఉందని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అబ్బే.. కొరత లేదు!
జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 2.15 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది 1.78 లక్షల ఎకరాýనే అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. కానీ ఇప్పటివరకు 1.33 లక్షల ఎకరాల్లోనే పంటలు వేసినట్లు నమోదైంది. సాగు అనుకూలతను దష్టిలో ఉంచుకుని రైతులు 54 వేల ఎకరాల్లో రాగులు, చెరుకు, వేరుశనగ, మొక్కజొన్న పంటలు వేశారు. మినప 42 వేలు, పెసర 27 వేల ఎకరాల్లో సాగవుతున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు కొన్ని ప్రాంతాల్లో వరి చేస్తున్నారు. అయితే రబీలో వరి సాగు చేయొద్దని సాక్షాత్తు వ్యవసాయ మంత్రే రైతులకు సూచించారు. నీటి వనరుల లభ్యతను అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కానీ రబీ సాగు అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందలేదని రైతులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు 17,921 మెట్రిక్ టన్నుల యూరియా కావాలని అధికారులు ప్రతిపాదించారు. ఆ మేరకు జిల్లాకు వచ్చిన యూరియా రైతులకు మాత్రం అందడం లేదని విమర్శలు ఉన్నాయి. నానో యూరియా అందుబాటలో ఉన్నా రైతులు తీసుకోవడం లేదు. కొందరు రైతులు యూరియా కోసం రాజకీయ నేతలను ఆశ్రయిస్తుండగా వారు తమకు అనుకూలమైన వారికే అధికారుల ద్వారా టోకెన్లు ఇప్పిస్తున్నారు. ఈ రకమైన వివక్షను గుర్తించిన రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. రైతుసేవా కేంద్రాల పరిధిలో పంటల సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసి యూరియా సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. రైతు సేవా కేంద్రాలు, రిటైల్, హోల్‌సేల్ డీలర్ల వద్ద ఉన్న బఫర్ స్టాక్ రికార్డుý ప్రకారం యూరియా అందుబాటులో ఉన్నట్లు చూపిస్తున్నా రైతులకు మాత్రం అందడంలేదని ప్రజాసంఘాల నాయకులు చెబుతున్నారు. యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి చెబుతున్నారు. జిల్లా అవసరాలకు మించి అందుబాటులో ఉందంటున్నారు. యూరియా కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించవద్దని రైతులకు సూచిస్తున్నారు. అయితే అధికారుల ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ప్రభుత్వ సబ్సిడీ యూరియా దొరక్కపోవడంతో రైతులు ప్రైవేట్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం రైతుసేవా కేంద్రాల ద్వారా రూ.260కు అందిస్తుండగా ప్రైవేట్ డీలర్లు యూరియా బస్తాను రూ.500కు విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొందరు డీలర్లు పురుగు మందులు కొంటేనే యూరియా ఇస్తామంటూ షరతు పెడుతున్న పరిస్థితి కూడా ఉందని తెలిసింది.










Comments