top of page

ఏపీసీ చెలగాటం.. ఎమ్మెల్యేకు ఇరకాటం!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Aug 21, 2025
  • 3 min read
  • సెలవుల్లో సౌమ్యపై వేటు.. శశిభూషణ్‌ నిర్వాకంతో చేటు!

  • ప్రిన్సిపాల్‌ కేసులో కూన రాజకీయాన్ని ఫణంగా పెట్టిన ఏపీసీ

  • విచారణ జరిపించినట్లు తప్పుదారి పట్టించి సొంత నిర్ణయాలు

  • ఎస్‌పీడీ, జిల్లా కోఆర్డినేటర్‌ దృష్టిలో పెట్టకుండా నేరుగా కలెక్టర్‌కే ఫైలు

  • వ్యతిరేకుల కుట్రలో ఆయన భాగమయ్యారా అన్న అనుమానాలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

అమెరికా సంయుక్త రాష్ట్రాల పర్యటన ముగించుకుని శ్రీకాకుళం వస్తున్న సందర్భంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు భారీ స్వాగత ఏర్పాట్లు జరిగాయి. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఆమదాలవలస వరకు రహదారులన్నింటినీ స్వాగత ఫ్లెక్సీలతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు నింపేశారు. దాంతో ఏదో జరుగుతోందన్న చర్చ రేగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమెరికా వెళ్లడం రవికి ఇది రెండోసారి. కానీ మొదటిసారి లేనంతగా రెండోసారి పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు జరిగాయంటే.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు లభిస్తుందేమోనన్న టాక్‌ కూడా నడిచింది. సీన్‌ కట్‌ చేస్తే.. రవికుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్‌ రోడ్డుకెక్కారు. ఆ కథ ఎన్ని మలుపులు తీసుకుందో పాఠకులకు తెలుసు. బంగారం లాంటి అవకాశాన్ని జిల్లాలో సొంత పార్టీ నేతలే కుట్ర చేసి చెడగొట్టారని రవి అభిమానులు భావిస్తుంటే.. వైకాపా నేతలే ఓ పథకం ప్రకారం తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూన రవికుమార్‌ ఆరోపించారు. ఈ రెండిరట్లో ఏది వాస్తవమనేది కాసేపు పక్కన పెడితే కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాల మేరకు సమగ్రశిక్ష ఏపీసీ శశిభూషణ్‌ స్వామిభక్తి, అత్యుత్సాహం వల్ల పొందూరు కేజీబీవీ విషయంలో కూన రవికుమార్‌ ఒకటికి పదిసార్లు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది.

సెలవుల్లో అంత అవసరమా?

ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై సొంత పార్టీ నేతలు లేదా ప్రతిపక్షం కుట్ర పన్నిందా? అన్న విషయం పక్కన పెడితే.. వారితో ఏపీసీ కుమ్మక్కయ్యారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే.. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్‌పై ఆరోపణలు వచ్చాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరిన మరుక్షణమే ఏపీసీ ఆగమేఘాల మీద కలెక్టర్‌ ముందు ఫైలు పెట్టి బదిలీ చేయించారు. విడ్డూరమేంటంటే.. శుక్ర, శని, ఆదివారాలు మూడు రోజులూ ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు వచ్చాయి. ఆ సెలవుల్లోనే మధ్యరోజు ప్రిన్సిపాల్‌ సౌమ్యను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. సెలవు రోజు బదిలీ చేయాల్సిన అవసరం ఏమిటనేది ఏపీసీకి చెప్పకపోయినా దాని ప్రభావం ఎమ్మెల్యే కూనపై పడిరది. వాస్తవానికి ప్రిన్సిపాళ్ల నియామక అధికారం సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (ఎస్‌పీడీ) చేతిలో ఉంటుంది. అలాంటప్పుడు ఒక ప్రిన్సిపాల్‌ను అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌లో బదిలీ చేయాల్సి వస్తే ఆ విషయాన్ని ఎస్‌పీడీ దృష్టిలో పెట్టాలి. ఏపీసీ శశిభూషణ్‌ అలా కాకుండా నేరుగా కలెక్టర్‌కు ఫైల్‌ పెట్టి బదిలీ ఉత్తర్వులిచ్చేశారు.

ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం

అక్కడితో ఆగకుండా సౌమ్య ఆరోపణలు చేసిన నేపథ్యంలో జిల్లాలో ఏం జరుగుతోందని ఏపీసీకి ఫోను చేసి కూన రవి ఆరా తీసినప్పుడు అవాస్తవాలు చెప్పి ఆయన్ను తప్పుదోవ పట్టించారు. ఇక్కడే రవికుమార్‌ ఇరుక్కున్నారు. ప్రిన్సిపాల్‌ సౌమ్యపై వచ్చిన ఆరోపణలపై ఆర్‌జేడీతో విచారణ జరిపించామని, వాస్తవాలని తేలిన తర్వాత కంచిలికి బదిలీ చేశామని శశిభూషణ్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు. దాన్ని నమ్మిన రవికుమార్‌ విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆర్‌జేడీ ఎంక్వైరీ చేశారని, ఆమెపై ఆరోపణలు వాస్తవమని తేలిందని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం వేరు. సౌమ్యకు బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం, దానిపై గొడవ ముదిరిన తర్వాతే ఆర్‌జేడీ విచారణకు వచ్చారు. ఆయన ఏమేరకు నివేదిక ఇచ్చారో తెలియదు. ఇప్పుడు ఈ గందరగోళంలో అందరి పాత్ర ఉండటంతో బహుశా బ్యాక్‌డేట్‌ వేసి నివేదికలు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరంలేదు. దీనివల్ల ఏపీసీ తప్పించుకోవచ్చు. కానీ ప్రజాక్షేత్రంలో ఉండే ఎమ్మెల్యేలను నిత్యం ప్రజలు గమనిస్తుంటారు. నిజంగా ఆర్‌జేడీ విచారణ జరిపి ఉంటే.. కలెక్టర్‌ ఈ వ్యవహారంపై మళ్లీ విచారణకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ను ఎందుకు నియమిస్తారనే దానికి ఏపీసీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కూన రవికుమార్‌ పొందూరు ప్రిన్సిపాల్‌పై లేఖ ఇచ్చారు సరే.. మరి కంచిలి ప్రిన్సిపాల్‌ను కదిపేయమని, గార ప్రిన్సిపాల్‌ను పొందూరు వేయమని ఎవరు లేఖ ఇచ్చారంటూ స్వయంగా డీటీఎఫ్‌ నాయకుడు పేడాడ కృష్ణారావు ప్రశ్నించడం చూస్తే కూన రవికుమార్‌ లేఖ మాటున మరో ఇద్దరికి స్థానచలనం కలిగించడం వెనుక ఏపీసీ ఏదో ఒక ప్రయోజనం పొంది ఉంటారని అర్థమవుతోంది.

కూన రవి లేఖ ఇచ్చారన్నది సాకే!

రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని కేజీబీవీలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. బాలికల చదువు మాటెలా ఉన్నా.. అధికారులకు, అక్కడ పని చేస్తున్న సిబ్బందికి సంపద సృష్టించే కేంద్రాలివి. అందుకే లక్షలాది రూపాయలు ఖర్చుచేసి మరీ అర్హత లేనివారు జిల్లా ఏపీసీగా వస్తుంటారు. ప్రతి కేజీబీవీలోనూ నిధుల దుర్వినియోగం, కొనుగోళ్లలో మతలబులు ఉంటాయి. తిలా పాపం.. తలా పిడికెడు మాదిరిగా వాటిలో వాటాలు ఏపీసీ వరకు చేరుతుంటాయి. దీనికి ఎవరూ అతీతులు కాదు. అందుకే ఆరోపణలు ఒక్కరికే పరిమితం కాదు. దాదాపు అందరు కేజీబీవీ ప్రిన్సిపాళ్ల పరిస్థితి అలాగే ఉంటుంది. అయితే ఏపీసీ కార్యాలయానికి కూడా వాటాలిస్తుండటం వల్ల వీరిపై చర్యలకు ఉపక్రమించరు. అలాగని ఫిర్యాదులు లేవా అంటే.. ప్రతి కేజీబీవీ మీద కట్టలకొద్దీ ఆరోపణలున్నాయి. ఇప్పుడు రవికుమార్‌ ఫిర్యాదు నెపంతో సౌమ్యను బదిలీ చేయాల్సివచ్చింది. ఆర్‌జేడీ విచారణలో కూడా కూన రవికుమార్‌ లేఖ మేరకే బదిలీ చేశామని ఏపీసీ చెప్పుకొచ్చినట్టు భోగట్టా.

సోషల్‌ మీడియాలో కులాల కుమ్ములాట

అసలు ఆరోపణలేంటి? ఎవరు విచారణ జరిపారు? అన్న విషయాలపై ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఏపీసీ నోరు విప్పలేదు. దీంతో ఇది కులాల మధ్య చిచ్చుగా మారింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన దగ్గరనుంచి జిల్లాల్లో రెండు ప్రధాన సామాజికవర్గాలు సామాజిక మాధ్యమాల వేదికగా ఎడతెరిపిలేని యుద్ధం చేస్తున్నాయి. వీటిని బయటవారు గుర్తించలేకపోవచ్చుగానీ పార్టీ అధిష్టానం మాత్రం ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటోంది. ఎమ్మెల్యే, ఏపీసీ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో దళిత సంఘాలు దీన్ని ఆ కోణంలోనే చూస్తున్నాయి. సమగ్రశిక్ష ప్రాజెక్టుకు జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తుంటారు. ఆ తర్వాతే అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ ఉంటారు. అలాంటప్పుడు సౌమ్యపై వచ్చిన ఆరోపణలను సమగ్రశిక్ష ఎస్‌పీడీ, జిల్లా విద్యాశాఖాధికారి దృష్టిలో పెట్టిన తర్వాత ఎంక్వైరీ నివేదికను జతపర్చి బదిలీకి సిఫార్సు చేస్తూ కలెక్టర్‌కు ఫైల్‌ పెట్టాలి. ఇవేవీ చేయకుండానే కూన రవిని ఏపీసీ తప్పుదోవ పట్టించారు. ఎమ్మెల్యే రవికుమార్‌ పొందూరు ప్రిన్సిపాల్‌ను మానసికంగా, శారీరకంగా వేధించారా? లేదా? అన్న కోణం పక్కన పెడితే.. ఆమె బదిలీపై మీడియా ముందుకు రావాల్సిన ఏపీసీ ఇది కేవలం కూన రవి, సౌమ్యల మధ్య గొడవగానే వదిలేశారు. వాస్తవానికి యూనియన్లు మొదటిరోజు ఏపీసీ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సమగ్రశిక్ష కార్యాలయం ముందు నిరసన చేపట్టాయి. కానీ మరుసటి రోజు నుంచి ఈ కథను కూన రవి చుట్టూనే తిప్పి చంద్రబాబు వరకు తీసుకువెళ్లాయి. కూన రవిపై వచ్చిన ఆరోపణలను జిల్లాలో సాటి ఎమ్మెల్యేలెవరూ ఖండిరచకపోగా.. ఏపీసీ అనాలోచిత చర్యలు సౌమ్యకు మద్దతు పెరగడానికి దోహదపడ్డాయి. ఇప్పుడిది చినికి చినికి గాలివానగా మారింది. ప్రతిపక్షం దీన్ని ఒడిసిపట్టుకుంది.

అధికార పక్షంలో కూన వ్యతిరేకులు ఏం చేస్తున్నారేది మరో శీర్షికలో తెలుసుకుందాం.

సెలవు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం, ఎంక్వైరీ చేయకుండానే పూర్తయిందని రవికుమార్‌కు సమాచారం ఇవ్వడం, ఎస్‌పీడీ, కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించడం వంటివి చూస్తుంటే కచ్చితంగా ఎవరో.. ఎవరితోనో చేతులు కలిపినట్లు అర్థమవుతుంది. ఇది ఏంటనేది మరో కథనంలో తెలుసుకుందాం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page